చైనా యూనిట్లకు ఇండియాలో రెడ్​కార్పెట్​

చైనా నుంచి బయటకు వచ్చి మనదేశంలో ప్లాంట్లు నిర్మించే కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని, ట్యాక్స్‌‌ హాలిడే ఇవ్వాలని వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రతిపాదించింది. రాయితీలు ఇవ్వడంతోపాటు దేశంలోని తీరప్రాంతాల వెంట ఇండస్ట్రియల్‌‌ జోన్స్‌‌ ఏర్పాటు చేసి, స్థానిక కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ఫలితంగా మేకిన్‌‌ ఇండియా కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని తెలిపింది. ఈ ప్రతిపాదనలపై ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌‌ త్వరలో నిర్ణయం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది.

న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా చైనాతో వాణిజ్యయుద్ధం చేస్తుండటం వల్ల చాలా కంపెనీలు ఇబ్బందిపడుతున్నాయి. చైనాకు బదులు ఇతర దేశాల్లో తయారీ మొదలుపెట్టాలని భావిస్తున్నాయి. ఇలాంటి కంపెనీల ఆకర్షించి ఇండియాకు తీసుకురావాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుకుంటున్నది. వీటికి ప్రిఫరెన్షియల్‌‌ ట్యాక్స్‌‌ రేట్స్‌‌, ట్యాక్స్‌‌ హాలీడే వంటి పన్ను రాయితీలు కల్పించాలనే ప్రతిపాదనలను పరిశీలిస్తోంది. వియత్నాం వంటి ఆసియా దేశాలు ఇది వరకే ట్యాక్స్‌‌ హాలిడే విధానాలను అమలు చేస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్‌‌, వినియోగదారుల పరికరాలు, కరెంటు వాహనాలు, పాదరక్షలు తయారు చేసే కంపెనీలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర వాణిజ్యమంత్రిత్వశాఖ రూపొందించిన డాక్యుమెంట్‌‌ ప్రభుత్వానికి సూచించింది. టారిఫ్‌‌లు తగ్గించడం ద్వారా వియత్నాం, మలేసియా వంటి దేశాలు భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగాయి. దిగుమతులను తగ్గించడంతోపాటు ఎగుమతులను మరింత పెంచాలనే లక్ష్యసాధనలో భాగంగా వాణిజ్యమంత్రిత్వశాఖ ప్రోత్సాహకాల ప్రతిపాదన చేసినట్టు సమాచారం.

కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌‌ దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై స్పందించానికి వాణిజ్యమంత్రిత్వశాఖ ఒప్పుకోలేదు. ఇండియాలో ఉత్పత్తి మొదలుపెట్టాలనుకునే కంపెనీలకు రాయితీలు ఇవ్వడంతోపాటు దేశంలోని తీరప్రాంతాల వెంట ఇండస్ట్రియల్‌‌ జోన్స్‌‌ ఏర్పాటు చేసి, స్థానిక కంపెనీలకు ప్రాధాన్యం ఇవ్వాలని వాణిజ్యమంత్రిత్వశాఖ సూచించింది. ఫలితంగా మేకిన్‌‌ ఇండియా కార్యక్రమానికి ప్రోత్సాహం ఇచ్చినట్టు అవుతుందని భావిస్తోంది. చైనాతో వాణిజ్యలోటును మరింత తగ్గించుకోవడానికి ఉత్పత్తిరంగాన్ని మరింత ప్రోత్సహిం చడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. చైనా కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తే ఇక్కడ స్మార్ట్‌‌ఫోన్లు, విడిభాగాలు, గృహోపకరణాలు, కరెంటు వాహనాలు, కిచెన్‌‌వేర్‌‌ వంటి ఉత్పత్తి పెరుగుతుంది. ప్రస్తుతం ఇలాంటి వస్తువులు 95 శాతం దిగుమతుల ద్వారానే వస్తున్నాయి. వాణిజ్యయుద్ధం కారణంగా అమెరికా ఆపిన సెక్టార్లలో ఎగమతులను పెంచడానికి కూడా ఇండియా కృషి చేస్తోంది.

ఇండియా అనుకూలం

త్వరలో  దాదాపు 200 కంపెనీలు ఇండియాకు రానున్నాయని,  చైనాకు ప్రత్యామ్నాయం ఇండియాయేనని, ఇక్కడ అద్భుత అవకాశాలు ఉన్నాయని ఇవి భావిస్తున్నాయని అమెరికా–ఇండియా స్ట్రాటెజిక్‌‌ అండ్‌‌ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ఫోరమ్‌‌ (యూఎస్‌‌ఐఎస్‌‌పీఎఫ్‌‌) ఇటీవల తెలిపింది. ఈ సంస్థ అధ్యక్షుడు ముఖేశ్‌‌ అగి మాట్లాడుతూ చైనా నుంచి వచ్చి ఇండియాలో పెట్టుబడులు ఎలా పెట్టాలని కంపెనీల ప్రతినిధులు అడుగుతున్నారని వెల్లడించారు. కొత్త కంపెనీలను ఆకర్షించడానికి త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయాలని, నిర్ణయాలు తీసుకునేటప్పుడు పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. ‘‘ప్రభుత్వ నిర్ణయాలు కీలకం. పాలన మరింత పారదర్శకంగా ఉండాలని, సంప్రదింపులకు అవకాశం ఇవ్వాలని మేం సూచిస్తాం. ఈ–కామర్స్‌‌, డేటా లోకలైజేషన్‌‌ వంటి పరిణామాలను అమెరికా కంపెనీలు జాగ్రత్తగా గమనిస్తున్నాయి’’ అని చెప్పారు.

 

 

 

Latest Updates