ప్రాక్టీస్ లో పల్టీ: తొలి వామప్ లో ఇండియా చిత్తు

లండన్‌‌: ఇంగ్లండ్‌‌ ఇలాఖాలో ఇండియా ప్రాక్టీస్‌‌ అదరలేదు. విమానం దిగిన వెంబడే వీరోచితంగా నెట్‌‌ ప్రాక్టీస్‌‌ మొదలుపెట్టినా.. మైదానంలోకి వచ్చేసరికి అన్ని మర్చిపోయారు. పరిస్థితులను అంచనా వేయలేక.. బంతి స్వింగ్‌‌ను అర్థం చేసుకోలేక.. చేజేతులా మూల్యం చెల్లించుకున్నారు. దీంతో శనివారం జరిగిన తొలి వామప్‌‌ మ్యాచ్‌‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌‌ చేతిలో చిత్తయింది. టాస్‌‌ గెలిచిన ఇండియా 39.2 ఓవర్లలో 179 పరుగులకే కుప్పకూలింది. పేస్‌‌ వికెట్‌‌పై కివీస్‌‌ పేసర్‌‌ ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ (4/33) నిప్పులు చెరిగాడు. బంతిని అద్భుతంగా స్వింగ్‌‌ చేస్తూ టీమిండియా టాప్‌‌ ఆర్డర్‌‌ను కకావికలం చేశాడు. తొలి స్పెల్‌‌లో మూడు వికెట్లు తీసి విరాట్‌‌సేనను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. ఫుట్‌‌వర్క్‌‌తో ఇబ్బందిపడ్డ రోహిత్‌‌ (2) రెండో ఓవర్‌‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

బౌల్ట్​ తన తర్వాతి ఓవర్‌‌లో ఓ మెరుపు ఇన్‌‌ స్వింగర్‌‌తో ధవన్‌‌ (2)ను.. కొద్దిసేపటికే కేఎల్‌‌ రాహుల్‌‌ (6)ను పెవిలియన్‌‌కు పంపి మ్యాచ్‌‌పై పట్టు బిగించాడు. వన్‌‌డౌన్‌‌లో కెప్టెన్‌‌ కోహ్లీ (18) నిలకడగా ఆడే ప్రయత్నం చేసినా.. సక్సెస్‌‌ కాలేకపోయాడు. రెండువైపుల నుంచి పదునైన అటాకింగ్‌‌తో కివీస్‌‌ పేసర్లు పెట్టిన ఒత్తిడికి తలొగ్గాడు. 11వ ఓవర్‌‌లో గ్రాండ్‌‌హోమ్‌‌ వేసిన ఆఫ్‌‌ కట్టర్‌‌ను క్రాస్‌‌ బ్యాట్‌‌తో ఆడబోయి క్లీన్‌‌బౌల్డ్‌‌ అయ్యాడు. దీంతో టీమిండియా 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో ఇన్నింగ్స్‌‌ను గట్టెక్కించే బాధ్యత తీసుకున్న హార్దిక్‌‌ (37 బంతుల్లో 6 ఫోర్లతో 30), ధోనీ (17) నిలకడగా ఆడేందుకు ప్రయత్నించారు. కుదురుకోవడానికి సమయం తీసుకున్న మహీ.. వికెట్ల మధ్య చురుకుగా పరుగెత్తలేకపోయాడు. దీంతో స్ట్రయిక్‌‌ రొటేట్‌‌ చేయలేక క్రీజులో చాలా ఇబ్బందిపడ్డాడు.

ధోనీ, హార్దిక్‌‌.. పడుతూ లేస్తూ ఐదో వికెట్‌‌కు 38 పరుగులు జోడించాకా.. రెండో స్పెల్‌‌కు వచ్చిన నీషమ్‌‌ (3/26).. ఐదు బంతుల తేడాలో రెండు వికెట్లు తీసి ఇండియాను మళ్లీ కష్టాల్లోకి నెట్టాడు. ముందుగా  నీషమ్‌‌ వేసిన సీమ్‌‌ డెలివరిని క్రాస్‌‌ చేసే ప్రయత్నంలో హార్దిక్‌‌ బ్యాట్‌‌ ఎడ్జ్‌‌ తీసుకుంది. నాలుగు బంతుల తర్వాత కార్తీక్‌‌ కూడా ఇదే తరహాలో వికెట్‌‌ సమర్పించుకున్నాడు. ఇక ధోనీతో జతకలిసిన జడేజా ఆచితూచి ఆడాడు. బంతిని సరిగ్గా అంచనా వేస్తూ కచ్చితమైన షాట్లతో ముందుకెళ్లాడు. కానీ స్వల్ప విరామాల్లో ధోనీ, భువనేశ్వర్‌‌ (1) ఔట్‌‌కావడంతో జట్టు స్కోరు 115/8 గా మారింది. ఈ దశలో వచ్చిన కుల్దీప్‌‌ (19).. జడేజాకు చక్కని సహకారం అందించాడు. ఈ ఇద్దరు కలిసి సాధికారిక షాట్లతో ఇన్నింగ్స్‌‌ను నడిపించారు. అర్ధసెంచరీ చేసిన జడ్డూ.. కుల్దీప్‌‌ తొమ్మిదో వికెట్‌‌కు 62 పరుగులు జోడించడంతో టీమిండియా ఆ మాత్రం స్కోరైనా సాధించింది.

కివీస్​ అలవోకగా..
180 పరుగుల టార్గెట్‌‌ను.. న్యూజిలాండ్‌‌ 37.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వెటరన్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ రాస్‌‌ టేలర్‌‌ (75 బంతుల్లో 8 ఫోర్లతో 71), కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌ (87 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌‌తో 67) అర్ధసెంచరీలతో చెలరేగారు. ఆరంభంలో ఇండియా పేసర్లు కాస్త ప్రభావం చూపినా.. మ్యాచ్‌‌ మధ్యలో కివీస్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను కట్టడి చేయలేకపోయారు. ఓపెనర్లలో మన్రో (4),  గప్టిల్‌‌ (22) శుభారంభాన్నివ్వలేకపోయారు. బుమ్రా, భువీ పేస్‌‌ను అర్థం చేసుకోలేక భారీ షాట్లు కొట్టలేకపోయారు. దీంతో 10 ఓవర్లు ముగియకముందే ఈ ఇద్దరు పెవిలియన్‌‌కు చేరడంతో కివీస్‌‌ స్కోరు 37/2గా మారింది. ఈ దశలో కెప్టెన్‌‌ విలియమ్సన్‌‌, టేలర్‌‌ తమ అనుభవాన్ని రంగరించారు. టార్గెట్‌‌ చిన్నది కావడంతో పెద్దగా ఇబ్బంది పడలేదు. టీమిండియా పేస్‌‌ త్రయాన్ని ఆచితూచి ఆడుతూనే నిలకడగా పరుగులు సాధించారు. ఈ ఇద్దరు మూడో వికెట్‌‌కు 114 పరుగులు జోడించడంతో కివీస్‌‌ విజయం సులువైంది. ఈ క్రమంలో ఇద్దరూ అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. స్వల్ప విరామాల్లో వీళ్లిద్దరు ఔటైనా.. నికోలస్‌‌ (15 నాటౌట్‌‌) విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

ఇండియా: 39.2 ఓవర్లలో 179 ఆలౌట్‌ (జడేజా 54, హార్దిక్‌ 30, బౌల్ట్‌ 4/33, నీషమ్‌ 3/26);

న్యూజిలాండ్‌: 37.1 ఓవర్లలో 180/4 (టేలర్‌ 71, విలియమ్సన్‌ 67, బుమ్రా 1/2, పాండ్యా 1/26, జడేజా 1/27).

Latest Updates