కరోనా కేసుల్లో ఇండియా రెండో ప్లేస్

 

  • 42 లక్షలకు పైగా బాధితులు.. 71,687 మంది బలి
  • ఒక్కరోజే 91,723 మందికి పాజిటివ్​
  • రోజూ 10 లక్షలకు పైగానే టెస్టులు
  • టెస్టింగ్​పై కొత్త గైడ్​లైన్స్​ ఫాలో కావాలని రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం
  • అడిగినోళ్లందరికీ టెస్టులు చేసేలా వసతులు పెంచాలని సూచన

న్యూఢిల్లీ:  కరోనా కేసుల్లో బ్రెజిల్​ను మన దేశం దాటేసింది. సరిగ్గా రెండు నెలల్లోనే మూడో స్థానం నుంచి రెండో ప్లేస్​కు వెళ్లింది. దేశంలో టెస్టులతో పాటే కరోనా కేసులూ పెరుగుతున్నాయి. ప్రపంచంలోనే రోజు వారీ కేసులు 90 వేలు దాటిన ఫస్ట్​ దేశంగానూ ఇండియా నిలిచింది. శనివారం, ఆదివారం వరుసగా కేసులు 90 వేల మార్కును దాటాయి. శనివారం 90,600 కేసులు రాగా.. ఆదివారమూ అంతకుమించి వచ్చాయి. 91,723 మందికి పాజిటివ్​ వచ్చింది.

మొత్తంగా కరోనా కేసులు 42 లక్షల మార్కును దాటాయి. 42 లక్షల 2 వేల 562 మంది దాని బారిన పడ్డారు. ఆదివారం 1,008 మంది చనిపోగా మొత్తంగా 71,687 మంది మహమ్మారికి బలయ్యారు. 9 లక్షల 7 వేల 212 కేసులు, 26,604 మరణాలతో మహారాష్ట్ర ఫస్ట్​ ప్లేస్​లో ఉంది. ఆదివారం అక్కడ రికార్డ్​ స్థాయిలో 23,350 కేసులొచ్చాయి.

జులైలో 11 లక్షలు.. ఆగస్టులో 20 లక్షలు

జులై 5న రష్యాను దాటి ఇండియా మూడో స్థానానికి వచ్చింది. అప్పటికి దేశంలో ఉన్న కేసులు 16.97 లక్షలే. ఒక్క జులైలోనే 11 లక్షలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత కేసులు మరింత భారీగా పెరగడం మొదలైంది. ఎప్పటికప్పుడు టెస్టుల సంఖ్య పెరుగుతుండడంతో పాజిటివ్​ కేసులూ బయటపడుతూ వచ్చాయి. ఆగస్టు నాటికి మొత్తం కేసులు 36.88 లక్షలకు పెరిగాయి. ఆగస్టులోనే దాదాపు 20 లక్షల దాకా కేసులొచ్చాయి. ఇక, ఈ నెల 1 నుంచి ఇప్పటిదాకా ఈ ఆరు రోజుల్లోనే దాదాపు 5 లక్షల కేసులు నమోదయ్యాయంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

రికవరీలు మెరుగు

ఓవైపు కేసులు పెరుగుతున్నా.. కోలుకుంటున్నోళ్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉండడం ఊరటనిచ్చే విషయం. ఇప్పటిదాకా కరోనా మహమ్మారి బారి నుంచి 32 లక్షల 44 వేల 607 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 77.24 శాతంగా ఉంది. డెత్​ రేటు 1.7 శాతంగా ఉంటోంది. ఇంకా 8 లక్షల 83 వేల 473 మంది పేషెంట్లు ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ఆదివారం 10 లక్షల 92 వేల 654 టెస్టులు చేశారు. దీంతో మొత్తం టెస్టుల సంఖ్య 4 కోట్ల 88 లక్షల 31 వేల 145కు పెరిగింది.

టెస్టులు పెంచండి

దేశంలో మొత్తం కేసుల్లో దాదాపు 70 శాతం కేసులు ఐదు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోనే ఉన్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్యను మరింత పెంచాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. కేసుల ప్రభావం ఎక్కువగా ఉన్న 35 జిల్లాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. టెస్టింగ్​పై కొత్త గైడ్​లైన్స్​ను ప్రతి రాష్ట్రమూ అమలు చేయాల్సిందేనని కేంద్రం తేల్చి చెప్పింది. అడిగినోళ్లందరికీ టెస్టులు చేయాలని చెప్పింది. అన్ని రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్​ భూషణ్​, ఐసీఎంఆర్​ డైరెక్టర్​ జనరల్​ డాక్టర్​ బలరాం భార్గవ లేఖలు రాశారు. ఎక్కువగా టెస్టులు చేసేలా వసతులు కల్పించాలని రాష్ట్ర సర్కార్లకు సూచించారు. టెస్టింగ్​ ప్రొటోకాల్​ను ఈజీ చేయాలని చెప్పారు.

Latest Updates