దేశంలో 896 కొత్త‌ క‌రోనా కేసులు: ఒక్క రోజులో భారీ నంబ‌ర్ ఇదే

భార‌త్ లో క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. శుక్ర‌వారం సాయంత్రానికి క‌రోనా బాధితుల సంఖ్య 6.761కి చేరిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. అందులో 206 మంది మ‌ర‌ణించ‌గా.. 516 మంది కోలుకుని ఆస్ప‌త్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. ఇంకా 6039 మందికి చికిత్స అందిస్తున్న‌ట్లు వివ‌రించింది. అయితే గ‌డిచిన 24 గంట‌ల్లోనే 896 కొత్త క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 37 మంది మ‌ర‌ణించార‌ని వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో ఒక్క రోజులో అత్య‌ధిక కేసులు న‌మోదైన రోజు ఇదే.

రెండు శాతం మాత్ర‌మే

దేశంలో క‌రోనా ఇన్ఫెక్ష‌న్ వ్యాప్తి త‌క్కువ‌గానే ఉందని చెప్పారు కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్. దేశ వ్యాప్తంగా నిన్న 16,002 శాంపిల్స్ టెస్ట్ చేయ‌గా.. అందులో రెండు శాతం మాత్ర‌మే పాజిటివ్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌మ్యూనిటీ ట్రాన్స్ మిష‌న్ లేద‌ని, భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని, జాగ్ర‌త్త‌గా ఉంటే చాల‌ని అన్నారాయ‌న‌. రాపిడ్ టెస్టు కిట్ల‌ను కూడా అందుబాటులోకి తెచ్చామ‌ని, వేగంగా ఎక్కువ మందికి టెస్టులు చేస్తామ‌ని చెప్పారు. అలాగే దేశంలో మ‌న‌కు కోటి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ అవ‌స‌రం ఉండ‌గా, మూడు కోట్ల 28 ల‌క్ష‌ల టాబ్లెట్స్ అందుబాటులో ఉంచామ‌ని తెలిపారు ల‌వ్ అగ‌ర్వాల్.

Latest Updates