వాటీజ్​ దిస్​ వాట్సాప్.. సంస్థ సీఈవోకి కేంద్రం లెటర్

  • కొత్త ప్రైవసీ పాలసీ వెనక్కి తీసుకోవాలని కోరిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మినిస్ట్రీ
  • ఘాటు మాటలతో వాట్సాప్ సీఈవోకి లెటర్
  • నేషనల్ సెక్యూరిటీనే మాకు ముఖ్యం
  • యూజర్ల అనుమతితోనే డేటా సేకరించాలి
  • త్వరలోనే డేటా చట్టం తెస్తాం..

న్యూఢిల్లీ: వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన ప్రైవసీ పాలసీలో మార్పులను వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. యూజర్లు, స్టేక్‌ హోల్డర్లందరి నుంచి అనుమతి లేకుండా ఏకపక్షంగా తీసుకొచ్చిన ఈ మార్పులు సరియైనవి కావని, ఆమోదయోగ్యం కూడా కావని పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌‌‌‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు వాట్సాప్ సీఈవో విల్‌‌‌‌ క్యాత్‌‌‌‌కార్ట్‌‌‌‌కి సీరియస్‌‌‌‌గా లెటర్ రాసింది. గ్లోబల్‌‌‌‌గా తీసుకుంటే ఇండియాలోనే  వాట్సాప్‌‌‌‌కు పెద్ద మొత్తంలో యూజర్లు ఉన్నారు. వాట్సాప్ సర్వీసులకు అతిపెద్ద మార్కెట్లలో ఇండియా ఒకటిగా ఉందని ఈ మినిస్ట్రీ పేర్కొంది. వాట్సాప్ టర్మ్స్ అండ్ కండిషన్లు, ప్రైవసీ పాలసీలో ప్రతిపాదించిన మార్పులు… ఇండియన్ సిటిజన్ల స్వేచ్ఛను, స్వయంప్రతిపత్తిని హరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతిపాదిత మార్పులను వెంటనే వాట్సాప్ వెనక్కి తీసుకోవాలని మినిస్ట్రీ కోరింది. అంతేకాక ఇన్‌‌‌‌ఫర్మేషన్ ప్రైవసీ, ఎంపిక చేసుకునే స్వేచ్ఛ, డేటా సెక్యూరిటీని మరోసారి సమీక్షించాలని తెలిపింది. అంతేకాక ఇండియన్ల ప్రైవసీని, డేటా  భద్రతను గౌరవించాలని పేర్కొంది. వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా 15వ ఇండియా డిజిటల్ సమిట్, కమ్యూనికేషన్స్‌‌‌‌లో స్పందించారు. నేషనల్ సెక్యూరిటీనే తమకు అత్యంత ముఖ్యమని చెబుతూ.. చైనాతో సహా ఇతర దేశాలకు చెందిన కంపెనీలు కూడా ఈ విషయంలో తమకు సమానమని అన్నారు. ఈ పాపులర్ మెసేజింగ్ యాప్ తీసుకొచ్చిన మార్పులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. పర్సనల్ కమ్యూనికేషన్‌‌‌‌కు ఎలాంటి భంగం వాటిల్లకూడదని,  యూజర్ల హక్కులను కాపాడాలని రవి శంకర్ ప్రసాద్ అన్నారు.

పేరెంట్ కంపెనీ ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌తో డేటా షేర్ చేసుకునే  ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సాప్‌‌‌‌కు ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే తమ ప్లాట్‌‌‌‌ఫామ్‌‌‌‌పై మెసేజ్‌‌‌‌లన్ని ఎండ్–టూ–ఎండ్ ఎన్‌‌‌‌క్రిప్టెడ్ అని, వాట్సాప్ కానీ ఫేస్‌‌‌‌బుక్‌‌‌‌ కానీ మీ వ్యక్తిగత మెసేజ్‌‌‌‌లను చూడదని ఓ వైపు నుంచి కంపెనీ క్లారిటీ ఇస్తూనే ఉంది. కానీ ప్రైవసీ పాలసీపై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ ఇష్యూను మా డిపార్ట్‌‌‌‌మెంట్ చూసుకుంటోందని  రవి శంకర్ ప్రసాద్ అన్నారు. అయితే వాట్సాప్ అయినా, ఫేస్‌‌‌‌బుక్ అయినా, మరే డిజిటల్ ప్లాట్‌‌‌‌ఫామ్ అయినా ఇండియాలో వ్యాపారం చేసుకునే స్వేచ్ఛను తాము కల్పిస్తాం కానీ ఇండియన్ల హక్కులు హరింపజేసేలా వీరి వ్యాపారాలు ఉండకూడదని హెచ్చరించారు. ఈ నెల ప్రారంభంలో వాట్సాప్ తన ప్రైవసీ పాలసీని అప్‌‌‌‌డేట్ చేస్తూ కొత్త టర్మ్ అండ్ కండీషన్లను తెచ్చింది. ఫిబ్రవరి 8 లోపల కొత్త టర్మ్స్‌‌‌‌కు అంగీకరించకపోతే.. మీ అకౌంట్‌‌‌‌ను డిలీట్ చేస్తామని పేర్కొంది. కానీ గ్లోబల్‌గా వ్యతిరేకత రావడంతో కొత్త పాలసీ అప్‌‌‌‌డేట్‌‌‌‌ను వాయిదా వేసింది.

డేటాకు అతిపెద్ద సెంటర్‌‌‌‌ మనదే

డేటా ప్రైవసీ, నేషనల్ సెక్యూరిటీ, నేషనల్ సావరినిటీ కారణంతోనే తాము కొన్ని యాప్స్‌‌ను బ్యాన్ చేశామని రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. కంపెనీలకు సంబంధించి ఏ ఎక్స్‌‌పోజర్ తీసుకున్నా.. నేషనల్ సెక్యూరిటీ అనేది తమకు అత్యంత కీలకమని అన్నారు. అది ప్రైవేట్ అయినా, ప్రభుత్వమైనా ఒకటే అని చెప్పారు.  డేటా సేకరణ గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు. సమ్మతి మేరకే డేటాను సేకరించాలని ప్రసాద్ అన్నారు. సమాచారాన్ని ఎందుకు సేకరించారో ఆ అవసరం కోసమే వాడాలన్నారు.  సేకరించిన డేటాను సురక్షితంగా ఉంచడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఇండియాలో 130 కోట్ల మంది జనాభా ఉండటంతో భారీ మొత్తంలో డేటా ప్రొడ్యూస్ అవుతుంది. ‘భవిష్యత్‌‌లో డేటా ఎకానమీలో ఇండియా అతిపెద్ద సెంటర్‌‌ కావాలని కోరుకుంటున్నా. డేటా ఎకానమీ గురించి మాట్లాడాలంటే.. డేటా క్లీనింగ్, డేటా ప్రాసెసింగ్, డేటా ఇన్నొవేషన్ అన్ని కలిసి ఉంటాయి. డేటా రిఫైనరీగా అవతరించడానికి ఇండియాకు మంచి అవకాశం ఉంది’ అని ప్రసాద్ పేర్కొన్నారు. ప్రపంచమంతా మన డేటా చట్టం గురించే చూస్తోందని, ఇది త్వరలోనే రాబోతుందని వెల్లడించారు.

పీఎల్ఐ స్కీమ్ సక్సెస్

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్‌‌‌‌ఐ) స్కీమ్ సక్సెస్‌‌‌‌పై మాట్లాడిన మంత్రి.. 2020 ఏప్రిల్‌‌‌‌లో కరోనా కష్టాల నుంచి గట్టెక్కడం కోసం ప్రభుత్వం ఈ స్కీమ్‌‌‌‌ను లాంచ్ చేసిందన్నారు. ఈ స్కీమ్‌‌‌‌ కోసం అన్ని టాప్ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్ల విలువైన మొబైల్ ఫోన్లు, ఎక్విప్‌‌‌‌మెంట్ తయారు చేసేందుకు వారు కట్టుబడి ఉన్నట్టు చెప్పారు. వీటిలో రూ.7 లక్షల కోట్లను ఎక్స్‌‌‌‌పోర్ట్ చేయనున్నట్టు పేర్కొన్నారు. మొబైల్ మాన్యుఫాక్చరింగ్‌‌‌‌కు ఇండియా హబ్‌‌‌‌గా ఉందన్నారు. ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌లకు, మెషిన్ 2 మెషిన్ ఎక్విప్‌‌‌‌మెంట్‌‌‌‌లకు ఇండియా అతిపెద్ద మాన్యుఫాక్చరింగ్ సెంటర్‌‌‌‌‌‌‌‌గా అవతరిస్తుందన్నారు. 5జీ మోడల్‌‌‌‌ను క్రియేట్ చేయాలని కంపెనీలకు చెప్పారు.

Latest Updates