గన్స్ కొనడంలో ఇండియా నెంబర్ 2

మిలటరీ దగ్గర ఎంత మోడర్న్ గన్స్ ఉంటే అంత స్ట్రాంగ్. ఎన్ని యుద్ధట్యాంకులు, ఫైటర్ జెట్లు, మిసైల్స్ ఎక్కువుంటే అంత పవర్ ఫుల్. అందుకే.. ఇప్పుడు చాలా దేశాలు డిఫెన్స్ కోసమే ఏటా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. చైనా, అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలేమో మిలటరీ పవర్ పెంచుకునేందుకు అటు కోట్లకు కోట్లు ఖర్చు చేయడంతో పాటు ఇటు మిగతా దేశాలకు వెపన్స్ అమ్ముతూ భారీగా సొమ్ము కూడా చేసుకుంటున్నాయి. మనదేశం మాత్రం వెపన్స్​ను అమ్మడంలో ఇప్పుడిప్పుడే పురోగతి సాధిస్తున్నా.. కొనడంలో మాత్రం ప్రపంచంలోనే నెంబర్ టూగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 2015 నుంచి 2019 మధ్యలో ఏయే దేశాలు ఆయుధాల దిగుమతులు ఎక్కువగా చేసుకున్నాయి? ఏయే దేశాలు ఆయుధాల అమ్మకంలో టాప్ ప్లేస్​లో ఉన్నాయన్న వివరాలతో కూడిన నివేదికను ‘స్టాక్ హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సిప్రి)’  విడుదల చేసింది.

మన వెపన్ ఇంపోర్ట్స్ 9.2% 

సిప్రి లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, 2015–19 మధ్యకాలానికి ఆర్మ్స్ ఇంపోర్ట్స్​లో సౌదీ అరేబియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో సౌదీ12% ఇంపోర్ట్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. సౌదీ తర్వాత రెండో స్థానంలో నిలిచిన ఇండియా 9.2% ఆయుధాలను దిగుమతి చేసుకుంది. మన పొరుగుదేశాల్లో చైనా 4.3% ఇంపోర్ట్స్​తో ఐదో స్థానంలో, పాకిస్తాన్ 2.6% ఇంపోర్ట్స్ తో 11వ స్థానంలో ఉన్నాయి.

ఇండియా, పాక్ కొనుగోళ్లు తగ్గినయ్..

ఇండియా, పాకిస్తాన్ ఆయుధాల కొనుగోళ్లు భారీగా తగ్గాయని రిపోర్ట్ వెల్లడించింది. ఇండియా వెపన్ ఇంపోర్ట్స్ 32% తగ్గగా, పాక్ ఇంపోర్ట్స్ 39% తగ్గాయని నివేదిక తెలిపింది. ఇప్పటికీ ఆయుధాల కోసం ఈ రెండు దేశాలూ విదేశాలపైనే ఆధారపడుతున్నాయని, కీలకమైన ఆయుధాలన్నింటినీ కొనాలని చూస్తున్నాయని పేర్కొంది. అయితే, మున్ముందు సొంత ఆయుధాలను తయారు చేయడంపై రెండు దేశాలు దృష్టి పెట్టాయంది.

‘బాలాకోట్’లో అన్నీ విదేశీ వెపన్సే..

గత ఏడాది ఫిబ్రవరిలో పీవోకేలోని బాలాకోట్ లో టెర్రరిస్టు స్థావరాలపై ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసిన సందర్భంగా రెండు దేశాలూ వాడిన వెపన్స్, విమానాలు, బాంబుల వంటివన్నీ విదేశాల నుంచి కొన్నవేనని సిప్రి ప్రస్తావించింది. ఇండియా ఫ్రెంచ్ మిరేజ్ 2000, రష్యన్ సుఖోయ్ 30ఎంకేఐ, మిగ్ 21 ఫైటర్ ప్లేన్​లతో పాటు ఇజ్రాయెలీ స్పైస్ 2000 బాంబులు, స్వీడిష్ బోఫోర్స్ గన్స్​తో రంగంలోకి దిగగా.. పాకిస్తాన్ అమెరికన్ ఎఫ్​16, చైనీస్ జేఎఫ్17 ఫైటర్ జెట్లను, స్వీడిష్ అవాక్స్ విమానాలను ఉపయోగించిందని రిపోర్ట్ వివరించింది.

పాక్ కు అమెరికా వెపన్స్ తగ్గినయ్.. 

పాకిస్తాన్ తన మొత్తం వెపన్ ఇంపోర్ట్స్ లో 73% చైనా నుంచే చేసుకుంటోంది.  తర్వాత రష్యా నుంచి 6.6%, ఇటలీ నుంచి 6.1% వెపన్స్ కొంటోంది. గతంలో పాకిస్తాన్ ఆయుధ దిగుమతుల్లో అమెరికా నుంచే 30% కొనుగోళ్లు ఉండేవి. కానీ పాక్​కు మిలటరీ సాయం ఆపేయాలని అమెరికా డిసైడ్ అయిన నేపథ్యంలో దిగుమతులు 4.1%కు పడిపోయాయి.

మేకిన్ ఇండియా ఊపందుకోలే..

ఆయుధాల దిగుమతిలో ఇండియా నెంబర్ టూగా నిలవడంపై సిప్రి ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దేశంలో డిఫెన్స్ ఇండస్ట్రీని బలోపేతం చేయడంలో ఎన్డీఏ సర్కారు ‘మేకిన్ ఇండియా’ పాలసీ కూడా సరిగ్గా అమలు కాలేదని, వాస్తవానికి ఈ విషయంలో సర్కారు ఫెయిల్ అయిందని అభిప్రాయపడింది. సొంతంగా డీజిల్ ఎలక్ట్రిక్ సబ్ మెరైన్లు, ఫైటర్స్ జెట్స్, లైట్ యుటిలిటీ హెలికాప్టర్లు, మైన్ స్వీపర్లు, ఇన్ఫాంట్రీ కంబాట్ వెహికిల్స్ తయారీకి ఆరేళ్లుగా ప్రయత్నిస్తున్నా, ఈ ప్రాజెక్టులు ఇంకా పట్టాలకు ఎక్కడం లేదని పేర్కొంది.

ఎగుమతుల్లో అమెరికా టాప్​

విదేశాల నుంచి ఆయుధాలను కొనడమే కాదు.. ఆయా దేశాలకు మన వెపన్స్​ను అమ్మడంలోనూ పురోగతి సాధిస్తున్నామని నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుధ ఎగుమతుల్లో అమెరికా నెంబర్ 1, రష్యా నెంబర్ 2గా నిలిచాయని పేర్కొంది. ఇక టాప్ 25 వెపన్ ఎక్స్ పోర్టర్లలో ఇండియా 23వ ప్లేస్ లో నిలిచిందని, ఇది ఒకరకంగా పాజిటివ్ అంశమేనని పేర్కొంది. మన దేశం ప్రపంచ వెపన్ ఎక్స్ పోర్ట్స్ లో ఇండియా వాటా కేవలం 0.2 శాతమే అయినా, మయన్మార్, శ్రీలంక, మారిషస్ వంటి దేశాలకు ఎక్కువ వెపన్స్ అమ్ముతున్నది మన దేశమేనని నివేదిక వివరించింది. ఇక 2015–16లో మన దేశం ఆయుధాల అమ్మకంతో రూ. 2,060 కోట్లు సంపాదించగా, 2018–19లో అది రూ.10,746 కోట్లకు పెరిగిందని పేర్కొంది. నిరుడు డిసెంబర్ 31 నాటికి రూ. 5,833 కోట్ల అమ్మకాలు సాధించిందని, వచ్చే ఐదేళ్లలో 5 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఎగుమతి చేయనున్నట్లు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇటీవల వెల్లడించారని, ఇది కాస్త ఆశాజనకంగానే ఉందని నివేదిక ప్రస్తావించింది.

రష్యా నుంచే ఎక్కువ కొంటున్నం..

ఇండియాకు 2010–-14, 2015–-19 సంవత్సరాల్లో ఆయుధాలను ఎక్కువగా అమ్మిన దేశాల్లో రష్యా టాప్ ప్లేస్ లో నిలిచింది. రష్యా నుంచి ఇండియా ఆయుధ కొనుగోళ్లు 47% పడిపోయాయని, ఇండియా మొత్తం వెపన్ ఇంపోర్ట్స్ లో రష్యా వాటా గతంలో 76% ఉండగా, అది కూడా 56%కి పడిపోయిందని, అయినా ఇప్పటికీ ఇండియాకు వెపన్ ఎక్స్ పోర్ట్స్ లో రష్యానే నెంబర్ వన్ గా ఉందని రిపోర్ట్ తెలిపింది.  2010––14లో ఇండియాకు ఆయుధాల అమ్మకంలో అమెరికా సెకండ్ ప్లేస్ లో ఉంది. 2015–19లో అమెరికా నుంచి ఇంపోర్ట్స్ కూడా 51% తగ్గాయి. కానీ ఇజ్రాయెల్ నుంచి 175%, ఫ్రాన్స్ నుంచి 715% పెరిగాయి. మొత్తంగా అమెరికా, రష్యా తర్వాత ఇజ్రాయెల్, ఫ్రాన్స్ మనకు ఎక్కువ వెపన్స్ అమ్ముతున్న దేశాలుగా నిలిచాయి. పోయిన నెల అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పర్యటనలో అపాచీ హెలికాప్టర్ల కొనుగోలుకు కుదిరిన రూ. 21 వేల కోట్ల ఒప్పందాన్ని ఈ నివేదికలో చేర్చలేదు. ఫ్రాన్స్ నుంచి రూ. 59 వేల కోట్లతో రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందాన్ని మాత్రం చేర్చారు.

 

Latest Updates