కుర్రాళ్లు కంగారెత్తించారు.

పోచెస్‌‌‌‌స్ట్రోమ్

బ్యాట్స్‌‌‌‌మెన్‌‌‌‌ ఫెయిలైనా.. బౌలర్లు సత్తా చాటడంతో  డిఫెండింగ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌ ఇండియా.. అండర్‌‌‌‌–19 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో మరోసారి అదరగొట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఆస్ట్రేలియా అండర్‌‌‌‌–19పై 74 రన్స్‌‌‌‌ తేడాతో గెలిచి సెమీఫైనల్‌‌‌‌ చేరింది. ఈ మ్యాచ్‌‌‌‌లో టాస్‌‌‌‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ చేసిన ఇండియా 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 233 రన్స్‌‌‌‌ చేసింది. యశస్వి జైస్వాల్‌‌‌‌(82 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 62), అథర్వ అంకోలేకర్‌‌‌‌(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్సర్‌‌‌‌తో 55 నాటౌట్‌‌‌‌) హాఫ్‌‌‌‌ సెంచరీలతో సత్తా చాటారు.  ఆసీస్‌‌‌‌ బౌలర్లలో కెల్లీ(2/45), మర్ఫీ(2/40) రెండేసి వికెట్లు తీశారు. అనంతరం కార్తీక్‌‌‌‌ త్యాగి(4/24), ఆకాశ్‌‌‌‌ సింగ్‌‌‌‌(3/30) బౌలింగ్‌‌‌‌లో నిప్పులు చెరగడంతో ఆసీస్‌‌‌‌ 43.3 ఓవర్లలో 159కే ఆలౌటై చిత్తుగా ఓడింది. ఓపెనర్‌‌‌‌ శామ్‌‌‌‌ ఫాన్నింగ్‌‌‌‌(127 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 75) ఒంటరి పోరాటం చేశాడు. ఆసీస్‌‌‌‌ టాప్‌‌‌‌ లేపిన కార్తీక్‌‌‌‌కు ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌ అవార్డు దక్కింది.

త్యాగి దెబ్బకు ఆసీస్‌‌‌‌ అబ్బా..

పేసర్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ త్యాగి దెబ్బకు ఛేజింగ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే ఆసీస్‌‌‌‌ ఓటమి దాదాపు ఖాయమైంది. ఆసీస్‌‌‌‌ టాపార్డర్‌‌‌‌ను ఫస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లోనే  కార్తీక్‌‌‌‌  పెవిలియన్​కు సాగనంపాడు. ఫస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కే ఓపెనర్‌‌‌‌ మెక్‌‌‌‌గర్క్‌‌‌‌(0) రనౌటవ్వగా, కెప్టెన్‌‌‌‌ హార్వి(4), హీమే(0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కార్తీక్‌‌‌‌ తర్వాతి ఓవర్‌‌‌‌లో డేవిస్‌‌‌‌(2) కూడా ఔటవ్వడంతో ఆసీస్‌‌‌‌ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో ఓపెనర్‌‌‌‌ ఫాన్నింగ్‌‌‌‌ మొండిగా క్రీజులో నిలబడిపోయాడు. రోవ్‌‌‌‌(21), స్కాట్‌‌‌‌(35)తో విలువైన భాగస్వామ్యాలు చేసి జట్టును రేసులోకి తెచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ఆకాశ్‌‌‌‌ 42వ ఓవర్‌‌‌‌లో ఇండియా విజయం ఖాయం చేశాడు. ఆ ఓవర్‌‌‌‌ మూడో బాల్‌‌‌‌కు  ఫాన్నింగ్‌‌‌‌ పెవిలియన్‌‌‌‌ చేరగా, ఆ తర్వాతి బాల్‌‌‌‌కు సల్లీ(5) రనౌటయ్యాడు. ఐదో బాల్‌‌‌‌కు మర్ఫీ(0) బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. 44వ ఓవర్‌‌‌‌లో  విలియమ్స్‌‌‌‌(2)ను కూడా బౌల్డ్‌‌‌‌ చేసిన ఆకాశ్‌‌‌‌ లాంఛనం ముగించాడు.

రాణించిన యశస్వి, అథర్వ్‌‌‌‌ పోరాటం..

అంతకుముందు ఆసీస్‌‌‌‌ బౌలర్లు కెల్లీ, మర్ఫీ దెబ్బకు టాస్‌‌‌‌ ఓడి ఫస్ట్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. దివ్యాంశ్‌‌‌‌ సక్సేనా(14), ఠాకూర్‌‌‌‌ తిలక్‌‌‌‌వర్మ(2), ప్రియమ్‌‌‌‌గార్గ్‌‌‌‌(5) తీవ్ర నిరాశపరిచారు. దీంతో15.2 ఓవర్లకు ఇండియా 54/3తో నిలిచింది. అయితే మరో ఓపెనర్‌‌‌‌ యశస్వి  జైస్వాల్‌‌‌‌ మాత్రం కంగారూల బౌలింగ్‌‌‌‌ను సులువుగా ఎదుర్కొన్నాడు. ధృవ్‌‌‌‌ జురెల్‌‌‌‌(15)తో కలిసి జట్టు స్కోరును మూడంకెల మార్కు దాటించాడు. అయితే హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన తర్వాత లెగ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌  తన్వీర్‌‌‌‌ సంగా బౌలింగ్‌‌‌‌లో యశస్వి బౌల్డ్‌‌‌‌ అయ్యాడు. కాసేపటికే ధృవ్‌‌‌‌ కూడా పెవిలియన్‌‌‌‌ చేరడంతో ఇండియా 200 మార్కు కూడా దాటదేమో అనిపించింది. ఈ దశలో అథర్వ అంకోలేకర్‌‌‌‌ చివరిదాకా జట్టును ముందుండి నడిపించాడు. సిద్ధేశ్‌‌‌‌ వీర్‌‌‌‌(25), రవి బిష్నోయ్‌‌‌‌(30)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. అథర్వతో కలిసి ఏడో వికెట్‌‌‌‌కు 61 రన్స్‌‌‌‌ జోడించిన రవి.. 48వ ఓవర్‌‌‌‌లో రనౌటయ్యేసరికి ఇండియా 205/7పై నిలిచింది. అనంతరం టెయిలండర్లతో కలిసి ఇన్నింగ్స్‌‌‌‌ నడిపించిన అథర్వ..  సల్లీ వేసిన 50వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌ కొట్టి హాఫ్‌‌‌‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు.