బెనారస్​ యూనివర్సిటీలో భూత వైద్యం కోర్స్

భూతాలు, దెయ్యాలు పట్టాయని చాలామంది నమ్ముతుంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఈ మూఢనమ్మకాలను ఎక్కువగా విశ్వసిస్తారు. ఇదే ఆసరాగా ఎంతోమంది దెయ్యాలను వదిలిస్తామని సొమ్ము చేసుకుంటుంటారు. కొంతమంది తాము దెయ్యాన్ని చూశామని, మరికొంత మంది తమకు దెయ్యం పట్టిందని భ్రమ పడుతుంటారు. తమకు ఏదో జరిగిందని మానసికంగా కుంగిపోతుంటారు. ఇలాంటి మానసిక రోగులకు భూత వైద్యం చేస్తామంటోంది వారణాసిలోని బెనారస్​ హిందూ యూనివర్సిటీ (బీహెచ్​యూ). ఇందుకోసం ప్రత్యేకంగా సర్టిఫికెట్​కోర్సును కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆరు నెలల ఈ కోర్సులో  ‘‘ గోస్ట్​స్టడీస్ (భూత్​విద్య)’’ పై డాక్టర్లకు శిక్షణ ఇవ్వనుంది. దీనికి యూనివర్సిటీలో ఓ ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసింది. జనవరిలో ప్రారంభం కానున్న ఈ కోర్సు ప్రధానంగా మానసిక రోగాలపై ఫోకస్​చేస్తుందని వర్సిటీ పేర్కొంది. బీహెచ్​యూలోని ఆయుర్వేద విభాగ ఫ్యాకల్టీనే ఈ కోర్సును బోధిస్తారని తెలిపింది.

దేశంలోనే తొలి యూనివర్సిటీ

‘‘ఈ కోర్సు ప్రధానంగా సైకలాజికల్ ​డిజార్డర్స్​ను డీల్ ​చేస్తుంది. కారణాలు లేకుండా వచ్చే వ్యాధులు, మానసిక సమస్యలపై బోధిస్తుంది. దేశంలో ఇలాంటి కోర్సును ప్రవేశపెట్టిన తొలి యూనివర్సిటీ బీహెచ్​యూ. దెయ్యాలకు సంబంధించిన వ్యాధులుగా భావించే వాటిని నయం చేసేందుకు ఆయుర్వేద చికిత్సలను డాక్టర్లకు నేర్పిస్తాం” అని ఆయుర్వేద విభాగ డీన్​యామిని భూషణ్​ త్రిపాఠి తెలిపారు. నిజానికి మన దేశంలో మానసిక రోగుల సంఖ్య కూడా పెరుగుతోంది. 2016లో  నేషనల్ ​ఇనిస్టిట్యూట్​ఆఫ్ ​మెంటల్ ​హెల్త్ ​అండ్ ​న్యూరో సైన్స్ ​చేసిన స్టడీ ప్రకారం ఇండియాలో 14శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. 2017లో వరల్డ్​ హెల్త్​ఆర్గనైజేషన్ ​(డబ్ల్యూహెచ్​ఓ) వెల్లడించిన వివరాల ప్రకారం ఈ సంఖ్య 20 శాతానికి చేరిందని తేలింది. ఈ స్థాయిలో రోగులు ఉంటే కేవలం 4వేల మంది మాత్రమే మెంటల్​ హెల్త్​ ప్రొఫెషనల్స్ ఉన్నారు.

సోషల్​మీడియాలో కామెంట్స్​

బెనారస్​హిందూ యూనివర్సిటీ గోస్ట్​ స్టడీస్​కోర్సును ప్రవేశపెట్టడంపై సోషల్​ మీడియాలో పాజిటవ్​, నెగెటివ్ ​కామెంట్స్​వస్తున్నాయి. కొంతమంది ఇలాంటి కోర్సు అవసరమని చెబుతుండగా, మరికొంత మంది వ్యతిరేకిస్తున్నారు. మానసిక సమస్యలను పరిష్కరించేందుకు అత్యాధునిక వైద్య విధానాలు, మందులు అందుబాటులో ఉండగా ఇలాంటి కోర్సు అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు.  కొందరు కోర్సు పేరు మార్చాలని సూచిస్తున్నారు. భూత వైద్యం నేర్పిస్తారంటే దెయ్యాలున్నాయన్నది నిజమేనా? అని ఇంకొందరు అడుగుతున్నారు. ఇలాంటి విద్యా విధానాలతో ప్రపంచంతో మనం పోటీ పడగలమా? అని నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. చైనా 6జీ టెక్నాలజీపై రీసెర్చ్​ చేస్తుండగా, మనం ఇంకా పాత కాలంలోనే ఉన్నామంటూ విమర్శిస్తున్నారు.

Latest Updates