పరువు దక్కేనా?..ఇవాళ ఆసిస్ తో మూడో వన్డే

ఎన్నో అంచనాలతో ఆస్ట్రేలియాలో అడుగు పెట్టిన టీమిండియా ఉసూరుమనిపించింది. పేలవ బౌలింగ్‌‌, చెత్త ఫీల్డింగ్‌‌, ఇంటెన్సిటీ లేని బ్యాటింగ్‌‌ కారణంగా మూడు వన్డేల సిరీస్‌‌లో 0–2తో  వెనుకబడింది. ఇప్పుడు ఇండో–ఆసీస్‌‌ వార్‌‌ సిడ్నీ నుంచి కాన్‌‌బెర్రాకు షిఫ్ట్‌‌ అయింది.  నేడే మూడో వన్డే. ఇందులోనూ ఓడితే వరుసగా రెండో సిరీస్‌‌లోనూ కోహ్లీసేన క్లీన్‌‌స్వీప్‌‌ అవనుంది. దాన్ని తప్పించుకోవాలంటే ఇండియా ఆట మారాల్సిందే.  మరి, సిడ్నీ మాదిరిగా బ్యాటింగ్‌‌కు స్వర్గధామం అయిన మనుకా ఓవల్‌‌ గ్రౌండ్‌‌లో జోరు మీదున్న ఆసీస్‌‌కు కోహ్లీసేన చెక్‌‌ పెడుతుందా? వార్నర్‌‌, కమిన్స్‌‌ సేవలు కోల్పోయిన కంగారూ టీమ్​ను ఓడించి పరువైనా కాపాడుకుంటుందా?

కాన్‌‌బెర్రాపరుగుల మోత మోగుతున్న ఇండో–ఆసీస్‌‌ వన్డే సిరీస్‌‌లో ఆఖరి అంకం. ఫుల్‌‌ జోష్‌‌లో ఉన్న హోమ్‌‌టీమ్‌‌, వరుస ఓటములతో డీలా పడ్డ టీమిండియా  ఇక్కడి మనుకా ఓవల్‌‌ మైదానంలో బుధవారం జరిగే చివరి వన్డేలో తలపడనున్నాయి. తొలి రెండు మ్యాచ్‌‌ల్లో తీవ్రంగా నిరాశ పరిచిన కోహ్లీసేన ఈ పోరులో ఎలాగైనా గెలవాలని ఆశిస్తోంది. అది జరగాలంటే  ముందుగా బౌలింగ్‌‌ కాంబినేషన్‌‌ను సరి చేసుకోవాల్సి ఉంది. దాంతో, విరాట్‌‌ ఎలాంటి మార్పులు చేస్తాడన్నది ఆసక్తిగా మారింది. మరోవైపు 2–0తో లీడ్‌‌లో ఉన్న ఆసీస్‌‌.. అదే ఊపుతో ఇండియాను వైట్‌‌వాష్‌‌ చేయాలని చూస్తోంది. అదే జరిగితే ఈ ఏడాది కోహ్లీసేన  వరుసగా రెండో సిరీస్‌‌ను 0–3తో కోల్పోనుంది. ఈ ఏడాది ఆరంభంలో  న్యూజిలాండ్‌‌ చేతిలో క్లీన్‌‌స్వీప్‌‌ అయిన ఇండియా ఈ సారి దాన్ని తప్పించుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంది. టీ20 సిరీస్‌‌కు ముందు కాన్ఫిడెన్స్‌‌ పెరగాలంటే ఈ పోరులో కోహ్లీసేనకు గెలుపు అత్యవసరం.

బ్యాలెన్స్‌‌ దొరికితేనే..

అంతా నాణ్యమైన ప్లేయర్లే అయినా మన జట్టులో బ్యాలెన్స్‌‌ లోపించింది. దాన్ని సరిచేయడంపైనే విజయావకాశాలు ఉంటాయి.  ప్రధానంగా బౌలింగ్‌‌ కాంబినేషన్‌‌ను మార్చాల్సి ఉంది. ఆసీస్‌‌లో తన ఫస్ట్ టూర్‌‌లో ఫెయిలైన పేసర్‌‌ నవదీప్‌‌ సైనీపై కచ్చితంగా వేటు పడేలా ఉంది. సెకండ్‌‌ వన్డేలో అతను ఏడు ఓవర్లోనే 70 రన్స్‌‌ ఇచ్చుకోవడంతో  కోహ్లీ మరో మార్గం లేక  ఫిట్‌‌గా లేని ఆల్‌‌రౌండర్‌‌ పాండ్యాతో  బౌలింగ్‌‌ చేయించాల్సి వచ్చింది. దాంతో, సైనీ ప్లేస్‌‌లో  శార్దుల్‌‌ ఠాకూర్‌‌ను బరిలోకి దిగొచ్చు. వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్​లో భాగంగా షమీ, బుమ్రాలో ఒకరికి రెస్ట్‌‌ ఇస్తే శార్దూల్‌‌, నటరాజన్‌‌ ఇద్దరూ బరిలోకి దిగొచ్చు. యార్కర్ల స్పెషలిస్ట్‌‌ అయిన  నటరాజన్‌‌  వైవిధ్యమైన బంతులు వేయడంలో దిట్ట. పేస్‌‌లో మార్పు చేయడంతో పాటు ఆఫ్‌‌ కట్టర్స్‌‌ కూడా సంధిస్తాడు.  ఈ లెఫ్టార్మ్​ పేసర్​ చేరిక వల్ల  బౌలింగ్‌‌లో వైవిధ్యం రానుంది. టెస్టు సిరీస్‌‌ను దృష్టిలో ఉంచుకొని షమీ, బుమ్రా ఇద్దరికీ రెస్టిచ్చినా ఆశ్చర్యపోవడానికి లేదు. అలాగే, పెద్ద గ్రౌండ్‌‌ దృష్ట్యా స్పిన్నర్‌‌ చహల్‌‌ ప్లేస్‌‌లో చైనామన్‌‌ కుల్దీప్‌‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే, ఎవ్వరు వచ్చినా ఆసీస్‌‌ బ్యాట్స్‌‌మెన్‌‌ను కట్టడి చేయకుంటే మూల్యం చెల్లించుకోక తప్పదు. ప్రత్యర్థి పేసర్ల మాదిరిగా మనోళ్లు కూడా షార్ట్‌‌ పిచ్‌‌ బాల్స్‌‌, స్లో బౌన్సర్లపై దృష్టి పెట్టాలి.  ఇక, ఇండియా బ్యాటింగ్‌‌ ప్రత్యర్థికి దీటుగా ఉన్నప్పటికీ కొన్ని బలహీనతలు కనిపిస్తున్నాయి. శుభారంభాలను సద్వినియోగం చేసుకునే విషయంలో ఓపెనర్‌‌ మయాంక్‌‌, అయ్యర్‌‌ మెరుగవ్వాలి. అలాగే, ఇండియా బ్యాటింగ్‌‌లో ఇంటెన్సిటీ లోపించింది. గత మ్యాచ్‌‌లో లోకేశ్‌‌ రాహుల్‌‌, పాండ్యా చాలా నిదానంగా బ్యాటింగ్‌‌ చేశారు. భారీ టార్గెట్‌‌ ఛేజింగ్స్‌‌లో ఈ విధానం పనికిరాదు. ఫామ్‌‌లో ఉన్న ధవన్‌‌, గత పోరుతో టచ్‌‌లోకి వచ్చిన కోహ్లీ జోరు కొనసాగిస్తేనే ఇండియా గట్టెక్కగలదు. అదే టైమ్‌‌లో ఫీల్డింగ్‌‌లోనూ మెరుగవ్వాల్సి ఉంది.

పిచ్‌‌/ వాతావరణం

మనుకా ఓవల్‌‌ వికెట్‌‌ కూడా బ్యాటింగ్‌‌కు అనుకూలం. ఇక్కడ గత ఏడు మ్యాచ్‌‌ల్లో ఫస్ట్ బ్యాటింగ్‌‌ చేసిన టీమ్స్‌‌ ఆరుసార్లు నెగ్గాయి. 320 ప్లస్‌‌ టార్గెట్స్‌‌ను డిఫెండ్‌‌ చేసుకున్నాయి. దాంతో మరోసారి టాస్‌‌ కీలకం కానుంది. రెండు వన్డేల్లోనూ టాస్‌‌ ఓడిన ఇండియాకు ఈసారైనా అదృష్టం కలిసొస్తుందేమో చూడాలి. బుధవారం వాతావరణం కొంచెం వేడిగా ఉండనుంది.

అయినా బలంగానే ఆసీస్‌‌

వరుసగా రెండు విజయాలతో ఆసీస్‌‌ ఫుల్‌‌ జోష్‌‌లో ఉంది. రెండో వన్డేలో గాయపడ్డ  ఓపెనర్‌‌ వార్నర్‌‌ దూరం కావడం, పేసర్‌‌ ప్యాట్‌‌ కమిన్స్‌‌కు రెస్ట్‌‌ ఇవ్వడంతో ఈ మ్యాచ్‌‌లో ఆసీస్‌‌ తుది జట్టులో కూడా మార్పులు అనివార్యం. వీరిద్దరూ లేకపోయినా కూడా హోమ్‌‌టీమ్‌‌ బలంగానే కనిపిస్తోంది. ఫించ్‌‌, స్మిత్‌‌, మ్యాక్స్‌‌వెల్‌‌, లబుషేన్ ఫామ్‌‌ కొనసాగిస్తే ఇండియా బౌలర్లకు చుక్కలు తప్పవు. వార్నర్‌‌ ప్లేస్‌‌లో డార్సి షార్ట్‌‌, మాథ్యూ వేడ్‌‌లో ఒకరు తుది జట్టులోకి వస్తారు. లబుషేన్‌‌ను టాపార్డర్‌‌లో పంపే చాన్సుంది. కమిన్స్‌‌ ప్లేస్‌‌లో  సీన్‌‌ అబాట్‌‌ బరిలోకి దిగనున్నాడు. షెఫీల్డ్‌‌ షీల్డ్‌‌ టోర్నీలో రాణించిన అతను అద్భుత ఫామ్‌‌లో ఉన్నాడు. రెండు వన్డేల్లో ఫెయిలైనప్పటికీ స్టార్క్‌‌కు ఫించ్​ బాసటగా నిలిచాడు. అబాట్‌‌, హేజిల్‌‌వుడ్‌‌తో కలిసి అతను పేస్‌‌ బౌలింగ్‌‌ను నడిపించనున్నాడు.

Latest Updates