కోహ్లీకి తొందరపాటు ఎక్కువ.. హఠాత్తుగా నిర్ణయాలు తీసుకుంటాడు

ఆస్ట్రేలియా పర్యటనను టీమిండియా పరాజయాలతో ప్రారంభించింది. రెండు మ్యాచుల్లో ఓడి వన్డే ట్రోఫీని కోల్పోయింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ కోహ్లీపై విమర్శకులు ఎక్కువయ్యాయి. భారత బౌలింగ్ లైనప్‌‌ను సరిగ్గా వినియోగించుకోలేదంటూ కోహ్లీ సారథ్యంపై నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఈ విషయంపై వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఆశిష్ నెహ్రా స్పందించాడు. కోహ్లీ హఠాత్తుగా నిర్ణయాలు మార్చుకుంటాడని, కానీ బౌలర్లను ఎప్పుడు మార్చాలనే దానిపై అతడు క్లారిటీతో ఉండాలని సూచించాడు.

‘రెండో వన్డేలో మహ్మద్ షమీకి కోహ్లీ రెండు ఓవర్లు మాత్రమే ఇచ్చాడు. అకస్మాత్తుగా నవదీప్ సైనీని బౌలింగ్‌‌కు దింపాడు. వేరే ఎండ్ నుంచి షమి బౌలింగ్ చేయాలని కోహ్లీ భావించాడు. అలాంటప్పుడు కొత్త బంతితో జస్ప్రీత్ బుమ్రాకు రెండు ఓవర్లే ఎందుకు ఇచ్చినట్లు? కోహ్లీ నిరంతరం బౌలింగ్‌‌లో మార్పులు చేస్తుంటాడు. అతడికి ఐదుగురు బౌలర్లే అందుబాటులో ఉన్నారు. మయాంక్ అగర్వాల్, హార్దిక్ పాండ్యాను అదనపు బౌలర్లుగా వాడుకున్నాడు. ఆ నిర్ణయం గ్రౌండ్‌‌లో తీసుకున్నదే. నిర్ణయాలు తీసుకునే విషయంలో కోహ్లీ తొందరపాటుతో వ్యవహరిస్తాడు. తొలి వన్డేలో కోహ్లీ క్యాచ్ జారవిడిచిన తర్వాత అతడు తొందరలో ఉన్నట్లు బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ తన కెరీర్‌‌లో కొన్నిసార్లు 350కు పైగా స్కోర్లను ఛేజ్ చేశాడు. అది అతడికి పెద్ద విషయమేం కాదు. కానీ బ్యాటింగ్‌‌లో అతడి తొందరపాటు చూస్తుంటే 375 ఛేజ్ చేస్తున్నారా లేదా 475 ఛేదిస్తున్నారా అనేలా అనిపించింది’ అని నెహ్రా పేర్కొన్నాడు.

Latest Updates