పంత్‌‌ను ముందు పంపడమే మాస్టర్‌‌స్ట్రోక్

సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్‌‌లో రిషబ్ పంత్‌‌ను ముందు బ్యాటింగ్‌‌కు పంపడం భారత్‌‌కు లాభించిందని కంగారూ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. క్లిష్ట సమయంలో పంత్‌ను బ్యాటింగ్ ఆర్డర్‌‌లో ముందుకు పంపడం ద్వారా రహానె సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడని చెప్పాడు. ఇదే ఆసీస్‌కు రహానె ఇచ్చిన మాస్టర్‌‌స్ట్రోక్ అని పేర్కొన్నాడు.

‘రిషబ్ పంత్‌ను బ్యాటింగ్‌‌లో పైకి పంపడం మంచి కెప్టెన్సీగా చెప్పాలి. ఇదే ఆసీస్‌‌కు రహానె ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్. భారత్ గెలుపోటముల్ని నిర్ణయించాలంటే బ్యాట్స్‌‌మెన్ క్రీజులో నిలదొక్కుకోవాల్సిన సమయ అది. టీమ్ పైన్ కొన్ని క్యాచ్‌‌లను జారవిడవడం వారికి కలిసొచ్చింది. పంత్ చాలా కాన్ఫిడెంట్‌‌గా ఆడాడు. అతడిలో చాలా ప్రతిభ ఉంది. నాథన్ లయన్ లాంటి బౌలర్‌‌పై అలా విరుచుకుపడటం, బౌండరీల వద్ద ఫీల్డర్లను మోహరించినా అటాక్ చేయడం పంత్‌‌కు తన స్కిల్స్‌‌పై ఉన్న నమ్మకాన్ని చెబుతోంది. వచ్చే 10-12 ఏళ్లు భారత్‌‌కు మంచి వికెట్ కీపర్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌గా ఆడే సత్తా పంత్‌కు ఉంది. పంత్ మంచి టెస్ట్ బ్యాట్స్‌మన్‌గా ఎదగగలడు’ అని పాంటింగ్ చెప్పాడు.

Latest Updates