నేడే టైటిల్ పోరు..చరిత్ర ముంగిట టీమిండియా

ఒక్క అడుగు.. ఒకే ఒక్క అడుగు..! ఎన్నాళ్లో వేచిన విజయం మన సొంతం అయ్యేందుకు.. ఇండియా మహిళలు వేయాల్సింది ఇంకొక్క అడుగే..!  అందని ద్రాక్షగా ఉన్న ఓ  ప్రపంచ కప్పును ఒడిసిపట్టుకునేందుకు మన జట్టుకు కావాల్సింది మరొక్క గెలుపే..!  ఎంతోమంది ప్రయత్నించినా దక్కని విశ్వకిరీటాన్ని  కైవసం చేసుకొని చరిత్ర సృష్టించేందుకు  హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ బృందం దాటాల్సిన అడ్డొక్కటే..!మనకు చరిత్రకు మధ్య ఉన్న ఆ అడ్డు ఆస్ట్రేలియా..!  కానీ, అది మామూలు జట్టు కాదు..!  టోర్నీ హిస్టరీలోనే మోస్ట్‌‌ సక్సెస్‌‌ఫుల్‌‌ టీమ్‌‌..!  ఇప్పటికే ఐదుసార్లు ఫైనల్‌‌ ఆడిన అనుభవం.. రికార్డు స్థాయిలో నాలుగుసార్లు విజేతగా నిలిచిన ఘన చరిత్ర     ఆ జట్టు సొంతం..!  పైగా, ఈసారి సొంతగడ్డపై వేలాది మంది మద్దతుదారుల సమక్షంలో ఆడటం దానికి మరింత బలం..!

అయినా సరే  మన మగువల ప్రతిభ, తెగువ మమూలుగా లేదు..!  అసాధారణ ఆటకు, అపజయమే లేని జోరుకు అదృష్టం కూడా తోడై టీ20 ప్రపంచకప్‌‌లో తొలిసారి ఫైనల్‌‌కు దూసుకొచ్చారు..!  రికార్డు స్థాయిలో హాజరయ్యే  ప్రేక్షకుల కేరింతల మధ్య  నేడు జరిగే తుదిపోరులో ఆసీస్‌‌తో అంతిమ పోరుకు రెడీ అయ్యారు..! కప్పు కొట్టేందుకు వీళ్లకు ఇంతకు మించిన సమయం మరొకటి ఉండబోదు..!ఇప్పుడు మనోళ్లు చేయాల్సింది ఒక్కటే..  ప్రత్యర్థి ఘన చరిత్రను చూసి ఒత్తిడికి గురవకుండా నిర్భయంగా ఆడాలి..!   ప్రతీ క్రికెటర్‌‌ సివంగిలా చెలరేగాలి..!ఫస్ట్‌‌ మ్యాచ్‌‌ మాదిరిగా ఆఖరాటలోనూ ప్రత్యర్థిని కంగారు పెట్టాలి..! కప్పు కొట్టి  మహిళా దినోత్సవం రోజు మన నారీ శక్తిని ప్రపంచానికి చాటాలి..! మన దేశంలోనే  కాదు ప్రపంచ మహిళా క్రికెట్‌‌నే మరో మెట్టు ఎక్కించాలి..!

మెల్‌‌బోర్న్‌‌:   మహిళల టీ20 ప్రపంచకప్‌‌లో ఆఖరి మజిలి. రికార్డు స్థాయిలో 90 వేల పైచిలుకు ప్రేక్షకుల మధ్య ఆదివారం ఇక్కడి మెల్‌‌బోర్న్‌‌ క్రికెట్‌‌ గ్రౌండ్‌‌ (ఎంసీజీ)లో జరిగే టైటిల్‌‌ ఫైట్‌‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాతో ఇండియా అమీతుమీ తేల్చుకోనుంది. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లోనే హోమ్‌‌టీమ్‌‌ ఆసీస్‌‌కు షాకిచ్చిన హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ అండ్‌‌ కో అదే జోరుతో మిగతా మూడు మ్యాచ్‌‌లనూ చుట్టేయగా.. వర్షం కారణంగా ఇంగ్లండ్‌‌తో సెమీస్‌‌ రద్దు కావడంతో నేరుగా ఫైనల్లో అడుగుపెట్టి యమ జోరు మీదుంది. తొలిసారి ఫైనల్‌‌కు దూసుకొచ్చి చరిత్ర సృష్టించిన ఇండియా అదే  ఊపుతో కలల కప్పును కైవసం చేసుకోవాలన్న కృత నిశ్చయంతో ఉంది. మరోవైపు ఆరు టోర్నీలు ఆడితే ఐదు సార్లు ఫైనల్‌‌ చేరి, రికార్డు స్థాయిలో నాలుగుసార్లు కప్పు కొట్టిన ఆసీస్‌‌ అమ్మాయిలు సొంతగడ్డపై పాంచ్‌‌ పటాకా మోగించాలని చూస్తున్నారు. రెండు జట్లలోనూ టాలెంటెడ్‌‌ ప్లేయర్లకు కొదువలేదు కాబట్టి టైటిల్‌‌ ఫైట్‌‌ హోరాహోరీగా సాగే చాన్సుంది.

చిన్నదాని జోరు సాగాలి..పెద్దోళ్లు జోరందుకోవాలి..

అనామకురాలిగా టోర్నీకి వచ్చి  వరల్డ్‌‌ నంబర్‌‌  1 ర్యాంక్‌‌ సాధించిన ఇండియా యువ ఓపెనర్‌‌ షెఫాలీ వర్మ ఫైనల్లోనూ కీలకం కానుంది. ఆడిన నాలుగు మ్యాచ్‌‌ల్లోనూ 29, 39, 46, 49 స్కోర్లతో ఇండియా ఫైనల్‌‌ చేరడంలో కీలక పాత్ర పోషించిన 16 ఏళ్ల షెఫాలీ టాపార్డర్‌‌ భారాన్ని మోస్తోంది. జట్టు పూర్తి  స్వేచ్ఛనివ్వడంతో పవర్‌‌ప్లేలో భారీ షాట్లు బాదేస్తున్న వర్మ  మరోసారి దంచికొట్టాలని అందరూ ఆశిస్తున్నారు. అయితే, ఇంత పెద్ద మ్యాచ్‌‌లో 16 ఏళ్ల యువ బ్యాటర్‌‌పైనే బ్యాటింగ్‌‌ భారం మోపడానికి వీల్లేదు. పైగా, ప్రత్యర్థి బౌలర్లు ఆమెను టార్గెట్‌‌ చేస్తారు.  కాబట్టి  సీనియర్‌‌ ప్లేయర్లు బాధ్యత తీసుకునేందుకు రెడీగా ఉండాలి. ముఖ్యంగా మరో ఓపెనర్‌‌ స్మృతి మంధాన మెల్‌‌బోర్న్‌‌లో కచ్చితంగా మెరవాల్సిన అవసరం ఉంది. టోర్నీలో ఇప్పటిదాకా స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయిన మంధానతో పాటు కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ కూడా బ్యాట్‌‌ ఝళిపించాల్సిందే. వర్మ, మంధాన, వన్‌‌డౌన్‌‌ బ్యాటర్‌‌ జెమీమా రోడ్రిగ్స్‌‌ మంచి పునాది వేస్తే.. తర్వాత పని హర్మన్‌‌ పూర్తి చేయాలి. 2017 వన్డే వరల్డ్‌‌కప్‌‌ సెమీస్‌‌లో ఇదే ఆస్ట్రేలియాపై భారీ సెంచరీ బాది స్టార్‌‌డమ్‌‌ తెచ్చుకున్న కౌర్‌‌..తన పుట్టిన రోజున ఆడుతున్న అతి పెద్ద మ్యాచ్‌‌లో జట్టును ముందుండి నడిపించి కప్పు సాధిస్తే అంతకుమించిన ఆనందం ఆమెకు మరొకటి ఉండదు. మిడిలార్డర్‌‌ బ్యాటర్లు వేదా, దీప్తి శర్మ, తానియా భాటియా కూడా ఇంకాస్త మెరుగైన పెర్ఫామెన్స్‌‌ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మంచి ఆరంభాలు వచ్చినా కూడా టోర్నీలో మన జట్టు ఒక్కసారి కూడా 150 రన్స్‌‌ మార్కు దాటలేదు. ప్రత్యర్థి జట్టు బ్యాటింగ్ బలంగా ఉన్న నేపథ్యంలో భారీ టార్గెట్‌‌ ఇచ్చేందుకైనా.. ఛేజ్‌‌ చేసేందుకైనా ఇండియా మానసికంగా సిద్ధమై ఉండాలి.

బౌలర్లు పంజా విసరాలి..

ఇండియా తొలిసారి ఫైనల్‌‌ చేరిందంటే అది ఓపెనర్‌‌ షెఫాలీ వర్మ, బౌలర్ల పోరాట ఫలితమే.  చేతి వేలు గాయం తర్వాత సెన్సేషనల్‌‌ రీఎంట్రీ ఇచ్చిన లెగ్‌‌ స్పిన్నర్‌‌  పూనయ్‌‌ యాదవ్‌‌ ఆటను ఎంత పొగిడినా తక్కువే. స్లో, లో లెంగ్త్‌‌ బాల్స్‌‌తో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్న పూనమ్‌‌.. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో ఆసీస్‌‌ను తిప్పేసింది. మరోసారి అదే జోరు కనబరిస్తే జట్టుకు తిరుగుండదు. పేసర్ శిఖా పాండే కూడా ఫామ్‌‌లో ఉండగా, లెఫ్టామ్‌‌ స్పిన్‌‌ ద్వయం రాధా యాదవ్‌‌, రాజేశ్వరి గైక్వాడ్‌‌ కూడా కీలక బ్రేక్స్‌‌ సాధిస్తూ జట్టును ముందుకు తీసుకొచ్చారు. అయితే,  పూనమ్‌‌  బౌలింగ్‌‌ను తిప్పికొట్టేందుకు ఆసీస్‌‌ కెప్టెన్‌‌ మెగ్‌‌ లానింగ్‌‌ నెట్స్‌‌లో  స్లో, లో లెంగ్త్‌‌ బాల్స్‌‌తో ప్రాక్టీస్‌‌ చేసింది. అందువల్ల పూనమ్‌‌ కొత్త అస్త్రాలను బయటికి తీయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆమె విఫలమైతే మిగతా బౌలర్లు బాధ్యత తీసుకునేందుకు రెడీగా ఉండాలి.

జట్లు (అంచనా):

ఇండియా: షెఫాలీ, మంధాన, జెమీమా, హర్మన్‌‌ప్రీత్‌‌ (కెప్టెన్‌‌), దీప్తి, వేద, తానియా (కీపర్), శిఖా పాండే, రాధ, పూనమ్‌‌ యాదవ్‌‌, రాజేశ్వరి. ఆస్ట్రేలియా: బెన్ మూనీ, అలీసా హీలీ (కీపర్‌‌), లానింగ్‌‌ (కెప్టెన్‌‌), గార్డ్‌‌నర్‌‌, రేచల్‌‌, జొనాసెన్, నికోలా కారే, కిమిన్స్‌‌, వారెహమ్‌‌/మొలీ స్ట్రానో, మొలినెయుక్స్‌‌, మేగన్‌‌ షుట్‌‌.

పిచ్‌‌/వాతావరణం

ఫైనల్‌‌ కోసం ఎంసీజీ మైదానంలో హార్డ్‌‌, ఫ్లాట్‌‌ వికెట్‌‌ రూపొందించారు. బ్యాటింగ్‌‌తో పాటు బౌలింగ్‌‌ కూడా అనుకూలించనుంది. ఇక, మ్యాచ్‌‌కు వర్షం ముప్పు లేదు. సోమవారం రిజర్వ్‌‌ డే ఉంది.

Latest Updates