బంగ్లాదేశ్ పని పట్టేందుకు టీమిండియా సిద్ధం

వస్తుందో రాదో అనుకున్న బంగ్లాదేశ్‌‌.. కుర్రాళ్లతో కూడిన టీమిండియాతో టీ20 సవాల్‌‌కు రెడీ అయింది..! జీతాలు పెంచాలని సమ్మె తర్వాత ప్రిపరేషన్‌‌ లేకుండానే ఇండియా వచ్చిన ఆ జట్టు రెగ్యులర్‌‌ కెప్టెన్‌‌, స్టార్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ షకీబల్‌‌ హసన్‌‌ సేవలు కోల్పోయి డీలా పడింది..! మరోవైపు ఢిల్లీలో డేంజర్‌‌గా మారిన పొల్యూషన్‌‌ను తట్టుకోలేకపోతోంది..! ఈ నేపథ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన హోమ్‌‌టీమ్‌‌ను ఓడించి ‘ఊపిరి’పీల్చుకోవాలని భావిస్తోంది..! కానీ, అనుభవం లేకపోయినా.. టాలెంట్‌‌ పుష్కలంగా ఉన్న మన కుర్రాళ్లు ఆ జట్టుకు ఎలాంటి చాన్స్‌‌ ఇవ్వకూడదన్న పట్టుదలతో ఉన్నారు..! అదే విధంగా స్టార్లులేని టైమ్‌‌లో తమ సత్తా నిరూపించుకోవాలని ఆశిస్తున్నారు..! ఢిల్లీ అరుణ్‌‌ జైట్లీ స్టేడియంలో నేడు జరిగే తొలి టీ20లో ఇండియా యంగ్‌‌స్టర్స్‌‌పై అందరి ఫోకస్‌‌ ఉంది..!

న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌‌లో సౌతాఫ్రికాను వైట్‌‌వాష్‌‌ చేసిన టీమిండియా ఇప్పుడు టీ20ల్లో బంగ్లాదేశ్‌‌ పని పట్టేందుకు సిద్ధమైంది. మూడు టీ20ల సిరీస్‌‌లో భాగంగా ఆదివారం జరిగే తొలి టీ20లో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కెప్టెన్‌‌ కోహ్లీతో పాటు రెగ్యులర్‌‌ బౌలర్లలో చాలా మంది లేకున్నా.. రోహిత్‌‌ నేతృత్వంలోని ఇండియానే ఈ మ్యాచ్‌‌లో ఫేవరెట్‌‌. అయితే, దీపావళి తర్వాత ఢిల్లీలో ఎయిర్‌‌ పొల్యూషన్‌‌ ప్రమాదకర స్థాయికి చేరుకున్న సమయంలో ఈ మ్యాచ్‌‌ నిర్వహణపై ఆందోళన వ్యక్తమవుతోంది. వేదిక మార్చాలన్న డిమాండ్లు వచ్చినా సమయం లేకపోవడంతో కుదరదని బీసీసీఐ స్పష్టం చేసింది. పొల్యూషన్‌‌ నేపథ్యంలో బంగ్లా క్రికెటర్లు మాస్కులు వేసుకొని మరి మూడు రోజులుగా ముమ్మర సాధన చేశారు. ఇండియన్స్‌‌ మాత్రం ఆప్షనల్‌‌ ప్రాక్టీస్‌‌తోనే సరిపెట్టారు. మరి, అసలు ఆటలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.

బరిలోకి దూబే

ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌ దృష్ట్యా ఈ సిరీస్‌‌లో కూడా పలువురు యువ ప్లేయర్లను పరీక్షించాలని మేనేజ్‌‌మెంట్‌‌ జట్టులోకి తీసుకుంది. ప్రపంచకప్‌‌ వరకు దాదాపు 20 మ్యాచ్‌‌లు ఆడాల్సి ఉన్నప్పటికీ వీలైనంత తొందరగా కోర్‌‌ టీమ్‌‌ను తయారు చేసుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో యువ ఆల్‌‌రౌండర్‌‌ శివమ్‌‌ దూబేను సెలెక్టర్లు తొలిసారి జట్టులోకి తీసుకున్నారు. దూబే అరంగేట్రం ఖాయమని స్టాండిన్‌‌ కెప్టెన్‌‌ రోహిత్‌‌ శర్మ హింట్‌‌ ఇచ్చాడు. హార్దిక్‌‌ పాండ్యా మాదిరిగా పేస్‌‌ ఆల్‌‌రౌండర్‌‌గా ఎదగాలని భావిస్తున్న దూబే.. డొమెస్టిక్‌‌ క్రికెట్‌‌లో అద్భుతంగా ఆడి సెలెక్టర్లను మెప్పించాడు. హార్డ్‌‌ హిట్టర్‌‌గా పేరుతెచ్చుకున్న ఈ యంగ్‌‌స్టర్‌‌కు టీ20ల్లో 142, లిస్ట్‌‌-ఎలో 121 స్ట్రయిక్‌‌ రేట్‌‌ ఉంది. మీడియం పేసర్‌‌గా బౌలింగ్‌‌లోనూ సత్తా చాటగల టాలెంట్‌‌ అతని సొంతం. ఐపీఎల్‌‌లో అంతగా సక్సెస్‌‌ కాకపోయినా.. నేషనల్‌‌ టీమ్‌‌ తరఫున అదరగొట్టాలని ఈ ముంబైకర్‌‌ భావిస్తున్నాడు. టెస్టుల్లో ఓపెనర్‌‌గా చెలరేగిన కెప్టెన్‌‌ రోహిత్‌‌ పొట్టి ఫార్మాట్‌‌లోనూ అదే జోరును కొనసాగించాలని చూస్తున్నాడు. వరల్డ్‌‌ కప్‌‌లో గాయం తర్వాత సౌతాఫ్రికాతో సిరీస్‌‌తో పాటు విజయ్‌‌ హజారే ట్రోఫీలో నిరాశ పరిచిన మరో ఓపెనర్‌‌ శిఖర్ ధవన్‌‌కు ఈ సిరీస్‌‌ కీలకం. హోమ్‌‌గ్రౌండ్‌‌లో జరిగే మ్యాచ్‌‌లో రాణించి మళ్లీ గాడిలో పడాతాడో లేదో చూడాలి. శ్రేయస్‌‌ అయ్యర్‌‌, లోకల్‌‌ బాయ్‌‌ రిషబ్‌‌ పంత్‌‌, క్రునాల్‌‌ పాండ్యా మిడిలార్డర్‌‌ బాధ్యతలు మోయనున్నారు. 2015లో తొలి, ఏకైక టీ20 ఆడిన సంజు శాంసన్‌‌ డొమెస్టిక్‌‌లో మెప్పించి నాలుగేళ్ల తర్వాత మళ్లీ నేషనల్‌‌ టీమ్‌‌లోకి వచ్చాడు. కానీ, లోకేశ్‌‌ రాహుల్‌‌ను పక్కనబెట్టి అతడిని ఫైనల్‌‌ టీమ్‌‌లోకి తీసుకుంటారో లేదోచూడాలి. సీనియర్‌‌ బౌలర్ల గైర్హాజరీలో యువ పేసర్లు శార్దూల్‌‌ ఠాకూర్‌‌, దీపక్‌‌ చహర్‌‌, ఖలీల్‌‌ అహ్మద్‌‌, స్పిన్‌‌ ఆల్‌‌రౌండర్‌‌ వాషింగ్టన్‌‌ సుందర్‌‌ ఏమేరకు రాణిస్తారో చూడాలి. సెకండ్‌‌ స్పిన్నర్‌‌గా యంగ్‌‌స్టర్‌‌ రాహుల్‌‌ చహర్‌‌ కంటే స్లో వికెట్లపై రాణించే లెగ్గీ యజ్వేంద్ర చహల్‌‌ తుది జట్టులోకి వచ్చే చాన్సుంది. టాస్‌‌ గెలిస్తే ఇండియా మొదట బ్యాటింగ్‌‌కే మొగ్గు చూపొచ్చు. టాపార్డర్‌‌ ఫెయిలైతే మిడిలార్డర్‌‌ బాధ్యత తీసుకోవాలని మేనేజ్‌‌మెంట్‌‌ కోరుకుంటోంది.

బంగ్లా బలమెంత?

శ్రీలంకను వెనక్కునెట్టి ఆసియా ఖండంలో మేటి జట్టుగా ఎదిగిన బంగ్లాదేశ్‌‌ ఈ మధ్యకాలంలో పెద్దగా రాణించడం లేదు. సెప్టెంబర్‌‌లో చిట్టగాంగ్‌‌లో జరిగిన టెస్టులో అఫ్గానిస్థాన్‌‌ చేతిలో ఓడిన ఆ జట్టు ఆ తర్వాత టీ20 ట్రై సిరీస్‌‌లోనూ పేలవంగా ఆడింది. ఇక, ఆల్‌‌రౌండర్‌‌ షకీబల్‌‌ హసన్‌‌పై వేటు పడడం, స్టార్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ తమీమ్‌‌ ఇక్బాల్‌‌ సిరీస్‌‌ నుంచి తప్పుకోవడంతో ఇప్పుడు మరింత డీలా పడింది. స్టాండిన్​ కెప్టెన్‌‌ మహ్ముదుల్లా రియాద్‌‌ సారథ్యంలో బరిలోకి దిగిన ఆ జట్టులో కాన్ఫిడెన్స్‌‌ లోపించింది. అయితే, షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ఆ జట్టును తక్కువగా అంచనా వేయడానికి లేదు. అంచనాలు లేకపోయినా.. సంచనాలు సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇప్పుడూ కూడా ఆ జట్టు బ్యాటింగ్‌‌ బలంగానే ఉంది. కెప్టెన్‌‌ మహ్ముదుల్లాతో పాటు లిటన్‌‌ దాస్‌‌, ముష్ఫికర్‌‌ రహీమ్‌‌, సౌమ్య సర్కార్‌‌పై అంచాలున్నాయి. మరి, ఇండియాకు బంగ్లా ఏ మేరకు పోటీ ఇస్తుందో చూడాలి.

Latest Updates