రెండో టీ20: బంగ్లాతో మరోపోరుకు టీమిండియా రెడీ

స్టార్లు ఉన్నా.. ఢిల్లీలో విజయం దక్కించుకోలేకపోయిన టీమిండియా మరో కీలక పోరుకు రెడీ అయ్యింది. గురువారం జరిగే రెండో టీ20లో బంగ్లాదేశ్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో 0–1తో వెనుకబడ్డ రోహిత్‌‌సేన.. ఈ మ్యాచ్‌‌పై భారీ ఆశలు పెట్టుకుంది. కానీ వర్షం ముప్పుతో ఈ పోరు జరుగుతుందో లేదోనన్న సందేహాలు కూడా మొదలయ్యాయి. ఈ మ్యాచ్‌‌ జరగకపోతే.. ఏదైనా కారణంతో ఆఖరి టీ20లో ఓడితే.. పసికూన బంగ్లాదేశ్‌‌కు సిరీస్‌‌ కట్టబెట్టాల్సి వస్తుందేమోనన్న తీవ్ర ఒత్తిడిలో టీమిండియా ఉంది. కోహ్లీ, బుమ్రా వంటి సీనియర్ల గైర్హాజరీతో.. టీమ్‌‌లోకి వచ్చిన యువ క్రికెటర్లకు ఈ మ్యాచ్‌‌ కఠిన పరీక్షగా నిలువనుంది. ఇక రెట్టించిన ఆత్మవిశాస్వంతో ఉన్న బంగ్లా.. ఇక్కడే సిరీస్‌‌ గెలిచేయాలని కసితో కనిపిస్తోంది. ప్లేయర్లందరూ మంచి ఫామ్‌‌లో ఉండటం వాళ్లకు కలిసొచ్చే అంశం.

అరకొర మార్పులతో…

టీ20 పెర్ఫామెన్స్‌‌లో కాస్త వెనుకంజలో ఉన్న టీమిండియాను.. ఢిల్లీ మ్యాచ్‌‌లో ఫీల్డింగ్‌‌, డీఆర్‌‌ఎస్‌‌ వైఫల్యాలు కొంపముంచాయి. అయినా రెండో టీ20 కోసం ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో పెద్దగా మార్పులు చేసే అవకాశాలు కనిపించడం లేదు. బ్యాటింగ్‌‌ లైనప్‌‌లో మార్పులు లేవని ఇప్పటికే స్పష్టం చేసిన కెప్టెన్‌‌ రోహిత్‌‌.. మ్యాచ్‌‌కు ముందు పిచ్‌‌ పరిస్థితిని బట్టి బౌలింగ్‌‌లో మార్పులు ఉంటాయని హింట్‌‌ ఇచ్చాడు. ఓపెనింగ్‌‌లో రోహిత్‌‌, ధవన్‌‌తో పాటు రాహుల్‌‌, శ్రేయస్‌‌, రిషబ్‌‌తో  మిడిలార్డర్‌‌ పటిష్టంగా కనిపిస్తోంది. కానీ సమన్వయ లోపంతో ఢిల్లీ మ్యాచ్‌‌లో పరుగులు చేయలేకపోయింది. అయితే రాజ్‌‌కోట్‌‌ పిచ్‌‌ పూర్తి భిన్నంగా ఉంటుంది కాబట్టి రోహిత్‌‌ భారీ ఇన్నింగ్స్‌‌పై దృష్టిపెట్టాడు. టీ20ల్లో టాప్‌‌ ఆర్డర్‌‌ హిట్టయితే.. సగం విజయం సాధించినట్లే.  వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌ నేపథ్యంలో..  ధవన్‌‌, రాహుల్‌‌ మరోసారి నిరూపించుకోవాల్సిందే. లేదంటే కొత్త వాళ్లకు చాన్స్‌‌ ఇవ్వాల్సి రావొచ్చు. శ్రేయస్‌‌, రిషబ్‌‌ అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం దురదృష్టకరం. ఈ మ్యాచ్‌‌తో వాళ్లపై ఓ అంచనాకు వచ్చే అవకాశం ఉంది. ఢిల్లీలో అరంగ్రేటం చేసిన శివమ్‌‌ దూబేకు మరో చాన్సిస్తారా లేక సంజు శాంసన్‌‌ను తీసుకుంటారా అనేది చూడాల్సి ఉంది. శాంసన్‌‌ తుది జట్టులోకి వస్తే రాహుల్‌‌ స్థానానికి ముప్పు ఉండొచ్చు. చహల్‌‌, క్రునాల్‌‌, సుందర్‌‌ స్పిన్‌‌ బాధ్యతలు చూసుకోనున్నారు. ఢిల్లీలో మ్యాచ్‌‌లో భారీగా పరుగులిచ్చిన ఖలీల్‌‌ అహ్మద్‌‌పై మాత్రం వేటు పడే చాన్సుంది. దీంతో దీపక్‌‌ చహర్‌‌కు తోడుగా శార్దూల్‌‌ పేస్‌‌ బాధ్యతలు పంచుకోనున్నాడు.

జట్లు (అంచనా):

ఇండియా: రోహిత్‌‌ (కెప్టెన్‌‌), ధవన్‌‌, రాహుల్‌‌, శ్రేయస్‌‌, పంత్‌‌, శివమ్‌‌ దూబే, క్రునాల్‌‌, సుందర్‌‌, చహల్‌‌, దీపక్‌‌, శార్దూల్‌‌ / ఖలీల్‌‌.

బంగ్లాదేశ్‌‌: మహ్మదుల్లా (కెప్టెన్‌‌), లిటన్‌‌ దాస్‌‌, సౌమ్య సర్కార్‌‌, నైమ్‌‌, ముష్ఫికర్‌‌, మొసాద్దెక్‌‌, అఫిఫ్‌‌, అమినుల్‌‌, ముస్తాఫిజుర్‌‌, అల్‌‌ అమిన్‌‌ / అరాఫత్‌‌, షఫియుల్‌‌.

పిచ్‌‌, వాతావరణం..

పిచ్‌‌ బ్యాటింగ్‌‌కు అనుకూలం. నెమ్మదిగా బౌలర్లకు సహకరించొచ్చు. మహా తుఫాన్‌‌ తీరం దాటుతుండడంతో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశముంది.

Latest Updates