షెఫాలీ బ్యాటింగ్.. పూనం బౌలింగ్: బంగ్లాపై టీమిండియా అమ్మాయిల విక్టరీ

ICC వుమెన్ టీ20 వరల్డ్ కప్‌లో మరోసారి టీమిండియా అమ్మాయిలు సత్తా చాటారు. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విజయంతో హుషారుగా బరిలోకి దిగిన భారత్ టీమ్ రెండో మ్యాచ్‌లో ఇవాళ బంగ్లాదేశ్ అమ్మాయిల్ని చిత్తు చేశారు. సోమవారం పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 18 పరుగుల తేడాతో విజయం సాధించింది హర్మన్ ప్రీత్ సేన. ఈ గెలుపుతో ప్రపంచకప్‌ గ్రూప్‌-ఏ పట్టికలో టీమిండియా నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలోకి ఉంది.

షెఫాలీ దూకుడు.. మళ్లీ తిప్పేసిన పూనం

టాస్ గెలిచిన బంగ్లా టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ తిగిన భారత ఓపెనర్ షెఫాలీ వర్మ దూకుడుగా ఆడింది. 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 రన్స్ చేసింది. ఐదో ఓవర్లలో షెఫాలీ ఔట్ కావడంతో రన్ రేట్ కాస్త తగ్గింది. హర్మన్ ప్రీత్ 8 రన్స్ చేసి ఔట్ అయింది. ఆ తర్వాత  జెమీమా రోడ్రిగ్స్‌(34), వేదా కృష్ణమూర్తి(20) బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డారు. దీంతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసింది. బంగ్లా బౌలర్లలో పన్నా, సాల్మా చెరో 2 వికెట్లు తీశారు.

143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా టీమ్ విజయానికి 18 పరుగుల దూరంలో నిలిచింది. 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసి ఓటమి పాలైంది. ముర్షిదా 26 బంతుల్లో 30 పరుగులు చేయగా, నిగర్ సుల్తానా 26 బందుల్లో 35 పరుగులు చేసి బంగ్లా టీమ్‌ని గెలిపించాలని పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. తొలి మ్యాచ్‌లో మాదిరిగానే ఈ మ్యాచ్‌లోనూ బంగ్లాను పడగొట్టడంలో పూనం యాదవ్ స్పిన్ మంత్రం పని చేసింది. మూడు వికెట్లు పడగొట్టి మ్యాచ్ విజయంలో కీ రోల్ ప్లే చేసింది. కీలక సమయంలో అరుంధతి రెడ్డి, శిఖాపాండే చెరో రెండు వికెట్లు తీసి ఈ మ్యాచ్‌లో మెరిశారు. రాజేశ్వరి గౌఖ్వాడ్ ఓ వికెట్ తీసింది.

India vs Bangladesh ICC Women's T20 World Cup: India Beat Bangladesh By 18 Runs In Perth

Latest Updates