పగ, ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆలోచన లేదు

  • నేడు ఇండియా, న్యూజిలాండ్‌‌ ఫస్ట్‌‌ టీ20
  • మ్యాచ్‌‌కు వర్షం ముప్పు

ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు..!  వెస్టిండీస్‌‌ను వణికించాం. శ్రీలంకను ముంచేశాం. పటిష్ఠ ఆస్ట్రేలియాను నేలకు దించేశాం..!  ఇలా  ప్రత్యర్థితో సంబంధం లేకుండా వరుస విజయాలతో కోహ్లీసేన సొంతగడ్డపై తామెంటో ఆల్రెడీ ప్రూవ్‌‌ చేసుకుంది. ఇప్పుడు విదేశీ గడ్డపై రెచ్చిపోవాల్సిన  టైమొచ్చింది. వన్డే వరల్డ్‌‌కప్‌‌ను తమకు దూరం చేసిన న్యూజిలాండ్‌‌పై రివెంజ్‌‌ తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది..!  ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా నేడు జరిగే ఫస్ట్‌‌ టీ20లో కివీస్‌‌తో ఇండియా తలపడనుంది. ప్రపంచ కప్​ సెమీఫైనల్‌‌ తర్వాత రెండు టీమ్‌‌లు తొలిసారి అమీతుమీకి రెడీ అయ్యాయి.!.  వరల్డ్‌‌ టీ20 నేపథ్యంలో కీలకమైన ఈ సిరీస్‌‌లో బోణీ  కొట్టేదెవరో..!!

ఆక్లాండ్‌‌:

వరల్డ్‌‌ టీ20కి పర్‌‌ఫెక్ట్‌‌ టీమ్‌‌ను రెడీ చేసుకోవడమే ప్రధాన లక్ష్యంగా టీమిండియా కీలక సిరీస్‌‌కు రెడీ అయ్యింది. దాదాపు ఐదు నెలల తర్వాత విదేశీగడ్డపై ఆడబోతుంది. గతేడాది వన్డే వరల్డ్‌‌కప్‌‌ సెమీఫైనల్‌‌లో తమకు షాకిచ్చిన న్యూజిలాండ్‌‌తో తలపడబోతుంది. ఐదు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా ఇండియా, న్యూజిలాండ్‌‌ మధ్య ఫస్ట్‌‌ టీ20 శుక్రవారం ఆక్లాండ్‌‌లో జరగనుంది. ఫామ్‌‌ ప్రకారం ఇండియా ఈ సిరీస్‌‌లో ఫేవరెట్‌‌ అయినప్పటికీ రికార్డుల్లో మాత్రం కివీసే ముందుంది. సచిన్‌‌ అన్నట్టుగా కివీస్‌‌ పిచ్‌‌లు ఇటీవల బ్యాటింగ్‌‌ ఫ్రెండ్లీగా మారినప్పటికీ.. బ్లాక్‌‌క్యాప్స్‌‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.

కీపర్‌‌గా లోకేశ్‌‌.. పంత్‌‌ పరిస్థితి?

గాయాల కారణంగా శిఖర్‌‌ ధవన్‌‌, హార్దిక్‌‌ పాండ్యా, భువనేశ్వర్‌‌ కుమార్‌‌, దీపక్‌‌ చహర్‌‌ సేవలు కోల్పోయినప్పటికీ  కోహ్లీసేన బలంగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియా సిరీస్‌‌ ముగిసి ఎన్నో రోజులు కాకపోవడంతో ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో పెద్దగా మార్పులుండకపోవచ్చు. ధవన్‌‌ లేకపోవడంతో రోహిత్‌‌, కేఎల్‌‌ రాహుల్‌‌ ఇన్నింగ్స్‌‌ ఓపెన్‌‌ చేయనున్నారు. హోమ్‌‌గ్రౌండ్‌‌లో చివరి మూడు సిరీస్‌‌ల్లో అదరగొట్టిన రాహుల్‌‌తో పాటు హిట్‌‌మ్యాన్‌‌ సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్నాడు.  వన్‌‌డౌన్‌‌లో రానున్న కెప్టెన్‌‌ కోహ్లీ కూడా జోరుమీదున్నాడు. కొన్ని ఫెయిల్యూర్ల తర్వాత  బెంగళూరులో ఆస్ట్రేలియాపై మెరుపు ఇన్నింగ్స్‌‌ ఆడిన  శ్రేయస్‌‌ అయ్యర్‌‌ నాలుగో నంబర్లో రానున్నాడు. అయితే మిడిలార్డర్‌‌లో మాత్రం మార్పులు జరిగే చాన్సుంది. వన్డేలు, టీ20ల్లో  రాహుల్‌‌ కీపర్‌‌గా ఉంటాడని ఇటీవల కోహ్లీ అన్నాడు. దీంతో వరుసగా విఫలమవుతున్న రిషబ్‌‌ పంత్‌‌పై ఈసారి వేటు తప్పదని అనిపిస్తుంది. పంత్‌‌ను తప్పిస్తే మనీశ్‌‌ పాండే, సంజు శాంసన్‌‌లో విరాట్‌‌ ఎవరికి ఓటు వేస్తాడో చూడాలి.  ఒకవేళ ఐదుగురు బౌలర్ల వ్యూహానికి వెళితే పంత్‌‌, పాండే ఇద్దరూ తుది జట్టులో ఉంటారు. ఆ పరిస్థితిలో శివమ్‌‌ దూబే బెంచ్‌‌కు పరిమితం అవుతాడు. ఆల్‌‌రౌండర్‌‌ కోటాలో వాషింగ్టన్‌‌ సుందర్‌‌, రవీంద్ర జడేజాలో ఒకరు మాత్రమే తుదిజట్టులో ఉంటారు. అనుభవం దృష్ట్యా జడేజాకే ఎక్కువ చాన్సుంది. హార్దిక్‌‌ పాండ్యా ఇప్పుడప్పుడే జట్టులోకి వచ్చే చాన్స్‌‌ లేదు. దీంతో వరల్డ్‌‌ టీ20 నేపథ్యంలో ఇండియా తగిన ఆల్‌‌రౌండర్‌‌ను సిద్ధం చేసుకోవాల్సి ఉంది.  ఈ నేపథ్యంలో దూబే, సుందర్‌‌కు ఈ సిరీస్‌‌ కీలకం కానుంది.  ఇక, స్పిన్నర్‌‌ కోటాలో  కుల్దీప్‌‌, చహల్‌‌లో ఈసారి చాన్స్‌‌ ఎవరికి దొరుకుతుందో చూడాలి. వన్డే వరల్డ్‌‌కప్‌‌ తర్వాత కుల్చా జోడీ ఇప్పటిదాకా కలిసి ఆడలేదు. శార్దూల్‌‌ ఠాకూర్‌‌, నవ్‌‌దీప్‌‌ సైనీలో ఒకరు బుమ్రా, షమీతో కలిసి పేస్‌‌ బాధ్యతలు పంచుకుంటారు.

కేన్‌‌ కెప్టెన్సీకి పరీక్ష..

వరల్డ్‌‌కప్‌‌ ఫైనల్‌‌ ఓటమి తర్వాత న్యూజిలాండ్‌‌ అన్ని ఫార్మాట్లలో తడబడుతోంది. ఆటగాళ్ల గాయాలు జట్టును దెబ్బతీస్తున్నాయి. ఇక, ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌‌లో వైట్‌‌వాష్‌‌ అయిన తర్వాత కేన్‌‌ విలియమ్సన్‌‌ కెప్టెన్సీపై చర్చ మొదలైంది. షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో ఓవరాల్‌‌గా కివీస్‌‌ రికార్డు బాగానే ఉన్నప్పటికీ కెప్టెన్‌‌గా కేన్‌‌కు ఈ సిరీస్‌‌ పరీక్షనే చెప్పాలి. గాయం వల్ల ఇటీవల ఇంగ్లండ్‌‌ సిరీస్‌‌కు దూరమైన విలియమ్స్‌‌న్‌‌ రాకతో కివీస్‌‌ బ్యాటింగ్‌‌ లైనప్‌‌ ఎప్పటిలానే బలంగా మారింది. అయితే ఆల్‌‌రౌండర్‌‌ కోటాలో డారెల్‌‌ మిచెల్‌‌, గ్రాండ్‌‌హోమ్‌‌లో ఎవరో ఒకరే తుది జట్టులో ఉంటారు. శాంట్నర్‌‌, ఇష్‌‌ సోధీ స్పిన్‌‌ బాధ్యతలు పంచుకోనున్నారు. కోహ్లీని అడ్డుకునేందుకు ఆసీస్‌‌ జంపాను వాడినట్టుగా సోధీని ఉపయోగించుకోవాలని కివీస్‌‌ భావిస్తోంది. ఇక, బౌల్ట్‌‌, ఫెర్గుసన్‌‌, మాట్‌‌ హెన్రీ  గాయాలతో జట్టుకు దూరమవగా హామిష్‌‌ బెనెట్‌‌ చాలా కాలం తర్వాత కివీస్‌‌కు ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. టిమ్‌‌ సౌథీ, కుగిలైన్‌‌తో కలిసి పేస్‌‌ విభాగాన్ని నడిపించనున్నాడు. ఇటీవల ముగిసిన న్యూజిలాండ్‌‌ డొమెస్టిక్‌‌ టీ20 టోర్నీ సూపర్‌‌ స్మాష్‌‌ ఫైనల్‌‌లో బెనెట్‌‌17 వికెట్ల తీశాడు. లీగ్‌‌లో హయ్యస్ట్‌‌ వికెట్‌‌ టేకర్‌‌గా నిలిచాడు. మిడిల్‌‌, డెత్‌‌ ఓవర్లలో ప్రమాదకారైన బెనెట్‌‌ విషయంలో  టీమిండియా మిడిల్‌‌,

లోయరార్డర్‌‌ కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే.

వరల్డ్‌‌కప్‌‌  సెమీస్‌‌ ఓటమి నన్నింకా బాధిస్తోంది. కానీ, ఆ పరాజయానికి న్యూజిలాండ్‌‌పై ఇప్పుడు రివెంజ్‌‌ తీర్చుకోవాలన్న ఆలోచన లేదు.  కివీస్‌‌ ఆటగాళ్లు మంచోళ్లు. ఒకవేళ ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నా.. వాళ్లను చూస్తే ఆ జోన్‌‌లోకి వెళ్లాలనిపించదు. ఇరు జట్ల ప్లేయర్ల మధ్య మంచి అనుబంధం ఉంది. గ్రౌండ్‌‌లో మా మధ్య  పోటీతత్వం తప్ప మరోటి ఉండదు.    – విరాట్‌‌ కోహ్లీ

తుది జట్లు(అంచనా)

ఇండియా: రోహిత్‌‌శర్మ, కేఎల్‌‌ రాహుల్‌‌(కీపర్‌‌), విరాట్‌‌ కోహ్లీ(కెప్టెన్‌‌), శ్రేయస్‌‌ అయ్యర్‌‌, మనీశ్‌‌ పాండే, శివమ్‌‌ దూబే, సుందర్‌‌/ జడేజా, కుల్దీప్‌‌/ చహల్‌‌, షమీ, సైనీ/ ఠాకూర్‌‌, బుమ్రా.

న్యూజిలాండ్‌‌: గప్టిల్‌‌, మన్రో, సీఫర్ట్‌‌(కీపర్‌‌), విలియమ్సన్‌‌(కెప్టెన్‌‌), రాస్‌‌ టేలర్‌‌, గ్రాండ్‌‌హోమ్‌‌/డారెల్‌‌ మిచెల్‌‌, శాంట్నర్‌‌, ఇష్‌‌ సోధీ, టిమ్‌‌ సౌథీ, కుగిలైన్‌‌, బెనెట్‌‌.

పిచ్‌‌/ వాతావరణం

ఈడెన్‌‌ పార్క్‌‌ పిచ్‌‌ బ్యాటింగ్‌‌కు అనుకూలం. గత టూర్‌‌లో ఇక్కడ ఆడిన మ్యాచ్‌‌లో ఇండియా ఛేజింగ్‌‌లో గెలిచింది. అయితే ఆక్లాండ్‌‌లో శుక్రవారం వర్షం హెచ్చరికలున్నాయి. ఇటీవల ఇంగ్లండ్‌‌, కివీస్‌‌ మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌‌కు కూడా వర్షం ఆటంకం కలిగించింది. ఇంగ్లండ్‌‌ సూపర్‌‌ ఓవర్‌‌లో ఈ మ్యాచ్‌‌ గెలిచింది.

India vs New Zealand first T20 today

Latest Updates