సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ ముంగిట ఇండియా

  • 3-0 కు 2 వికెట్లే
  • మూడో టెస్ట్‌‌లో సౌతాఫ్రికా ఫాలోఆన్‌‌
  • రెండో ఇన్నింగ్స్‌‌లో 132/8
  • ఒకే రోజు16 వికెట్లు ఢమాల్
  • చెలరేగిన షమీ, ఉమేశ్​​

రాంచీలోనూ బౌలర్లు రఫ్ఫాడించారు..! బ్యాట్స్‌‌మెన్‌‌ ఇచ్చిన భారీ స్కోరును అండగా చేసుకుని సౌతాఫ్రికాను మళ్లీ ఫాలో ఆన్‌‌లో పడేశారు..! తొలి ఇన్నింగ్స్‌‌తో పాటు రెండో ఇన్నింగ్స్‌‌లోనూ ప్రత్యర్థులను తక్కువ స్కోరుకే పరిమితం చేసిన టీమిండియా… ఇన్నింగ్స్‌‌ విజయానికి మరో రెండు వికెట్ల దూరంలో నిలిచింది..! మొత్తంగా మూడో రోజు 16 వికెట్లు పడగొట్టిన కోహ్లీసేన.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రొటీస్‌‌ను ‘వైట్‌‌వాష్‌‌’ చేసేందుకు రెడీ అయ్యింది..! మరోవైపు కనీస పోరాట స్ఫూర్తిని కూడా చూపెట్టలేకపోయిన సౌతాఫ్రికా.. టెస్ట్‌‌ చరిత్రలో పెద్ద ఓటమి ముంగిట కొట్టుమిట్టాడుతున్నది..!!

రాంచీ:సౌతాఫ్రికాపై సరికొత్త చరిత్ర సృష్టించేందుకు టీమిండియా సిద్ధమైంది. పుణె మ్యాచ్‌‌ మాదిరిగానే రాంచీలోనూ ఇన్నింగ్స్‌‌ విజయానికి విరాట్‌‌సేన చేసిన కసరత్తు పూర్తి స్థాయిలో ఫలితాన్నిస్తోంది. పేసర్లు మహ్మద్‌‌ షమీ (3/10), ఉమేశ్‌‌ యాదవ్‌‌ (2/35) చెలరేగడంతో.. సోమవారం మూడో రోజు ఫాలో ఆన్‌‌ ఆడిన సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌లో 46 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులు చేసింది. డీబ్రూన్‌‌ (30 బ్యాటింగ్‌‌), నోర్జ్‌‌ (5 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సఫారీ టీమ్‌‌ ఇంకా 203 పరుగులు వెనుకబడి ఉండగా, చేతిలో రెండు వికెట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్‌‌లో ప్రొటీస్‌‌ ఓటమి దాదాపుగా ఖాయమైనట్లే.

తిప్పేశారు..

అంతకుముందు 9/2 ఓవర్‌‌నైట్‌‌ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌లో 56.2 ఓవర్లలో 162 పరుగులకే కుప్పకూలింది. ఐదో బంతికే అద్భుతమైన లేట్‌‌ ఔట్‌‌ స్వింగర్‌‌తో ఉమేశ్‌‌ (3/40), డుప్లెసిస్‌‌ (1)ను ఔట్‌‌ చేసి ఇచ్చిన ఆరంభాన్ని.. మధ్యలో స్పిన్నర్లు బాగా అందిపుచుకున్నారు. టర్నింగ్ బంతులతో సఫారీ మిడిలార్డర్‌‌ను పేకమేడలా కూల్చేశారు. ఓవర్‌‌నైట్‌‌ బ్యాట్స్‌‌మన్‌‌ హమ్జా (62) ఆకట్టుకున్నాడు. పేస్‌‌–స్పిన్‌‌ కాంబినేషన్‌‌ దీటుగా ఎదుర్కొంటూ వరుస విరామాల్లో బౌండరీలు కొట్టాడు. జడేజా బౌలింగ్‌‌లో మిడాన్‌‌లో భారీ సిక్సర్‌‌ కొట్టి కెరీర్‌‌లో తొలి హాఫ్‌‌ సెంచరీ (56 బాల్స్‌‌) పూర్తి చేశాడు. రెండో ఎండ్‌‌లో బవుమా (32) కూడా సమయోచితంగా స్పందించడంతో నాలుగో వికెట్‌‌కు 91 రన్స్‌‌ సమకూరాయి. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను 28వ ఓవర్‌‌లో జడేజా విడగొట్టాడు. స్ట్రయిట్‌‌ బాల్‌‌తో హమ్జాను క్లీన్‌‌బౌల్డ్‌‌ చేశాడు. తర్వాతి ఓవర్‌‌లోనే అరంగేట్రం బౌలర్‌‌ నదీమ్‌‌ (2/22).. బవుమాను ఔట్‌‌ చేసి కెరీర్‌‌లో తొలి వికెట్‌‌ సాదించాడు. క్లాసన్‌‌ (6) విఫలంకావడంతో సౌతాఫ్రికా 129/6 స్కోరుతో లంచ్‌‌కు వెళ్లింది.

లంచ్‌‌ తర్వాత లిండె (37) ఒంటరి పోరాటం చేసినా.. సహచరుల నుంచి సహకారం కరువైంది. బ్రేక్‌‌ తర్వాత నాలుగో బంతికే పీట్‌‌(4) వెనుదిరిగాడు. తర్వాతి ఓవర్‌‌లో ఉమేశ్‌‌ కొట్టిన డైరెక్ట్‌‌ త్రోకు రబడ (0) రనౌటయ్యాడు. ఇక నోర్జ్‌‌ (4)తో కలిసి లిండె.. దాదాపు 17 ఓవర్ల పాటు బౌలర్లను విసిగించాడు. చివరకు 56వ ఓవర్‌‌లో ఉమేశ్‌‌ వేసిన ఫుల్‌‌లెంగ్త్‌‌ బంతికి వికెట్‌‌ సమర్పించుకున్నాడు. తొమ్మిదో వికెట్‌‌కు 32 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాతి ఓవర్‌‌లో నోర్జ్‌‌ కూడా వెనుదిరగడంతో సౌతాఫ్రికాకు ఫాలో ఆన్‌‌ తప్పలేదు.

షమీ వణికించాడు..

ఫాలో ఆన్‌‌కు దిగిన సఫారీలను ఈసారి షమీ దెబ్బకొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌‌ మాదిరిగానే రెండో ఓవర్‌‌లోనే ఉమేశ్‌‌.. డికాక్‌‌ (5)ను ఔట్‌‌ చేసి షాకిచ్చాడు. కానీ రెండో ఎండ్‌‌లో షమీ.. వరుస ఓవర్లలో హమ్జా (0), డుప్లెసిస్‌‌ (4), బవుమా (0)ను పెవిలియన్‌‌కు పంపి ఒత్తిడిలోకి నెట్టాడు. దీంతో 22 రన్స్‌‌కే 4 కీలక వికెట్లుపడ్డాయి. ఉమేశ్‌‌ వేసిన బౌన్సర్‌‌.. ఎల్గర్‌‌ (16) హెల్మెట్‌‌ను బలంగా తాకడంతో రిటైర్డ్‌‌ హర్ట్‌‌గా పెవిలియన్‌‌కు వెళ్లిపోయాడు. దీంతో సౌతాఫ్రికా 26/4తో కాస్త ముందుగా టీ విరామానికి వెళ్లింది.

మూడో సెషన్‌‌లోనూ ఇండియా బౌలర్ల జోరు ఆగలేదు. అయితే పేస్‌‌.. లేదంటే స్పిన్‌‌తో క్రీజులోకి వచ్చిన సఫారీ బ్యాట్స్‌‌మన్‌‌ను ముప్పుతిప్పలు పెట్టారు. ఫలితంగా క్లాసన్‌‌ (5) తొందరగా ఔటయ్యాడు. కానీ లిండె (27), ఫీట్‌‌ మాత్రం కాసేపు ప్రతిఘటించారు. ఈ ఇద్దరు ఎక్కువగా డిఫెన్స్‌‌కు ప్రాధాన్యమిస్తూ 12 ఓవర్ల పాటు వికెట్‌‌ పడకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఆరో వికెట్‌‌కు 31 రన్స్‌‌ జోడించి లిండె రనౌట్‌‌అయ్యాడు. కాంకషన్‌‌ సబ్​స్టిట్యూట్​గా​ వచ్చిన డీబ్రూన్‌‌ స్పిన్‌‌ను సమర్థంగా అడ్డుకున్నాడు. 38వ ఓవర్‌‌లో జడేజా… పీట్‌‌ను ఔట్‌‌ చేయడంతో ఏడో వికెట్‌‌కు 31 రన్స్ భాగస్వామ్యం ముగిసింది. చివర్లో రబడ (12) నిరాశపర్చాడు. అయితే ఫలితం కోసం రెండు ఓవర్ల ఆటను పొడిగించినా డీబ్రూన్‌‌, నోర్జ్‌‌ వికెట్‌‌ పడకుండా మూడో రోజును ముగించారు.

కాంకషన్‌‌గా డీబ్రూన్‌‌

రెండో ఇన్నింగ్స్‌‌లో టాప్‌‌ ఆర్డర్‌‌ వైఫల్యంతో 8.3 ఓవర్లలోనే 22 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన సౌతాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. 10వ ఓవర్‌‌లో 145 కేపీహెచ్‌‌ వేగంతో ఉమేశ్‌‌ వేసిన బౌన్సర్‌‌.. ఎల్గర్‌‌ (16) హెల్మెట్‌‌ను బలంగా తాకింది. కళ్లు బైర్లు కమ్మిన బ్యాట్స్‌‌మన్‌‌ కాసేపు కదలకుండా తలను పట్టుకుని కూర్చుండిపోయాడు. బ్యాటింగ్‌‌ చేయడం సాధ్యంకాకపోవడంతో రిటైర్డ్‌‌ హర్ట్‌‌గా పెవిలియన్‌‌కు వెళ్లిపోయాడు. ఐసీసీ కొత్త రూల్‌‌ ప్రకారం ఎల్గర్‌‌ స్థానంలో కాంకషన్‌‌గా డీబ్రూన్‌‌ బ్యాటింగ్‌‌కు వచ్చాడు. కాగా, ఎల్గర్​ ఆరు రోజుల పాటు ఆటకు దూరమయ్యాడు.

స్కోరు బోర్డు

ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌: 497/9 డిక్లేర్డ్‌‌.

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌: ఎల్గర్‌‌ (సి) సాహా (బి) షమీ 0, డికాక్‌‌ (సి) సాహా (బి) ఉమేశ్‌‌ 4, హమ్జా (బి) జడేజా 62, డుప్లెసిస్‌‌ (బి) ఉమేశ్‌‌ 1, బవుమా (స్టంప్డ్​) సాహా (బి) నదీమ్‌‌ 32, క్లాసన్‌‌ (బి) జడేజా 6, లిండె (సి) రోహిత్‌‌ (బి) ఉమేశ్‌‌ 37, పీట్‌‌ (ఎల్బీ) షమీ 4, రబడ (రనౌట్‌‌) 0, నోర్జ్‌‌ (ఎల్బీ) నదీమ్‌‌ 4, ఎంగిడి (నాటౌట్‌‌) 0, ఎక్స్‌‌ట్రాలు: 12, మొత్తం: 56.2 ఓవర్లలో 162 ఆలౌట్‌‌.

వికెట్లపతనం: 1–4, 2–8, 3–16, 4–107, 5–107, 6–119, 7–129, 8–130, 9–162, 10–162. బౌలింగ్‌‌: షమీ 10–4–22–2, ఉమేశ్‌‌9–1–40–3, నదీమ్‌‌ 11.2–4–22–2, జడేజా 14–3–19–2, అశ్విన్‌‌ 12–1–48–0.

సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌: డికాక్‌‌ (బి) ఉమేశ్‌‌ 5, ఎల్గర్‌‌ (రిటైర్డ్‌‌హర్ట్‌‌) 16, హమ్జా (బి) షమీ 0, డుప్లెసిస్‌‌ (ఎల్బీ) షమీ 4, బవుమా (సి) సాహా (బి) షమీ 0, క్లాసన్‌‌ (ఎల్బీ) ఉమేశ్‌‌ 5, లిండె (రనౌట్‌‌) 27, పీట్‌‌ (బి) జడేజా 23, డీబ్రూన్‌‌ (నాటౌట్‌‌) 30, రబడ (సి) జడేజా (బి) అశ్విన్‌‌ 12, నోర్జ్‌‌ (బ్యాటింగ్‌‌) 5, ఎక్స్‌‌ట్రాలు: 5, మొత్తం: 46 ఓవర్లలో 132/8. వికెట్లపతనం: 1–5, 2–10, 3–18, 4–22, 5–36, 6–67, 7–98, 8–121. బౌలింగ్‌‌: షమీ 9–5–10–3, ఉమేశ్‌‌ 9–1–35–2, జడేజా 13–5–36–1, నదీమ్‌‌ 5–0–18–0, అశ్విన్‌‌ 10–0–28–1.

Latest Updates