ఇండియా తడబ్యాటు

ప్రతిష్టాత్మక టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌లో ఇండియాకు సరైన ఆరంభం దక్కలేదు. కరీబియన్‌‌ పేస్‌‌ బలం ముందు టీమిండియా టాప్‌‌ ఆర్డర్‌‌ దూది పింజల్లా తేలిపోయింది. దీంతో విండీస్‌‌తో గురువారం ప్రారంభమైన తొలి టెస్ట్‌‌లో విరాట్‌‌సేన తడబడింది. ఓపెనర్‌‌ కేఎల్‌‌ రాహుల్‌‌ (44), రహానె (50 బ్యాటింగ్‌‌) రాణించడంతో.. టీ విరామానికి ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌లో 47.2 ఓవర్లలో 4 వికెట్లకు 134 పరుగులు చేసింది. విహారి (18 బ్యాటింగ్‌‌) క్రీజులో ఉన్నాడు. వర్షం వల్ల ఔట్ ఫీల్డ్​తడిగా ఉండటంతో.. మ్యాచ్​షెడ్యూల్​టైమ్​కంటే 15 నిమిషాలు ఆలస్యంగా మొదలైంది. టాస్​గెలిచిన హోల్డర్​ రెండో ఆలోచన లేకుండా ఫీల్డింగ్​ఎంచుకున్నాడు. హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌కు ఫైనల్‌‌ ఎలెవన్‌‌లో చోటు దక్కలేదు.

రోచ్ డబుల్‌‌ ధమాకా

ఓవైపు వర్షం.. మరోవైపు మేఘావృత వాతావరణం.. ఈ రెండు కారణాలతో తమ కెప్టెన్‌‌ ఫీల్డింగ్‌‌ ఎంచుకోవడం సరైందేనని విండీస్‌‌ బౌలర్లు నిరూపించారు. మయాంక్‌‌ (5)తో కలిసి రాహుల్‌‌ ఇన్నింగ్స్‌‌ ప్రారంభించగా, కొత్త బంతితో రోచ్‌‌,  గాబ్రియెల్‌‌ రెండు వైపుల నుంచి బుల్లెట్‌‌లాంటి బంతులతో విరుచుకుపడ్డారు. తొలి రెండు ఓవర్లలో ఒక్క పరుగే వచ్చినా.. తర్వాతి ఓవర్‌‌లో మయాంక్‌‌ బౌండరీ కొట్టి ధైర్యం చూపెట్టాడు. కానీ ఐదో ఓవర్‌‌లో రోచ్‌‌ ఊహించని షాకిచ్చాడు. కేవలం ఐదు బంతుల వ్యవధిలో మయాంక్‌‌, పుజారా (2)ను ఔట్‌‌ చేశాడు. ఆఫ్‌‌స్టంప్‌‌ మీదకు సంధించిన ఫుల్‌‌ లెంగ్త్‌‌ బాల్‌‌ మయాంక్‌‌ బ్యాట్‌‌ను తాకుతూ కీపర్‌‌ చేతిలోకి వెళ్లింది. ఫీల్డ్‌‌ అంపైర్‌‌ నాటౌట్‌‌ ఇచ్చినా.. విండీస్‌‌ రివ్యూలో ఈ వికెట్‌‌ను దక్కించుకుంది. పుజారా కూడా ఔట్‌‌సైడ్‌‌ ఆఫ్‌‌ బంతిని వేటాడి ఔటయ్యాడు. దీంతో ఇండియా 7 పరుగులకే 2 వికెట్లు చేజార్చుకుంది. ఇక అదుకుంటాడనుకున్న కెప్టెన్‌‌ కోహ్లీ (9) కుదురుకోకముందే గాబ్రియెల్‌‌ దెబ్బకొట్టాడు. 8వ  ఓవర్‌‌లో వేగంగా దూసుకొచ్చిన యాంగిల్‌‌ బంతిని టచ్‌‌ చేయబోయి పాయింట్‌‌లో బ్రూక్స్‌‌ చేతికి చిక్కాడు. 25/3 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే బాధ్యతను తీసుకున్న రాహుల్‌‌, రహానె నెమ్మదిగా ఆడారు. డిఫెన్స్‌‌కు ఎక్కువ ప్రాధాన్యమిచ్చిన రహానె తొలి రెండు పరుగుల కోసం 32 బాల్స్‌‌ ఆడాడు. కమిన్స్‌‌ వేసిన 16వ ఓవర్‌‌లో రాహుల్‌‌ రెండు ఫోర్లు బాదడంతో ఒత్తిడి కాస్త తగ్గింది. ఈ ఇద్దరి నిలకడతో 20 ఓవర్లలో ఇండియా స్కోరు 54/3కి చేరింది. ఎదుర్కొన్న 37వ బంతికి తొలి ఫోర్‌‌ కొట్టిన రహానె వికెట్‌‌ పడకుండా ఆడటంతో టీమిండియా 24 ఓవర్లలో 68/3తో లంచ్‌‌కు వెళ్లింది.

రహానె నిలకడ..

లంచ్ తర్వాత రాహుల్‌‌, రహానె మరింత నెమ్మదిగా ఆడే ప్రయత్నం చేశారు. రోచ్‌‌, గాబ్రియెల్‌‌కు తోడుగా హోల్డర్‌‌ బౌలింగ్‌‌కు వచ్చినా.. ఈ జోడీ ఎక్కడా తడబడలేదు. అయితే 35వ ఓవర్‌‌లో బౌలింగ్‌‌కు వచ్చిన ఛేజ్‌‌.. రాహుల్‌‌ను ఔట్‌‌ చేశాడు. అద్భుతమైన ఫుల్‌‌లెంగ్త్‌‌ను లెగ్‌‌సైడ్‌‌ టర్న్‌‌ చేయడంతో గ్లాన్స్‌‌ చేసే ప్రయత్నంలో రాహుల్‌‌ వికెట్‌‌ కీపర్‌‌కు చిక్కాడు. దీంతో నాలుగో వికెట్‌‌కు 68 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. విరామం తర్వాత దాదాపు 10 ఓవర్లు క్రీజులో ఉన్న రాహుల్‌‌ హాఫ్‌‌ సెంచరీ చేయకుండానే వెనుదిరిగాడు. రహానెకు జత కలిసిన తెలుగు కుర్రాడు విహారి సమయోచితంగా ఆడాడు. ఈ క్రమంలో రహానె 117 బంతుల్లో హాఫ్‌‌ సెంచరీ చేశాడు.

Latest Updates