ట్రోఫీ ఎవరిది?..ఇవాళ విండీస్‌ తో మూడో టీ20

  • నేడు ఇండియా, విండీస్‌ మూడో టీ20
  • టీమిండియాపై ఫీల్డింగ్‌ ఒత్తిడి
  • జోరుమీదున్నకరీబియన్లు
  • రా. 7 నుంచిస్టా ర్‌ స్పోర్ట్స్‌ లో

ముంబై:ఓవైపు చేసిన తప్పులను సరిదిద్దుకోవడం.. మరోవైపు సిరీస్‌‌ చేజారకుండా చూసుకోవడం.. ఈ రెండింటి మధ్యలో వెస్టిండీస్‌‌పై రివేంజ్‌‌ తీసుకోవడం.. ప్రస్తుతం టీమిండియా ముందున్న టార్గెట్లు ఇవి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగే టీ20 సిరీస్‌‌ డిసైడ్‌‌ మ్యాచ్‌‌లో ఇండియా.. వెస్టిండీస్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది. ఇరుజట్లు చెరో మ్యాచ్‌‌ గెలవడంతో ఈ సిరీస్‌‌ 1–1తో సమంగా ఉంది. ఇప్పుడు ముంబై ఫైట్‌‌లో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్‌‌ కావడంతో రెండు జట్లు పక్కా ప్రణాళికలతో దిగుతున్నాయి. తొలి మ్యాచ్‌‌ పరాజయం నుంచి తొందరగానే తేరుకున్న కరీబియన్లు.. రెండో టీ20లో టీమిండియాను అన్ని అంశాల్లో కట్టడి చేసి అద్భుత విజయం సాధించారు. ఫామ్‌‌, రికార్డుల పరంగా చూస్తే ఈ మ్యాచ్‌‌లోనూ టీమిండియానే ఫేవరెట్. కానీ ధనాధన్‌‌ ఫార్మాట్‌‌లో ఈ రెండింటితో పెద్దగా ఉపయోగం ఉండదు. కేవలం పవర్‌‌ హిట్టింగ్‌‌తోనే పని. ఇప్పుడు అదే పనిలో ఇరుజట్లు నిమగ్నమయ్యాయి.

పంత్‌‌, సుందర్‌‌పైనే దృష్టి

ఈ మ్యాచ్‌‌కు ఫైనల్‌‌ ఎలెవన్‌‌ను మార్చే యోచన లేకపోయినా.. పిచ్‌‌ కండీషన్స్‌‌ బట్టి ఒకటి, రెండు మార్పులు తప్పకపోవచ్చు. దీనికి తోడు బౌలింగ్‌‌, ఫీల్డింగ్‌‌ను కూడా బలోపేతం చేయాలని భావిస్తున్న విరాట్‌‌.. కుల్దీప్‌‌, షమీని తీసుకువస్తాడా చూడాలి. యంగ్‌‌ గన్స్‌‌ సుందర్‌‌, పంత్‌‌కుఈ మ్యాచ్‌‌ చావోరేవో. బౌలింగ్‌‌లో సుందర్‌‌ భారీగా రన్స్‌‌ ఇచ్చుకోవడం ప్రతికూలాంశంగా మారింది. గత ఐదు టీ20ల్లో 23 ఓవర్లు వేసిన సుందర్‌‌ 144 రన్స్‌‌ ఇచ్చాడు. దీనికితోడు ఫీల్డింగ్‌‌లోనూ సులువైన క్యాచ్‌‌లను వదిలేస్తున్నాడు. ఇది టీమ్‌‌ మొత్తంపై ప్రభావం చూపిస్తున్నది. ఇక పంత్‌‌ బ్యాటింగ్‌‌ కూడా ఆశించిన స్థాయిలో లేదు. గత ఏడు టీ20ల్లో 33 *, 18, 6, 27, 19, 4 పరుగులే చేశాడు. వరుసగా ఇస్తున్న చాన్స్‌‌లను ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోతున్న ఈ ఢిల్లీ బాయ్‌‌.. నాలుగో నంబర్‌‌కు ఏమాత్రం సరిపోవడం లేదు. కీపర్‌‌గా క్యాచ్‌‌లను వదిలేయడం, స్టంపౌట్‌‌లను మిస్‌‌ చేయడం, త్రోలను పట్టకపోవడం పంత్‌‌కు అతిపెద్ద సవాలుగా మారింది. అగస్ట్‌‌లో విండీస్‌‌పై హాఫ్‌‌ సెంచరీ చేసిన పంత్‌‌.. ఈ మ్యాచ్‌‌లో ఆడకపోతే శాంసన్‌‌కు చాన్స్‌‌ ఇచ్చినట్లే. మిగతా లైనప్‌‌లో హిట్‌‌మ్యాన్‌‌ రోహిత్‌‌ గాడిలో పడాలి. ఈ ముంబైకర్‌‌ ఆడితేనే టీమిండియా భారీ స్కోరు సాధ్యమవుతుంది. రాహుల్‌‌, కోహ్లీ ఓకే. కానీ ఆశలు పెట్టుకున్న శ్రేయస్‌‌ అయ్యర్‌‌ బ్యాట్‌‌ ఝుళిపించాల్సి ఉంది. ఈ సిరీస్‌‌లో టీమిండియా బౌలింగ్‌‌లో దారుణంగా ఫెయిలైంది. పేసర్లు దీపక్‌‌, భువనేశ్వర్‌‌ రన్స్‌‌ కట్టడి చేయలేకపోతున్నారు. డెత్‌‌ ఓవర్లలో బౌలింగ్‌‌ మరింత ఘోరంగా తయారైంది. స్పిన్నర్‌‌గా చహల్‌‌ ప్రభావం తగ్గింది. మిడిల్‌‌ మ్యాచ్‌‌ను కంట్రోల్​ చేసే చహల్‌‌.. భారీ సిక్సర్లు కొట్టే చాన్స్‌‌ ఇస్తున్నాడు. మార్పులు అనివార్యమైతే దీపక్‌‌, సుందర్‌‌ ప్లేస్‌‌ల్లో కుల్దీప్‌‌, షమీ రావొచ్చు. ముగ్గురు పేసర్లయితే జడేజా కూడా బెంచ్‌‌కే పరిమితం. ఇక వీటన్నింటికంటే అతిపెద్ద సమస్య క్యాచ్‌‌ డ్రాప్స్‌‌. దీనిని అధిగమించకుంటే ట్రోఫీ చేజారినట్లే.

టాపే బలం..

ధనాధన్‌‌ ఫార్మాట్‌‌లో రెండుసార్లు వరల్డ్‌‌ చాంపియన్స్‌‌ అయిన విండీస్‌‌ వీరులకు టాప్‌‌ ఆర్డర్‌‌ అతిపెద్ద బలం. రెండో టీ20లో లూయిస్‌‌, సిమ్మన్స్‌‌, పూరన్‌‌, హెట్‌‌మయర్‌‌ ఆడిన తీరే ఇందుకు నిదర్శనం. గ్రౌండ్‌‌ ఎంత పెద్దగా ఉన్నా.. పవర్‌‌ హిట్టింగ్‌‌తో అలవోకగా సిక్స్‌‌లు కొట్టడం వీళ్ల నైజం. దీనిని ఆపాలంటే నాణ్యమైన, తెలివైన బౌలర్‌‌ ఉండాలి. గతంలో భువీ స్ట్రయిక్‌‌ వికెట్లతో ఇబ్బందిపెట్టినా ఇప్పుడు ఆ స్థాయిలో రాణించకపోవడం విండీస్‌‌కు వరంగా మారింది. బ్రెండన్‌‌ కింగ్‌‌ తన సత్తా చూపే సమయం ఆసన్నమైంది. ఇక పొలార్డ్‌‌కు వాంఖడే పిచ్‌‌ కొట్టిన పిండి. ముంబై ఇండియన్స్‌‌ తరఫున ఎన్నో మ్యాచ్‌‌లు ఆడిన పొలార్డ్‌‌ ఈ మ్యాచ్‌‌లో అత్యంత ప్రమాదకారి కానున్నాడు. బౌలింగ్‌‌లో కొట్రెల్‌‌, విలియమ్స్‌‌ గాడిలో పడటం సానుకూలాంశం. వాల్ష్‌‌, పైర్‌‌, హోల్డర్‌‌ కూడా రాణిస్తున్నారు. అలెన్‌‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో రెండో టీ20లో ఆడిన టీమ్‌‌నే దించనున్నారు. బలమైన హిట్టింగ్‌‌తో ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాలని భావిస్తున్న కరీబియన్లు భారీ స్కోరుతో సిరీస్‌‌కు ఘనమైన ముగింపు ఇవ్వాలని యోచిస్తున్నారు.

జట్లు (అంచనా)

ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌ ), రోహిత్‌ , రాహుల్‌ ,అయ్యర్‌ , పంత్‌ , దూబే, జడేజా, సుందర్‌ /కుల్దీప్‌ , చహల్‌ , దీపక్‌ / షమీ, భువనేశ్వర్‌ .

వెస్టిండీస్‌‌: పొలార్డ్‌‌ (కెప్టెన్‌‌),  సిమ్మన్స్‌‌, లూయిస్‌‌, కింగ్‌‌, హెట్‌‌మయర్‌‌, పూరన్‌‌, హోల్డర్‌‌, పైర్‌‌, విలియమ్స్‌‌, కొట్రెల్‌‌, వాల్ష్‌‌.

 

Latest Updates