ఉప్పల్‌లో ఊపెవరిదో!: ఇండియా – వెస్టిండీస్‌‌ తొలి టీ20 నేడే

ఫేవరెట్‌‌గా కోహ్లీసేన..మ్యాచ్‌‌ రాత్రి 7 నుంచి స్టార్‌‌ స్పోర్ట్స్‌‌లో

ఫార్మాట్‌‌ ఏదైనా.. ప్రత్యర్థి ఎవరైనా.. వేదిక ఎక్కడైనా.. తిరుగులేని ఆటతో వరుస విజయాలతో దూసుకెళ్తోన్న టీమిండియా మరో సవాల్‌‌కు సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే టీ20 వరల్డ్‌‌కప్‌‌పై ఓ కన్నేసిన కోహ్లీసేన ప్రయోగాలు చేస్తూనే విజయయాత్ర కొనసాగించాలని టార్గెట్‌‌గా పెట్టుకున్నది. ఈ నేపథ్యంలో కరీబియన్‌‌ వీరులతో ధనాధన్‌‌ వార్‌‌కు రెడీ అయ్యింది. మూడు టీ20ల సిరీస్‌‌లో ఇరు జట్ల మధ్య హైదరాబాద్‌‌లో నేడే తొలి పోరు.  సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌‌ను చిత్తు చేసిన తర్వాత పూర్తి స్థాయి జట్టుతో బరిలో నిలిచిన ఇండియా మరో సిరీస్‌‌పై కన్నేసింది..!  టీ20 వరల్డ్‌‌కప్‌‌ దృష్ట్యా టీమ్‌‌లో ప్లేస్‌‌ను పదిలం చేసుకునేందుకు రిషబ్‌‌ పంత్‌‌, లోకేశ్‌‌ రాహుల్‌‌ వంటి ప్లేయర్లకు ఇది మరో చాన్స్‌‌!  మరోవైపు టీ20 వరల్డ్‌‌ చాంపియన్స్‌‌ అయినప్పటికీ.. చెత్తాటతో  పదో ర్యాంక్‌‌కు పడిపోయిన విండీస్‌‌.. స్టార్లు లేక డీలా పడింది..!  గతేడాది తమ దేశానికి వచ్చిన ఇండియా చేతిలో చిత్తుగా ఓడింది..!  చివరకు అఫ్గానిస్థాన్‌‌ చేతిలోనూ ఓడింది..! అయితే, పక్కా టీ20 ప్లేయర్లతో నిండిన కరీబియన్‌‌ టీమ్‌‌ను లైట్‌‌ తీసుకోవడానికి వీల్లేదు..! మనకు కావాల్సిందీ అదే..! విండీస్‌‌ వీరులు పోటాపోటీగా ఆడాలి.. ఇండియా గెలవాలి..! మరి, ఉప్పల్‌‌లో తమ ఆటతో ఫ్యాన్స్‌‌ను ఊపేసేదెవరో..!

హైదరాబాద్‌‌, వెలుగుటీ20 వరల్డ్‌‌ కప్‌‌ ప్రిపరేషన్స్‌‌లో భాగంగా టీమిండియా స్వదేశంలో ఈ ఏడాది చివరి టీ20 సిరీస్‌‌లో పాల్గొనబోతోంది. వెస్టిండీస్‌‌తో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌‌లో భాగంగా శుక్రవారం ఉప్పల్‌‌ రాజీవ్‌‌గాంధీ ఇంటర్నేషనల్‌‌ స్టేడియంలో జరిగే ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లో కోహ్లీసేన ఫేవరెట్‌‌గా బరిలోకి దిగుతోంది. పింక్‌‌ బాల్‌‌తో డేనైట్‌‌ పోరును రెండున్నర రోజుల్లోనే ముగించిన హోమ్‌‌టీమ్‌‌ స్వల్ప విరామం తర్వాత వైట్‌‌బాల్‌‌ క్రికెట్‌‌లోనూ అదరగొట్టాలని చూస్తోంది. ప్రస్తుత ఫామ్‌‌, గత రికార్డులు, ఇరు జట్ల బలాబాలాలు.. దేన్ని చేసినా మొగ్గు ఇండియావైపే ఉంది. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌లోనే నెగ్గి సిరీస్‌‌లో బోణీ కొట్టాలని కోహ్లీసేన చూస్తోంది. అండర్‌‌డాగ్స్‌‌గా బరిలోకి దిగుతున్న కరీబియన్లు ఈ మ్యాచ్‌‌లో గెలిచి అంచనాలు తలకిందులు చేయాలని భావిస్తున్నారు. ఇక, రెండేళ్ల కిందట ఉప్పల్‌‌ ఆతిథ్యమిచ్చిన తొలి టీ20 (ఇండియా-–ఆస్ట్రేలియా) మ్యాచ్‌‌ రోజు చుక్క వర్షం పడకపోయినా రద్దవడంతో హైదరాబాద్‌‌ ఫ్యాన్స్‌‌కు నిరాశ కలిగింది. ఏ మ్యాచ్‌‌ జరిగినా స్టేడియానికి పోటెత్తే ఫ్యాన్స్‌‌… ఈ పోరు హోరాహోరీగా సాగాలని కోరుకుంటున్నారు.

రాహుల్‌‌, పంత్‌‌పైనే ఫోకస్

ప్రత్యర్థితో పోల్చితే బ్యాటింగ్‌‌, బౌలింగ్‌‌ అన్నింటిలోనూ టీమిండియా అత్యంత పటిష్ఠంగా ఉంది. బంగ్లాతో టీ20 సిరీస్‌‌కు దూరంగా ఉన్న కెప్టెన్‌‌ కోహ్లీ విరాట్‌‌ కోహ్లీ రాకతో బ్యాటింగ్‌‌ బలం మరింత పెరిగింది. అతనితో పాటు ఓపెనర్‌‌ రోహిత్‌‌ శర్మ జోరు మీదున్నాడు. నిలకడైన ఆటతో శ్రేయస్‌‌ అయ్యర్‌‌ నాలుగో నంబర్‌‌ ప్లేస్‌‌ దాదాపు కన్ఫామ్‌‌ చేసుకున్నట్టే. సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ టోర్నీలో కర్నాటకను గెలిపించిన కొత్త పెళ్లి కొడుకు మనీశ్​ పాండే కూడా ఊపుమీదున్నాడు. వీరిలో ఏ ఇద్దరు క్రీజులో నిలిచినా పరుగుల వరద ఖాయమే. అయితే, వచ్చే ఏడాది జరిగే వరల్డ్‌‌కప్‌‌ కోసం ప్రిపరేషన్స్‌‌ను కొనసాగిస్తున్న ఇండియా మేనేజ్‌‌మెంట్‌‌ ఈ సిరీస్‌‌లోనూ పలువురు ఆటగాళ్లను పరీక్షిస్తోంది. అందులో ఒకడు లోకేశ్‌‌ రాహుల్‌‌. గాయం కారణంగా శిఖర్‌‌ ధవన్‌‌ సిరీస్‌‌ నుంచి తప్పుకున్న నేపథ్యంలో బ్యాటుతో చెలరేగి సెకండ్‌‌ ఓపెనర్‌‌ ప్లేస్‌‌ను కొట్టేసేందుకు అతనికిది మంచి చాన్స్‌‌. పైగా, ఈ ఫార్మాట్‌‌లో లోకేశ్‌‌కు మంచి రికార్డు ఉంది. 31 టీ20ల్లో అతను 42.74 యావరేజ్‌‌తో 974 రన్స్‌‌ చేశాడు. అతనితోపాటు ఈ సిరీస్‌‌లో అందరి ఫోకస్‌‌ రిషబ్‌‌ పంత్‌‌పై ఉండనుంది. ధోనీ వారసుడిగా పేరుతెచ్చుకున్న కీపర్‌‌ పంత్‌‌ బ్యాటుతో పాటు కీపింగ్‌‌లోనూ ఫెయిలవుతున్నాడు. ఇప్పటికే చాలా చాన్స్‌‌లు కొట్టేసిన యువ క్రికెటర్‌‌కు ఈ సిరీస్‌‌ చావోరేవో లాంటిదే. ఇందులోనూ ఫెయిలైతే కేరళ వికెట్‌‌ కీపర్‌‌-బ్యాట్స్‌‌మన్‌‌ సంజు శాంసన్‌‌కు దారివ్వాల్సి ఉంటుంది. ధవన్‌‌కు రిప్లేస్‌‌మెంట్‌‌గా వచ్చినప్పటికీ శాంసన్‌‌కు ఈ మ్యాచ్‌‌లో చాన్స్‌‌ రాకపోవచ్చు.

బరిలోకి భువీ

బౌలింగ్‌‌ విషయానికి వస్తే.. కుల్దీప్‌‌ యాదవ్‌‌, మహ్మద్‌‌ షమీ, భువనేశ్వర్‌‌ వంటి స్టార్లు మళ్లీ టీ20 టీమ్‌‌లోకి వచ్చారు. చాన్నాళ్ల తర్వాత కుల్చా (చహల్‌‌-కుల్దీప్‌‌) ద్వయం కలిసినప్పటికీ ఉప్పల్‌‌లో ఒక్కరికే (చహల్‌‌)కే అవకాశం రావొచ్చు. భువీ, షమీ రీఎంట్రీతో పేస్‌‌ మరింత పదునెక్కింది. షమీ 2017లో తన చివరి టీ20 ఆడగా, ఈ ఏడాది ఆగస్టులో విండీర్‌‌లో గాయపడి టీమ్‌‌కు దూరమైన భువీ మళ్లీ ఆ జట్టుపైనే రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే, షార్ట్‌‌ ఫార్మాట్‌‌లో అద్భుతంగా ఆడుతున్న యువ పేసర్‌‌ దీపక్‌‌ చహర్‌‌తో భువీకి గట్టి పోటీ ఉండనుంది. స్పిన్‌‌, పేస్‌‌ ఆల్‌‌రౌండర్లతో (జడేజా, శివం దూబే) ఆడాలని మేనేజ్‌‌మెంట్‌‌ భావిస్తే షమీ బెంచ్‌‌కే పరిమితం కావొచ్చు. ఐపీఎల్‌‌లో సన్‌‌రైజర్స్‌‌కు ఆడిన భువీకి ఉప్పల్‌‌ గ్రౌండ్‌‌పై పట్టు ఉండడం పస్ల్‌‌ పాయింట్‌‌. ప్రయోగాల్లో భాగంగా యువ ఆల్‌‌రౌండర్‌‌ దూబేకు మరో చాన్స్‌‌ ఖాయమే. బంగ్లాపై పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అతను ఈ సిరీస్‌‌లో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి.

విండీస్‌‌ ఏం చేస్తుందో?

టీ20 వరల్డ్‌‌ చాంపియన్‌‌ వెస్టిండీస్‌‌ ఆట ఈ మధ్య దిగజారిపోయింది. ఆగస్టులో హోమ్‌‌గ్రౌండ్‌‌లో 0–3తో ఇండియాకు సిరీస్‌‌ అప్పగించిన ఆ టీమ్‌‌ ఇప్పుడు పదో ర్యాంక్‌‌కు పడిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పైగా, క్రిస్‌‌ గేల్‌‌, ఆండ్రీ రసెల్‌‌, కార్లోస్‌‌ బ్రాత్‌‌వైట్‌‌ లాంటి మ్యాచ్‌‌ విన్నర్లు లేని ఆ జట్టు నుంచి బలమైన ఇండియాకు గట్టి పోటీ ఆశించినలేని పరిస్థితి. పైగా, బాల్‌‌ ట్యాంపరింగ్‌‌ చేసి నాలుగు మ్యాచ్‌‌ల బాన్‌‌లో ఉన్న నికోలస్‌‌ పూరన్‌‌ ఈ మ్యాచ్‌‌కు దూరమయ్యాడు. అయితే, వరల్డ్‌‌కప్‌‌ను దృష్టిలో పెట్టుకొని టీమ్‌‌లో ప్లేస్‌‌ ఖాయం చేసుకోవాలని పలువురు కుర్రాళ్లు ఆశిస్తున్నారు. అలెన్‌‌.. రసెల్‌‌ ప్లేస్‌‌పై కన్నేశాడు.

టాప్‌‌ స్కోరర్‌‌గా నిలిచిన కింగ్‌‌, యూఎస్‌‌ఏ నుంచి వచ్చిన హేడెన్‌‌ వాల్ష్‌‌ టాలెంటెడ్‌‌ ప్లేయర్స్‌‌. లెండిల్‌‌ సిమ్మన్స్‌‌ రాకతో బ్యాటింగ్‌‌ బలం కూడా పెరిగింది. షిమ్రన్‌‌ హెట్‌‌మయర్‌‌, షెల్డన్‌‌ కాట్రెల్‌‌, జేసన్‌‌ హోల్డర్‌‌ అండ కూడా ఉంది. కొత్తగా కెప్టెన్‌‌ అయిన వెటరన్‌‌ స్టార్‌‌ కీరన్‌‌ పొలార్డ్‌‌ జట్టును ముందుండి నడిపించాలని చూస్తున్నాడు. వారికి యువ ప్లేయర్లు ఎలాంటి సహకారం అందిస్తారో చూడాలి. ఇక, లఖ్‌‌నవ్‌‌లో అఫ్గానిస్థాన్‌‌తో వన్డే, టీ20, టెస్టు సిరీస్‌‌లు ఆడి.. ఇప్పటికే ఇండియా వాతావరణానికి అలవాటు పడడం కరీబియన్లకు కలిసొచ్చే అంశం.

ఇండియాలో ఇది వరకు మేం చాలాసార్లు ఆడాం.  ఆ అనుభవాన్ని ఉపయోగించుకొని ఇక్కడ మ్యాచ్‌‌లు నెగ్గేందుకు ప్రయత్నిస్తాం.

– కీరన్‌‌ పొలార్డ్‌‌

జట్లు (అంచనా)

ఇండియా : రోహిత్‌‌, లోకేశ్‌‌, కోహ్లీ (కెప్టెన్‌‌), అయ్యర్‌‌, పాండే, పంత్‌‌ (కీపర్‌‌), దూబే, జడేజా, భువనేశ్వర్‌‌, దీపక్‌‌ చహర్‌‌, చహల్‌‌.

వెస్టిండీస్‌‌: ఎవిన్‌‌ లూయిస్‌‌, సిమ్మన్స్‌‌, బ్రెండన్‌‌ కింగ్‌‌, హెట్‌‌మయర్‌‌, పొలార్డ్‌‌ (కెప్టెన్‌‌), రామ్‌‌దిన్‌‌ (కీపర్‌‌), జేసన్‌‌ హోల్డర్‌‌, పైర్‌‌/కీమో పాల్‌‌, అలెన్‌‌, హేడెన్‌‌ వాల్ష్‌‌, షెల్డన్‌‌ కాట్రెల్‌‌.

మరిన్ని వార్తల కోసం

Latest Updates