పాక్ పై తొలి దెబ్బ : మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదా ఉపసంహరించిన భారత్

ఢిల్లీలో ఈ ఉదయం పీఎం మోడీ అధ్యక్షతన జరిగిన జాతీయ భద్రతా వ్యవహారాల క్యాబినెట్ భేటీలో కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉగ్రవాదులు దాడి చేసి చాలా పెద్ద తప్పు చేశారని, దీనికి బాధ్యులకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రధాని హెచ్చరించారు. దేశ భద్రత అంశాలపై రేపు అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించనున్నారు.

మరోవైపు పాకిస్తాన్ దేశాన్ని ప్రాధాన్యతాంశాల జాబితా నుంచి భారత్ తొలగించింది. పాకిస్థాన్ కు ఇప్పటికే భారత్ ఇచ్చిన… అత్యంత అనుకూల దేశం అనే హోదాను వెనక్కితీసుకుంది. పక్షపాతం లేకుండా అన్ని దేశాలు సమానమే అని నమ్మే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ లో ఫేవరబుల్ నేషన్ అనే హోదాకు చాలా విలువ ఉంటుంది. ఆ హోదాను ఎవరు ఉపసంహరించినా… పాకిస్థాన్ కు అంతర్జాతీయ వాణిజ్య అంశాల్లో  ఇబ్బందులు తప్పవు. ఇండియా తాజాగా పాకిస్థాన్ కు ఉన్న “మోస్ట్ ఫేవర్డ్ నేషన్” హోదాను వెనక్కి తీసుకోవడంతో.. ఆదేశానికి వాణిజ్య పరంగా ఇచ్చే రాయితీలకు చెక్ పడుతుంది.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఇంటెలిజెన్స్ వర్గాలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో భద్రత, రక్షణ, నిఘా వర్గాల అధికారులు పాల్గొన్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదంపై అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు.

ఉగ్రదాడి చేసింది పాకిస్తాన్ లోని టెర్రరిస్టులే అని అగ్రరాజ్యం అమెరికా చెప్పింది. ఉగ్రవాద సంస్థలకు సహకారాన్ని వెంటనే ఆపేయాలని సూచించింది.

Latest Updates