పాక్ ఉగ్రవాదులు మరిచిపోలేని దెబ్బకొడతాం : జైట్లీ

న్యూఢిల్లీ: పుల్వామా దాడికి పాల్పడిన వారు భారీ ముల్యం చెల్లించుకోక తప్పదని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఈ దాడి వెనుక ఉన్న పాకిస్థాన్ ను ప్రపంచంలో ఒంటరిని చేస్తామని అన్నారు. కశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన సీఆర్పీఎఫ్ జవాన్లకు సంతాపం తెలిపారు. ఈ దాడి నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో కేబినెట్ కమిటీ ఫర్ సెక్యూరిటీ ఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్ నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, కేంద్ర హోం శాఖ, రక్షణ శాఖ ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.

సమావేశం ముగిశాక జైట్లీ మీడియాతో మాట్లాడారు. దాడిలో అమరులైన జవాన్ల కమిటీ సంతాపం ప్రకటించిందని, వారి కుటుంబాలకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. ఈ దాడికి పాల్పడినందుకు భారీ మూల్యం చెల్లించకతప్పదని అన్నారు. దేశ భద్రత విషయంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నామని చెప్పారు. కమిటీ భేటీలో చాలా విషయాలు చర్చించామని, వాటిని ఇప్పుడు బయటకు చెప్పలేమని అన్నారు.

పాక్ కు భారత్ ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ ను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించిందని జైట్లీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలతో భారత విదేశాంగ శాఖ చర్చించి, పాక్ ను అంతర్జాతీయ సమాజంలో ఒంటరి చేసేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కాగా, ఇటీవల తీవ్ర అనారోగ్యంతో అమెరికాలో చికిత్స తీసుకున్న భారత్ కు తిరిగి వచ్చిన జైట్లీ ఇవాళే విధుల్లో చేరారు.

Latest Updates