ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌కు గుడ్‌‌బై చెప్పిన సునీతా లక్రా

న్యూఢిల్లీ: ఇండియా మహిళల హాకీ టీమ్‌‌ డిఫెండర్‌‌ సునీతా లక్రా.. ఇంటర్నేషనల్‌‌ కెరీర్‌‌కు గురువారం గుడ్‌‌బై చెప్పింది. మోకాలి గాయానికి రెండోసారి ఆపరేషన్‌‌ అవసరం కావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో టోక్యో ఒలింపిక్స్‌‌లో పాల్గొనాలన్న తన కలను నెరవేర్చుకోకుండానే ఆటకు వీడ్కోలు పలికింది. ‘ఇది చాలా భావోద్వేగమైన సమయం. కెరీర్‌‌ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నా. త్రీ డెకేడ్స్‌‌ తర్వాత ఇండియా టీమ్‌‌ 2016 రియో ఒలింపిక్స్‌‌లో బరిలోకి దిగింది. ఆ టీమ్‌‌లో నేను ఉండటం నా అదృష్టం. టోక్యోలోనూ భాగం కావాలని అనుకున్నా. కానీ గాయం తీవ్రంగా ఉంది. ఆపరేషన్‌‌ తప్పదని డాక్టర్లు చెబుతున్నారు. పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఎంత టైమ్‌‌ పడుతుందో చెప్పలేం. దీంతో టోక్యోలో ఆడాలన్న నా ఆశలు నెరవేరే చాన్స్‌‌ లేదు’ అని లక్రా వివరించింది. గాయం నుంచి కోలుకున్న తర్వాత డొమెస్టిక్‌‌ టోర్నీల్లో ఆడతానని చెప్పింది. ఇండియా టీమ్‌‌తో తనకు మర్చిపోలేని జ్ఞాపకాలు ఉన్నాయని చెప్పిన లక్రా.. తన కెరీర్‌‌లో మద్దతుగా నిలిచిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపింది. ‘కష్టకాలంలో నాకు అండగా ఉన్న సహచరులకు, చీఫ్‌‌ కోచ్‌‌ మారీన్‌‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా కోసం కుటుంబం చాలా త్యాగం చేసింది. నా భర్త, కుటుంబం, స్నేహితులకు ధన్యవాదాలు. వాళ్ల ప్రోత్సాహం లేకపోతే నేను ఇంత దూరం రాకపోయేదాన్ని’ అని లక్రా వ్యాఖ్యానించింది.

India women's hockey team defender Sunita Lakra announces retirement due to injury breakdown

Latest Updates