సురక్షితంగా రప్పించండి : కేంద్రానికి అభినందన్ కుటుంబం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆర్మీకి చిక్కిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ అభినందన్ వర్తమాన్ ను తిరిగి వెనక్కు తీసుకురావాలని ఆయన కుటుంబం ప్రభుత్వాన్ని కోరింది. టీవీల్లో అభినందన్ వీడియోలు చూసి తట్టుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసింది. అభినందన్‌ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపణవూరు. ఆయన తండ్రి వర్తమాన్‌ ఎయిర్‌ మార్షల్ గా పనిచేశారు. చెన్నైలోని తాంబరం ఎయిర్ ఫోర్స్ అకాడమీ క్వా ర్టర్స్ లో అభినందన్ తల్లిదండ్రులు ఉంటున్నారు.

‘నేను అభి విజువల్స్ ను టీవీల్లో చూశా. తనను ఈ చేతుల్తో ఎత్తుకుని పెంచా. ప్రభుత్వం ఎలాగైనా తనను వెనక్కు తీసుకురావాలి”అని అభినందన్ మేనమామ గంగునాథన్ విజ్ఞప్తి చేశారు. అభి ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్ లో చదువుకున్నారు. ఆయన కుటుంబం ప్రస్తుతం ఢిల్లీలో ఉంటోంది. అభినందన్ పట్టుబడటంపై మాట్లాడటానికి ఆయన తండ్రి నిరాకరించారు. అభినందన్‌ భార్య తన్వి మెర్వా హా రిటైర్డ్ పైలట్. అభినందన్, తన్విలకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Latest Updates