తొలి సేనాధిపతిగా రావత్..నేటితో ఆర్మీ చీఫ్ గా మూడేళ్లు పూర్తి

న్యూఢిల్లీఆర్మీ చీఫ్​ జనరల్​ బిపిన్​ రావత్​కు ప్రభుత్వం కొత్త బాధ్యతలను అప్పగించింది. త్రివిధ దళాల మధ్య సమన్వయంకోసం కొత్తగా ఏర్పాటు చేసిన పదవి.. చీఫ్ ఆఫ్​ డిఫెన్స్ ​స్టాఫ్(సీడీఎస్) సీట్లో ఆయనను కూర్చోబెట్టింది. మూడేళ్ల పాటు ఆర్మీ చీఫ్​ బాధ్యతలు నిర్వహించిన రావత్.. మంగళవారం(ఈ నెల 31) చీఫ్​ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉంది. ఈ క్రమంలోనే కేంద్రం ఈ ప్రకటన విడుదల చేసింది. రావత్​ రిటైర్మెంట్​కూడా దగ్గరపడుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రూల్స్ సవరించింది. త్రివిధ దళాల చీఫ్​ల ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచింది. చీఫ్​ ఆఫ్​ డిఫెన్స్​ స్టాఫ్​ రూపంలో వారి సేవలను వినియోగించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర కేబినెట్​ వెల్లడించింది. చీఫ్​ ఆఫ్​డిఫెన్స్​ స్టాఫ్ ఆధ్వర్యంలో మిలిటరీ అఫైర్స్​ డిపార్ట్​మెంట్​ ఏర్పాటుకు కేబినెట్​ పోయినవారమే అనుమతిచ్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఈ డిపార్ట్​మెంట్​కు బాస్​(సీడీఎస్)గా 4 స్టార్​ జనరల్​ హోదా ఉన్న రిటైర్డ్​ చీఫ్(ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్)ను నియమించాలని రూల్​ పెట్టింది.

సీడీఎస్​ బాధ్యతలు..

♦ ప్రధాని నేతృత్వంలోని న్యూక్లియర్​ కమాండ్​ అథారిటీలో సీడీఎస్​ కూడా సభ్యుడు

♦  త్రివిధ దళాల మధ్య సమన్వయం కుదర్చడం.. వాటి వ్యవహారాలకు సంబంధించి రక్షణ మంత్రికి ప్రిన్సిపల్​ మిలిటరీ అడ్వైజర్(పీఎంఏ)గా వ్యవహరించడం

♦  ఆర్మీ, నేవీ, ఎయిర్​ఫోర్స్​ చీఫ్​లు ముగ్గురూ తమ సర్వీసుకు సంబంధించిన వ్యవహారాల వరకు మాత్రమే రక్షణ మంత్రికి సలహాదారులుగా, మూడింటికీ కలిపి సీడీఎస్​ సలహాదారుగా వ్యవహరిస్తారు

♦  ఆయా సర్వీసుల చీఫ్​లను కాదని వాటి వ్యవహారాలలో సీడీఎస్​ఎలాంటి నిర్ణయం తీసుకునే వీలులేదు

♦  మూడు సర్వీసులకు సంబంధించిన సైబర్, స్పేస్​ సంబంధిత వ్యవహారాలలో సీడీఎస్​దే బాధ్యత

♦  డిఫెన్స్​ అక్విజిషన్​ కౌన్సిల్, డిఫెన్స్​ ప్లానింగ్​ కమిటీలలో సీడీఎస్​ సభ్యుడిగా ఉంటారు

♦  వివిధ ఆపరేషన్లు, నిర్వహణలలో మూడు సర్వీసుల మధ్య సమన్వయానికి కృషి చేస్తారు

♦  త్రివిధ దళాల సేవలను పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా ప్రభుత్వానికి సాయపడతారు

Latest Updates