సర్వే రిపోర్ట్ : మన పిల్లలు మంచిగ లేరు

indian-childrens-health-sarvey-report

ఏ దేశంలో పిల్లల జీవితాలు బాగున్నాయో చెప్పే 176 దేశాల నివేదికలో ఇండియా 113వ స్థానంలో నిలిచింది. పిల్లల హక్కుల కోసం పోరాడుతున్న ‘సేవ్ ది చిల్డ్రన్’ మంగళవారం ‘గ్లోబల్​ చైల్డ్ హుడ్ ఇండెక్స్’ పేరిట ఈ రిపోర్టును రిలీజ్ చేసింది. ఐదేళ్ల లోపు మరణాలు, పోషకాహార లోపం, విద్య, బాలకార్మికులు, బాల్యవివాహాలు, ఎదగకుండానే పుట్టుక, కల్లోలాల వల్ల వలస, పురిట్లోనే బిడ్డలను చంపడం అనే ఎనిమిది కీలక అంశాలను దృష్టిలో పెట్టుకుని దేశంలోని 0–19 ఏళ్ల మధ్య ఉన్న పిల్లల జీవితాల ముఖచిత్రాన్ని తయారు చేసింది. వీటిలో ప్రపంచదేశాలు ఎక్కడున్నాయో టాప్ స్కోరును వెయ్యిగా గుర్తించి, మార్కులు వేసి, ర్యాంకులు విడుదల చేసింది. ఇందులో 2000 నుంచి 2019 మధ్య ఇండియా స్కోరు 632 నుంచి 769కి పెరిగింది. 176 దేశాల్లో 113వ స్థానంలో నిలిచింది.

గతేడాది 172 దేశాల్లో పిల్లల పరిస్థితిని అంచనా వేయగా ఇండియా 116వ స్థానంలో ఉంది. 2000వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా 97 కోట్ల మంది పిల్లలు బాల్యాన్ని కోల్పోగా, 2019 నాటికి ఈ సంఖ్య 69 కోట్ల మందికి పడిపోయింది. చిన్నపిల్లల బాల్యాన్ని మార్చడానికి ఆరోగ్యం, విద్యలో ప్రభుత్వాలు ఇంకా బాగా పెట్టుబడులు పెట్టాలని నివేదిక చెప్పింది. పిల్లలకు ఆర్థిక భద్రత కల్పించడం ప్రభుత్వాల అజెండా కావాలని రిపోర్టు డిమాండ్ చేసింది. అలాగే చిన్నపిల్లల్లో పేదరిక నిర్మూలనకు జాతీయ ప్రణాళికను తేవాలని కోరింది. దీని వల్ల బాల్యం భద్రంగా ఉంటుందని చెప్పింది.

34.8 శాతం మంది పిల్లలు పొట్టిగనే

2000 నుంచి 2019 మధ్య ప్రపంచంలో వయసుకు తగ్గ ఎత్తు ఎదగని పిల్లల సంఖ్య 19.8 కోట్ల నుంచి 14.9 కోట్లకు తగ్గింది. అంటే దాదాపు 25 శాతం తగ్గుదల కనిపించింది. ఈ తగ్గుదలలో అధిక శాతం చైనా, ఇండియాల్లోనే ఉందని రిపోర్టు వెల్లడించింది. ఇండియాలో 34.8 శాతం మంది పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు లేరు. రాష్ట్రాల వారీగా చూస్తే బీహార్​లో అత్యధికంగా 48.3 శాతం మంది పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు లేరని రిపోర్టు వివరించింది. ఆ తర్వాత జార్ఖండ్ 45.3 శాతం, చత్తీస్ గఢ్ 37.6 శాతం, తమిళనాడు 27.1 శాతం, కేరళ 19 శాతంతో ఉన్నాయి. పొరుగు దేశాల్లో పాకిస్థాన్​లో 40.8 శాతం, చైనాలో 6 శాతం, నేపాల్​లో 13.8 శాతం, శ్రీలంకలో 17.3 శాతం, బంగ్లాదేశ్​లో 17.4 శాతం, భూటాన్ లో 19.1 శాతం మంది పిల్లలు వయసుకు తగినంత ఎత్తు ఎదగలేదని నివేదిక పేర్కొంది.

Latest Updates