మన ఎకానమీకి కుదుపు

indian-economy-slowdown-reasons

దేశ ఆర్థిక వ్యవస్థలో పరిణామాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తు న్నాయి. ఈ రంగం, ఆ రంగం అనే తేడా లేకుండా అన్ని రంగాలపై ఆర్థిక మాంద్యం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. పరిస్థితి తీవ్రతను గమనించి కేంద్రం చర్యలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగానే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌
ఆర్‌బీఐ మీద ఒత్తిడి తెచ్చి రెపో రేట్లు తగ్గించేలా  చేశారు. ఇప్పుడు తాజాగా బ్యాంకింగ్‌ రంగానికి 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు. ఈ చర్యల వల్ల ఆర్థిక వ్యవస్థలో నగదు సరఫరా, పెట్టు బడులు పెరిగి ఆర్థిక వ్యవస్థ మందగమనం నుంచి కోలుకుంటుందన్నది ఆర్థిక మంత్రి
ఆలోచన. ప్రస్తు త ఆర్థిక రంగ పరిస్థితి ఇలా ఉంది.. 

ఎటు చూసినా అంతే..

పారిశ్రామికాభివృద్ధి రేటు నాలుగేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. వ్యవసాయ రంగం సంక్షోభంలోనే కొనసాగుతున్నది. ఈ ఏడాది జీడీపీ రేటు ప్రభుత్వం ప్రకటించిన అంచనాల కంటే  తక్కువగా ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య సంస్థ, ఆసియా అభివృద్ధి బ్యాంకు, రేటింగ్‌‌ సంస్థలు  చెబుతున్నాయి. ఎగుమతులు బాగా తగ్గాయి. వివిధ రంగాల్లో పెట్డుబడులు కూడా కొత్తగా రావడం లేదు.  నిరుద్యోగ రేటు 45 ఏండ్ల గరిష్ట స్థాయికి చేరింది. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు  సంక్షోభంలో ఉన్నాయి.  పొదుపు రేటు పడిపోయింది. రూపాయి విలువ రోజు రోజుకు దిగజారుతోంది. ద్రవ్యలోటు పెరిగిపోతున్నది. పన్నుల వసూళ్లు అంచనాలకంటే చాలా తక్కువగా ఉన్నాయి. పెద్దపెద్ద వ్యాపార సంస్థలు కూడా అప్పుల బాధతో సతమతమవుతున్నాయి. సంక్షోభం సీరియస్‌‌నెస్‌‌ను చెప్పేందుకు కేఫ్‌‌ కాఫీ డే సిద్ధార్థ ఆత్మహత్య ఒక ఉదాహరణ. అమెరికా, చైనా మధ్య ట్రేడ్‌‌ వార్‌‌ కూడా పరిస్థితులను ఇంకా దెబ్బతీస్తున్నది.

కోలుకోలేక పోతున్న పారిశ్రామిక రంగం

ఉపాధి, ఉద్యోగ కల్పనలో ముందుండే పారిశ్రామిక రంగ వృద్ధి 2017–-18లో 4.4 శాతం కాగా 2018–-19లో 3.6 శాతానికి తగ్గింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు చేయూత లేక మూతపడుతున్నాయి. జీఎస్టీ అమలు, నోట్ల రద్దు తర్వాత తీవ్ర ఇబ్బందులు పడ్డ  సూక్ష్మ చిన్న తరహా కంపెనీలు ఇప్పటికీ కోలుకోలేదు. 30 శాతం కంపెనీలు మూతపడగా మిగతా కంపెనీలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా 50 శాతానికి పైగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకున్నాయి. పెద్ద కంపెనీలు కూడా మూల ధనం సంపాదించుకోలేక పోతున్నాయి. గత ఏడాది కాలంలో తయారీ రంగంలో డైరెక్ట్‌‌ ఉద్యోగుల్లో సుమారు రెండు లక్షల మంది, ఇన్‌‌డైరెక్ట్‌‌ ఉద్యోగుల్లో సుమారు ఐదు లక్షల మంది జాబ్స్​ కోల్పోయినట్లు గణంకాలు చెపుతున్నాయి. హైదరాబాద్‌‌ను పక్కనబెడితే దేశవ్యాప్తంగా రియల్టీ రంగం కూడా  అమ్మకాలు లేక విలవిలలాడుతోంది. అనేక నగరాల్లో  భారీ ఎత్తున ఇన్వెంటరీ పేరుకుపోయినట్టు చెబుతున్నారు.

టీవీ, ఫ్రిజ్​లు కొనెటోళ్లు లేరు

టీవీ, ఫ్రిజ్‌‌, ఏసీ, వాషింగ్ మిషన్ లాంటి వాటిని కొనడాన్ని ప్రజలు వాయిదా వేసుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఈసారి సేల్స్ 30శాతం పడిపోయాయి. ఆఫర్స్ పెడుతున్నా కూడా షోరూమ్ కి వచ్చేవారే లేరు. ఎల్ఈడీ టీవీల రేట్స్ 35శాతం తగ్గినా కూడా కొనడానికి కస్టమర్స్ ముందుకురావడం లేదు. గతంలో 32 ఇంచెస్ ఎల్ఈడీ టీవీ ధర 31వేలు ఉంటే ఇప్పుడు 21వేలకే దొరుకుతున్నది. అయినా కూడా కస్టమర్స్ ఇటువైపు చూడటం లేదు. షోరూమ్స్ లో ఎంప్లాయీస్ ని తగ్గించుకుంటున్నాం.

– మురళీ, మేనేజర్, సోనోవిజన్

ఆటోమొబైల్‌‌లో భారీగా ఉద్యోగాల కోత

ఆటో మొబైల్‌‌ రంగం గత ఏడాది కాలంగా తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. మారుతీ సుజుకీ,  టాటా మోటర్స్ , ఆశోక్ లీలాండ్,  మహీంద్రా అండ్‌‌ మహీంద్రా, హ్యూందాయ్, టయోటా, బజాజ్‌‌, టీవీఎస్‌‌, హోండా సుజుకీ కంపెనీలు తయారు చేసే అన్ని రకాల వాహనాల సేల్స్‌ గణనీయంగా పడిపోయాయి. కార్ల పరిశ్రమలో గత 19ఏండ్లలో కనీవినీ ఎరుగని మాంద్యం నెలకొంది. పలు కంపెనీలు  ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు యూనిట్లను తాత్కాలికంగా మూసేస్తున్నాయి. గత మూడు నెలల్లో  సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించామని -సొసైటీ ఫర్‌‌ ఇండియన్‌‌ ఆటోమొబైల్‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌-ప్రకటించింది. తీవ్రమవుతున్న ఆర్థిక మాంద్యం కారణంగా సుమారు 10 లక్షల మంది కార్మికులను పనులలో నుంచి తొలగించనున్నామని ఆటోమొబైల్స్‌‌ అనుబంధ పరిశ్రమల నిర్వాహకులు ఇంతకు ముందే హెచ్చరించారు. వాహనాల అమ్మకాలు తగ్గిపోవటంతో 300 షోరూంలను మూసివేయాల్సి వచ్చిందని, దీని వల్ల రెండు లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని సియాం వెల్లడించింది.

స్టాక్ మార్కెట్ల పతనం

స్టాక్‌‌ మార్కెట్‌‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నది. నెల రోజుల్లో బాంబే స్టాక్‌‌ ఎక్సేంజ్‌‌లో మదుపర్ల సంపద సుమారు రూ. 15 లక్షల కోట్లు తుడిచి పెట్టుకుపోయింది. విదేశీ మదుపర్లు కూడా జులైలోనే రూ. 16 వేల కోట్లను ఉపసంహరించుకున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇన్వెస్టర్లు చాలా నష్టపోయారు. లక్షల కోట్ల రూపాయల మేర మార్కెట్లో ఇరుక్కుపోయాయి.

రిటైల్ రంగం వెలవెల

ప్రపంచంలో  రెండో అతి పెద్ద రిటైల్ మార్కెట్ గా ఉన్న మన దేశం లో గ్లోబల్ కంపెనీలన్నీ  ఇప్పుడు బేజారైతున్నాయి. టీ, కాఫీ, బిస్కెట్​, టూత్ పేస్టు, సబ్బులు లాంటి  వస్తువులపై  మాంద్యం ప్రభావం మొదలైన విషయాన్ని ఎఫ్ఎంసీజీ కంపెనీలు చెప్తున్నాయి. హిందుస్తాన్ యూనిలీవర్, బ్రిటానియా, దాబర్, పీ అండ్ జీ లాంటి కంపెనీలు  ఉత్పత్తుల తయారీని నియంత్రిస్తున్నాయి. బిస్కెట్ తయారీ రంగంలో లీడింగ్ కంపెనీ అయిన పార్లే తాజాగా 10 వేల మంది ఉద్యోగులును తొలగిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితి చక్కబడకపోతే మరికొంత మంది ఉద్యోగులుకు ఉద్వాసన తప్పదని పార్లె ప్రకటించింది. ఇదే బాటలో మరికొన్ని ఎఫ్‌‌ఎంసీజీ కంపెనీలు ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంటున్నాయి. రిటైల్ రంగానికి ఎదురవుతున్న అతి పెద్ద సవాలు.. వినియోగదారుల్లో కొనుగోలు శక్తి తగ్గిపోవడమే. దీని ప్రభావం ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ,  కన్జూమర్ డ్యూరబుల్​ రంగంపై పడింది.  వైట్ గూడ్స్ గా పిలిచే  ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీలు, బ్రౌన్ గూడ్స్ గా పిలిచే  టెలివిజన్లు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్​ల సేల్స్ తగ్గినట్లు కంపెనీల అధికారిక డీలర్లు చెప్తున్నారు. ఖర్చుల నియంత్రణలో భాగంగా కంపెనీలు సొంత ఔట్ లెట్లను మూసేస్తున్నాయి. దీంతో ఇందులో పనిచేసే ఉద్యోగులు రోడ్డున పడుతున్నారు.

మన దగ్గర ప్రభావం లేదు

దేశవ్యాప్తంగా నిర్మాణ రంగంపై ఆర్థిక మాంద్యం ఎఫెక్ట్ పడినా హైదరాబాద్ లో మాత్రం అంతగా లేదు. మిగతా సిటీస్ తో పోలిస్తే ఇక్కడ రేట్స్ తక్కువగా ఉండటంతో ఇంకా సేల్స్ బాగానే ఉన్నాయి. అయితే ఎకానమీ స్లోడౌన్ ప్రభావం ఇక్కడ కూడా ఉండే అవకాశాలున్నాయి కాబట్టి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే డెవలపర్లు మాత్రం ఆలోచిస్తున్నారు. ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల అమ్మకాలపై దృష్టి పెడుతున్నారు.

– రామ్ రెడ్డి, ప్రెసిడెంట్, క్రెడాయి తెలంగాణ

ఆటోమొబైల్ సేల్స్ అంతంతే

గతంలో ఒక్కో షోరూమ్​లో నెలకు 150 నుంచి 180 కార్లు అమ్ముడుపోగా ప్రస్తుతం వంద కార్లు దాటడమే కష్టంగా ఉంది. కార్లకు ఫైనాన్స్ ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా లేవు. ఎలక్ట్రానిక్ వెహికిల్స్, బీఎస్ 6 ప్రమాణాలు గల వాహనాలు మార్కెట్లోకి వచ్చాక కొందామనే ధోరణిలో జనాలున్నారు. మా  సంస్థలో 3వేల మంది ఎంప్లాయీస్ ఉండగా కాస్ట్ కటింగ్ లో భాగంగా 500 మందిని తీసేస్తున్నాం.. స్టాక్ పెరిగిపోతుండటంతో షోరూమ్స్ నిర్వాహణ భారంగా మారింది.

– కంభంపాటి రామ్మోహన్ రావు, సీఎండీ, లక్ష్మీ హ్యూందాయ్

 

Latest Updates