ప‌క్కా ప్లాన్‌తోనే డ్రాగ‌న్ ఆర్మీ దాడి.. చైనాకు భార‌త్ స్ట్రాంగ్ మెసేజ్

భార‌త్ – చైనా స‌రిహ‌ద్దుల్లో లడఖ్‌లోని గాల్వన్‌ లోయ వ‌ద్ద ఇరు దేశాల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ అనుకోకుండా జ‌రిగింది కాద‌ని, చైనా ఆర్మీ ముంద‌స్తుగా ప‌క్కా ప్లాన్‌తోనే భార‌త జ‌వాన్ల‌పై దాడికి దిగింద‌ని భార‌త విదేశాంగ శాఖ మంత్రి జై శంక‌ర్ అన్నారు. దీనికి చైనా బాధ్య‌త వ‌హించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. తక్ష‌ణం చైనా త‌న త‌ప్పుడు చ‌ర్య‌ల‌ను స‌రిదిద్దుకోవాల‌ని హెచ్చ‌రించారు. స‌రిహ‌ద్దుల్లో సోమ‌వారం రాత్రి ఇరు దేశాల సైనికుల మ‌ధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణలు జ‌రిగ‌డంపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు బుధ‌వారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌కు స్ట్రాంగ్ మెసేజ్‌ను ఇచ్చారు జై శంక‌ర్. చైనా సైనికులు ముందస్తు ప్రణాళికతోనే దాడి చేసి, 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవ‌డానికి కార‌ణ‌మ‌య్యార‌ని చెప్పారు.

లడఖ్‌లో చోటుచేసుకున్న అసాధారణ ఘటనతో ఇరు దేశాల దౌత్య సంబంధాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని జైశంకర్‌ హెచ్చరించారు. ఈ ఘటన ఇరు దేశాల దౌత్య ఒప్పందాలపైనా ప్ర‌భావం చూపుతుంద‌ని చెప్పారు. సరిహద్దుల్లో పరిస్థితిని చైనా పునఃసమీక్షించుకుని వాస్తవాధీన రేఖను గౌరవించాలని అన్నారు. ఏకపక్ష చర్యలకు పాల్పడరాదని చైనాకు తేల్చిచెప్పారు.జూన్ 6 జ‌రిగిన సైనికాధికారుల సమావేశంలో కుదిరిన అవగాహన మేరకు ఇరు దేశాల సేనల ఉపసంహరణపై అంగీకారం కుదిరిందని. కానీ దాన్ని ఉల్లంఘిస్తూ చైనా బ‌ల‌గాలు మ‌ళ్లీ గాల్వ‌న్ లోయ ప్రాంతంలోకి వ‌చ్చార‌ని అన్నారు. ఉద్రిక్తతలను తగ్గించి సరిహద్దుల్లో శాంతియుత వాతావరణం నెలకొనేలా వ్యవహరించాలని సూచించారు భార‌త విదేశాంగ మంత్రి జై శంక‌ర్. చైనా త‌న చ‌ర్య‌ల‌ను పునః స‌మీక్షించుకోవాల‌ని, వాస్త‌వాధీన రేఖ వెంట మే నెల‌కు పూర్వం ఉన్న స్థితిని పున‌రుద్ధ‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు. కాగా, చైనా మంత్రి మాత్రం గాల్వ‌న్ ప్రాంతం చైనా భూభాగమేనంటూ త‌మ క‌ప‌ట మాట‌ల‌ను వ‌ల్లెవేశారు. భార‌త్ త‌న స‌రిహ‌ద్దు బ‌ల‌గాల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టుకోవాల‌ని, ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ సూచించారు. త‌మ త‌ప్పేలేదంటూ బుకాయిస్తూ, మ‌న సైనికుల‌నే త‌ప్పుబ‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు.

Latest Updates