మన కుర్రోళ్లు అప్పు వద్దంటున్రు

18-24 వయసున్న వాళ్లలో అప్పులు తీసుకుంటోంది 6% మాత్రమే

 అప్పులు తీసుకునేది  టూవీలర్‌‌‌‌, స్మార్ట్‌‌ ఫోన్లు కొనడానికే

 మనోళ్ల కంటే  కొలంబియా,  సౌత్‌‌ ఆఫ్రికా కుర్రోళ్లే అప్పుల్లో చురుగ్గా ఉన్నారు

ముంబై: దేశంలో 24 ఏళ్ల వయసు లోపున్న  కుర్రాళ్లలో  కేవలం ఆరు శాతం మంది మాత్రమే అప్పులు తీసుకుంటున్నారని  ఓ నివేదిక వెల్లడించింది. అప్పులు తీసుకునే కుర్రాళ్లు  టూవీలర్స్‌‌ లేదా స్మార్ట్‌‌ ఫోన్ల కోసమే వాటిని తీసుకుంటున్నట్లు పేర్కొంది.  క్రెడిట్‌‌ కార్టులు తీసుకునే కుర్రోళ్ల సంఖ్యా ఈ ఆరు శాతంలోనే ఉంటోందని తెలిపింది. జనరేషన్‌‌ జెడ్‌‌ గ్రూప్‌‌(ఏడేళ్ల నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న ఏజ్‌‌ గ్రూప్‌‌) వాళ్లకు అప్పులివ్వడం రిస్క్‌‌ అనే ఆలోచనకు వ్యతిరేకంగా సిబిల్‌‌ నివేదికిచ్చింది. ఈ జనరేషన్‌‌లో చాలా మందికి మంచి రిస్క్‌‌ ప్రొఫైల్‌‌ ఉందని తెలిపింది.  రిటైల్‌‌ సెగ్మెంట్‌‌లో ఎక్కువగా అప్పులివ్వాలని ఫైనాన్షియల్ సంస్థలు చూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులలో ఈ రిపోర్ట్‌‌ వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.  ఇండియాలో మొత్తం 14.70 కోట్ల మంది వయసు 18–24 ఏళ్ల మధ్య ఉండగా, ఇందులో కేవలం 90 లక్షల మంది లేదా ఆరు శాతం మాత్రమే అప్పులు తీసుకుంటున్నారని  సిబిల్‌‌ నివేదిక పేర్కొంది. ఈ రేటు కొలంబియా(19 శాతం), సౌత్‌‌ ఆఫ్రికా(28 శాతం) వంటి ఇతర ఎమర్జింగ్ దేశాల కంటే ఇండియాలో తక్కువగా ఉంది.   జెనరేషన్‌‌ జెడ్‌‌ గ్రూప్‌‌లో  క్రెడిట్‌‌ యాక్టివ్‌‌గా ఉన్న వాళ్లు కెనడాలో 63 శాతంగా ఉన్నారని, అదే అమెరికాలో 66 శాతంగా ఉన్నారని సిబిల్‌‌ తెలిపింది.

ఇండియాలో  ఫుడ్‌‌ డెలివరీ జాబ్స్‌‌ వంటి గిగ్‌‌ ఎకానకమీ జాబ్స్‌‌ పెరుగుతుండడంతో టూ వీలర్‌‌‌‌ కోసం తీసుకునే అప్పులు పెరుగుతున్నాయని ఈ నివేదిక సిబిల్‌‌ తెలిపింది. దీని తర్వాత స్మార్ట్‌‌ఫోన్స్‌‌ వంటి కన్స్యూమర్‌‌ డ్యూరబుల్స్‌‌ ప్రొడక్ట్స్‌‌, ఇలాంటి కొనుగోళ్ల కోసమే   క్రెడిట్‌‌ కార్డులు తీసుకుంటున్నారని  ట్రాన్స్‌‌ యూనియన్‌‌ సిబిల్ ఈ రిపోర్టులో పేర్కొంది.  అప్పులు చేసైనా పర్సనల్‌‌ కంప్యూటర్లు లేదా ల్యాప్‌‌టాప్‌‌లు, టీవీలను కొనడానికి జెనరేషన్‌‌ జెడ్‌‌ గ్రూప్‌‌ కుర్రాళ్లు  అప్పులకు ఇష్టపడుతున్నారని పేర్కొంది.  కానీ, ఈ వయసు కంటే ఎక్కువున్న వాళ్లు మాత్రం  రిఫ్రిజిరేటర్లు లేదా వాషింగ్‌‌ మెషిన్లను కొనుగోలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపింది.  ఎక్కువగా వాడే వస్తువులను కొనేయడానికి కొత్తగా అప్పులు తీసుకునే వాళ్ల సంఖ్య  పెరుగుతోందని సిబిల్‌‌ వివరించింది. పాజిటివ్‌‌ క్రెడిట్ రీపేమెంట్‌‌కు సంబంధించి లాంగ్‌‌ హిస్టరీ జెనరేషన్‌‌  జెడ్‌‌ గ్రూప్‌‌ వాళ్లకు ఉండకపోవడం వల్లే,  వీరికి అప్పులివ్వడం ఫైనాన్షియల్‌‌ సంస్థలు రిస్క్‌‌గా భావిస్తున్నాయని తెలిపింది. కానీ జెనరేషన్‌‌ జెడ్‌‌లో ఎక్కువ మందికి మంచి క్రెడిట్‌‌ రిస్క్‌‌ ప్రొఫైల్‌‌ ఉంటోందని పేర్కొంది.

Latest Updates