కరోనాపై పోరుకు రైల్వే శాఖ రెడీ

  • 2.5 వేల మంది డాక్టర్లు, 35 వేల మంది పారామెడికల్ సిబ్బంది
  • 5 వేల కోచ్​లలో 80 వేల ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు

న్యూ ఢిల్లీ: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు రైల్వే శాఖ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. కరోనా కట్టడిని మరింత బలోపేతం చేసేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పెద్ద సంఖ్యలో డాక్టర్లను, హెల్త్ సిబ్బందిని కేటాయిస్తోంది. 2,500 మంది డాక్టర్లు, 35,000 మంది పారా మెడికల్ సిబ్బందిని కరోనా పేషెంట్లకు సేవలందించేందుకు కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. దేశవ్యాప్తంగా రైల్వేలో 586 హెల్త్ సెంటర్లు, 45 సబ్ డివిజనల్ హాస్పిటల్స్, 56 డివిజనల్ ఆస్పత్రులు, 8 ప్రొడక్షన్ యూనిట్ దవాఖానాలు, 16 జోనల్ హాస్పిటల్స్ విస్తరించి ఉన్నాయని, వాటన్నింటిలోని బెడ్స్ ను కరోనా పేషెంట్ల కోసం వాడుకోవాలని నిర్ణయించినట్లు తెలిపింది. వీటన్నింటిలో కరోనాపై ఫైట్ చేసేందుకు సెంటర్లను ఏర్పాటు చేస్తామని చెప్పింది.
నర్సులు, ఫార్మసిస్టులు, ఇతర సిబ్బందితో సహా మొత్తం 2,546 మంది డాక్టర్లు, 35,153 మంది పారామెడిక్ స్టాఫ్ తో కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి రైల్వే శాఖ రెడీగా ఉందని అధికారులు తెలిపారు. తాజాగా వీరి కేటాయింపుతో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

బోగీలే ఆస్పత్రులు.. 80 వేల ఐసోలేషన్ బెడ్స్

ఇప్పటికే 3,250 బోగీలను ఆస్పత్రులుగా మార్చిన రైల్వే.. కొద్ది రోజుల్లో 5000 కోచ్ లను 80,000 ఐసోలేషన్ బెడ్స్ గా మార్చనుంది. అందుకు జోనల్ రైల్వేస్ యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించాయి. కోచ్​లలో 11,000 క్వారంటైన్ బెడ్స్ రెడీ అయ్యాయి. వీటితో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 17 రైల్వే ఆస్పత్రులు, 33 హాస్పిటల బ్లాక్స్ లో కరోనా పేషెంట్ల కోసం 5000 పడకలు కేటాయించారు. పీపీఈలు, వెంటిలేటర్లు, శానిటైజర్లు, మాస్కులు తయారీపై రైల్వే ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. రోజుకు 1000 పీపీఈలను సిద్ధం చేసే కెపాసిటీ ఉండగా.. దానిని మరింత పెంచేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. గుర్తుంపు కార్డును చూపించి రైల్వే ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందవచ్చు.

Latest Updates