ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై ప్రభుత్వం వివక్ష

  • ఉన్నత కులపోళ్లనే అపాయింట్ చేస్తున్నరు
  • గవర్నర్ కు భారతీయ సామాజిక న్యాయ సమితి ఫిర్యాదు

వెలుగు, హైదరాబాద్:

తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై తీవ్ర  వివక్ష చూపిస్తోందని భారతీయ సామాజిక న్యాయ సమితి రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. పోస్టింగ్ లు, ప్రమోషన్లలో ఇది కొనసాగుతోందని సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న సమాచారంతో తెలిసిందని తెలిపారు.

‘గడిచిన ఐదేళ్లలో తెలంగాణ ప్రభుత్వం వివిధ  డిపార్ట్ మెంట్లలో రిటైర్డ్ ఉద్యోగులను రీ అపాయింట్ చేసుకున్నది. అందులో ఉన్నత సామాజిక వర్గాలకు చెందిన వారికే అవకాశం ఇచ్చారు. అర్హులైన  ఎస్సీ, ఎస్టీ  సామాజిక వర్గాలకు చెందినవారికి అవకాశం ఇవ్వడం లేదు. ఇలా చేయడం వల్ల ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన ఉన్నతస్థాయి అధికారులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.  ప్రభుత్వం రీ అపాయింట్ చేసుకున్న ఉన్నత సామాజికవర్గాల వారికంటే ఎస్సీ, ఎస్టీ  సామాజిక వర్గాలకు చెందినవారు అన్ని రకాలుగా అర్హులు. కుల వివక్ష కారణంగా వారి గురించి పట్టించుకోవడం లేదు. ఉన్నత సామాజిక వర్గాలకు చెందినవారిని ఈఎన్సీలుగా, ఓఎస్డీలుగా ఇతర ప్రభుత్వ విభాగాల హెచ్ ఓడీలుగా కొనసాగిస్తున్నారు. ఇట్లా రీ అపాయింట్ అయినవారికి వేతనాలతో పాటు రిటైర్డ్ అయిన తర్వాత అందే అన్ని రకాల ప్రయోజనాలు ఇస్తున్నారు.

ఒక్క మిషన్ భగీరథలోనే 15 మంది వరకు ఇలాంటివారు ఉన్నారు. కేవలం ఈ ఒక్క విభాగంలోనే  వీరందరికి యేటా సుమారు రూ. నాలుగు కోట్లు చెల్లిస్తున్నారు. ఇలా 2014  నుంచి 2018 వరకు 375 మంది ఉన్నతాధికారులను వారి పాత పోస్టుల్లోనే కొసాగిస్తున్నారు. ఇందులో  హెల్త్,  జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇరిగేషన్, మిషన్ భగీరథ, హోం డిపార్ట్ మెంట్,  ఆర్ అండ్ బి, వాటర్ వర్క్స్,  మైనర్ ఇరిగేషన్,  ఐఆండ్ పీఆర్,  రెవెన్యూ, ఎస్సీ, బీసీ, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్ మెంట్లు ఉన్నాయి. ఐదేళ్ల నుంచి ఆయా డిపార్ట్ మెంట్ల ఉన్నత స్థానాల్లో కొత్త  అధికారుల నియామకం చేపట్టలేదు.  సర్వీసులో ఉన్నవారికి ప్రమోషన్ లేదు. ఆ స్థానాలు కొత్తవారితో నింపితే వందలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలూ వస్తాయి. ఇవేవీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ తీరుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి. దీనిపై తగు విధంగా స్పందించి చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలి’ అంటూ ఫిర్యాదు పత్రంలో పేర్కొన్నారు.

రాజకీయ రంగాలతోపాటు,  ప్రభుత్వ రంగంలోనూ ఇలా కొనసాగడం దారుణమని భారతీయ సామాజిక న్యాయ సమితి జాతీయ అధ్యక్షులు కోదాటి శ్యాంసుందర్ ఆవేదన వ్యక్తం చేశారు. రీ అపాయింట్, ప్రమోషన్లలో  జరుగుతున్న  అన్యాయంపై చట్టపరంగా పోరాడతామని అన్నారు.

Indian Social Justice Council Complaint to Governor on TS Govt.

Latest Updates