అమెరికాలో కాల్పులు.. భారత విద్యార్థి మృతి

అమెరికాలో భారతీయులపై కాల్పుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఎంఎస్ చేయడంకోసం అమెరికా వెళ్లిన మైసూర్ యువకుడు గుర్తు తెలియని వ్యక్తి చేసిన కాల్పుల్లో మృతి చెందాడు. మైసూర్‌కు చెందిన 25 ఏళ్ల అభిషేక్ చంద్ 2016లో బీటెక్ పూర్తి చేశాడు. ఎంఎస్ చేయాలనే కోరికతో 18 నెలల క్రితం కాలిఫోర్నియాలోని స్టేట్ యూనివర్సిటీలో చేరాడు. అక్కడ చదువుతూనే ఓ హోటల్లో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. అందులో భాగంగా గురువారం అభిషేక్ హోటల్లో ఉండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆర్డర్ సప్లై విషయంలో దుండగుడికి, అభిషేక్‌కి మధ్య గొడవ జరిగింది. దాంతో కోపొద్రిక్తుడైన దుండగుడు తుపాకీతో అభిషేక్‌పై కాల్పులు జరిపాడు. ఆ ఘటనలో అభిషేక్ అక్కడికక్కడే చనిపోయాడు. అభిషేక్ మృతి వార్తను మైసూర్‌లోని అతని తల్లిదండ్రులకు యూనివర్సిటికి చెందిన అధికారులు ఫోన్ చేసి తెలిపారు. అభిషేక్ తండ్రి సుదేష్ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహాను కలిసి కొడుకు మృతదేహాన్ని వీలైనంత తొందరగా భారత్‌కి రప్పించాలని కోరారు. అమెరికాలోని ఇండియన్ ఎంబసీ అధికారులతో మాట్లాడి.. మృతదేహం తొందరగా వచ్చేలా చూస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.

Latest Updates