కరోనా ఎఫెక్ట్: టికెట్లు బుక్​ చేసుకున్నాక విమానం ఎక్కనివ్వలేదు

 ఎయిరిండియా అధికారులదీ అదే మాట

టికెట్లు బుక్​ చేసుకున్నాక విమానం ఎక్కనివ్వని అధికారులు

200 మంది దాకా ఇటలీ ఎయిర్​పోర్టులోనే.. తెలుగు, తమిళోళ్లే ఎక్కువ

ఇండియాకు వచ్చేద్దామని టికెట్లు బుక్​ చేసుకున్నారు. లేట్​ చెయ్యకుండా ఎయిర్​పోర్టుకు వచ్చారు. కానీ, అక్కడే వాళ్ల పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. విమానం ఎక్కాలంటే కరోనా నెగెటివ్​ సర్టిఫికెట్​ కావాల్సిందేనంటూ ఇటు ఎయిర్​పోర్టు అధికారులు, అటు ఎయిరిండియా అధికారులు తేల్చి చెప్పారు. అప్పటికే ఆ దేశం మొత్తం బంద్​ అయిపోయింది. ఇండియాకు రాలేక, వెనక్కు పోలేక విమానాశ్రయంలోనే అరెస్ట్​ అయిపోయారు. ఇదీ ఇటలీలో చిక్కుకుపోయిన ఇండియన్​ స్టూడెంట్లు ఎదుర్కొంటున్న పరిస్థితి. దాదాపు 200 మంది స్లూడెంట్లు మిలాన్​ ఎయిర్​పోర్టులో చిక్కుబడిపోయారు. లాక్​డౌన్​ కారణంగా ట్రాన్స్​పోర్ట్​ సౌకర్యం లేకపోవడంతో ఇండియన్​ ఎంబసీ అధికారులు ఏదైనా మంచి వార్త చెబుతారేమోనని అక్కడే ఎదురు చూస్తున్నారు. కానీ, ట్రావెల్​తో పాటే ఫుడ్​కోర్టులూ మూతపడడంతో తినడానికి సరైన తిండి లేక ఇబ్బందులు పడుతున్నామని వంశీ అనే తెలుగు స్టూడెంట్​ వాపోయాడు. ఇటలీలో చదువుతున్న వాళ్లలో ఎక్కువగా తెలుగు, తమిళ స్టూడెంట్లే ఉన్నారని చెబుతున్నారు. కొవిడ్​ రెడ్​ జోన్​లో ఉన్న పడోవా, పావియా, రిమ్మి, మోదెనా, మిలాన్​ వంటి సిటీల్లోనే ఎక్కువ మంది స్టూడెంట్లు ఉన్నారంటున్నారు.

ముందు ఇన్ఫర్మేషన్​ ఇయ్యలె

చైనా తర్వాత కొవిడ్​ ప్రభావం ఎక్కువగా ఉన్న దేశం ఇటలీనే. అందుకే వైరస్​ కట్టడిలో భాగంగా దేశం మొత్తాన్ని మూసేసింది. అనుమతి లేకుండా బయటకు పోతే జైలుకు పంపుతామనీ హెచ్చరించింది. కాలేజీలు, యూనివర్సిటీలూ మూతపడ్డాయి. చాలా మంది స్టూడెంట్లు ఇళ్లకే పరిమితమైపోయారు. కారణం లేకుండా బయటకు పోతే పోలీసులు అరెస్ట్​ చేసి జైలుకు పంపుతున్నట్టు ఓల్డ్​ సిటీకి చెందిన అబ్రార్​ హుస్సేన్​ అనే స్టూడెంట్​ చెప్పాడు. కొందరు స్టూడెంట్లు పోలీసుల అనుమతి తీసుకుని ఇండియాకు వచ్చేందుకు విమాన టికెట్లు బుక్​ చేసుకున్నారు. విడతల వారీగా ప్రయాణానికి సిద్ధమయ్యారు. కానీ, ఎయిర్​పోర్టుకు చేరుకున్న తర్వాత సర్టిఫికెట్​ పేరిట వాళ్లను అడ్డుకున్నారు. దీనిపై తమకు ముందస్తు సమాచారమే ఇవ్వలేదని, ఉన్నపళంగా కావాలంటే ఎక్కడి నుంచి తేవాలని స్టూడెంట్లు వాపోతున్నారు. దీనిపై రోమ్​లోని ఇండియన్​ ఎంబసీ అధికారులతో మాట్లాడితే సరిగ్గా స్పందించలేదని ఆరోపించారు. ముందు ప్రయాణానికి ఏర్పాట్లు చేస్తామన్న అధికారులు, తర్వాత మాట మార్చారన్నారు. బస చేసేందుకు వసతి కల్పిస్తామని చెప్పి, తర్వాత అధికారులు కనిపించకుండా పోయారన్నారు. తమను వెంటనే ఇండియాకు తిరిగి తీసుకొచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. దేశంలో మాస్కుల కొరత కూడా ఎక్కువగా ఉందని సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జెల్లా బద్రీనాథ్​ అనే స్టూడెంట్​ చెప్పారు. సూపర్​మార్కెట్లలోకి కనీసం ఎంటర్​ కానివ్వట్లేదన్నాడు. తనతో పాటు మరో 30 మంది దాకా చిక్కుబడినట్టు యూనివర్సిటీ ఆఫ్​ బొలోనాలో చదువుతున్న అతడు చెప్పాడు. కొవిడ్​ లక్షణాలు లేకపోతే హాస్పిటళ్లు ఫిట్​నెస్​ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదన్నాడు.

తిరిగొచ్చినోళ్లూ.. జర జాగ్రత్త

కొవిడ్​ ప్రభావిత దేశాల నుంచి తిరిగొచ్చినోళ్లు 14 రోజుల పాటు ఇళ్లలోనే ఉంటే మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. ఫిబ్రవరి 29 తర్వాత ఇటలీ నుంచి వచ్చిన వాళ్లంతా ఎవరినీ కలవొద్దని చెబుతున్నారు. సెపరేట్​ రూంలోనే ఉండాలంటున్నారు. వాళ్లు వాడే బట్టలు, టవళ్లు వంటి వాటిని కుటుంబ సభ్యులెవరూ ముట్టుకోవద్దని చెబుతున్నారు. గదిలోని అటాచ్డ్​ బాత్రూంనే వాడుకోవాలని సూచిస్తున్నారు. ఒకవేళ ఒకటే ఉంటే, మిగతా వాళ్లూ వాడిన తర్వాతే బాత్రూంను వాడుకోవాలని చెబుతున్నారు. తర్వాత బాత్రూంను సోడియం హైపోక్లోరేట్​తో గానీ, లేదా మరేదైనా డిసిన్​ఫెక్టెంట్​తో గానీ శుభ్రం చేయాలంటున్నారు. కొవిడ్​ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వాళ్లు వాడే సబ్బులు, షాంపూలను ఎవరూ వాడొద్దని చెప్పారు. వాళ్లకు ఫుడ్డు పెట్టిన ప్లేట్లనూ శుభ్రంగా కడగాలని, ఫుడ్​ వేస్టేజ్​ను వేరే బ్యాగులో వేయాలని సూచించారు. దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలుంటే వెంటనే దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి వెళ్లాలని చెప్పారు. ఏదైనా సాయం కోసం కంట్రోల్​ రూం నంబర్​ 040–24651119, హెల్ప్​ లైన్​ నంబర్​ 104కు ఫోన్​ చేయాలని సూచించారు. ఆస్పత్రికి రావాల్సి వస్తే 108 అంబులెన్స్​ సేవలను వాడుకోవాలంటున్నారు.

ఏపీలో తొలి కరోనా కేసు?

అమరావతి, వెలుగు: ఇటలీలో ఎంఎస్ చదువుతున్న నెల్లూరుకు చెందిన స్టూడెంట్‌కు ప్రైమరీ టెస్టుల్లో కరోనా సోకినట్లు తేలిందని డాక్టర్లు బుధవారం తెలిపారు. రీ కన్‌ఫర్మేషన్‌ కోసం పుణె శాంపుల్స్‌ పంపించారు వాటి రిజల్ట్‌ వచ్చాకా ఏ విషయం అధికారికంగా వెల్లడించనున్నారు. స్టూడెంట్ ఇటలీ నుంచి వచ్చేటప్పుడు ఢిల్లీ ఎయిర్ పోర్టులో పరిశీలించగా కరోనా లక్షణాలు కన్పించడంతో డాక్టర్లు స్క్రీనింగ్ చేసి పంపారు. 14 రోజుల కిందట నెల్లూరు వచ్చిన అతడికి దగ్గు, జలుబు, జ్వరం ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. బ్లడ్ శాంపిల్స్ తీసుకున్న డాక్టర్లు తిరుపతి రుయా ఆస్పత్రికి పంపించారు. మొదటి దశ పరీక్షల్లోనే కరోనా నిర్ధారణ కావడంతో రెండో దశ పరీక్షల కోసం స్టూడెంట్ శాంపిల్స్ ను పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించారు.

Latest Updates