దిగులుతో చావుకు దగ్గరైపోతున్నరు

ఎవుసం కలిసిరాక.. మగ్గంతో ముందుకెళ్లలేక.. అప్పుల పాలై.. చివరికి గుండెను రాయిగా చేసుకుని, పెళ్లాం బిడ్డలను వదిలిపెట్టి భారంగా గల్ఫ్​బాట పట్టినోళ్లు కొందరు. దుబాయి, ఖతర్, సౌదీలాంటి సంపన్న దేశాలల్ల కొన్నేండ్లు పని చేస్తే చాలు.. బాగా వెనకేసుకోవచ్చని ఆశపడి వెళ్లినోళ్లు మరికొందరు. కారణం ఏదైనా.. గల్ఫ్​కొలువులు కలిసొస్తున్నది మాత్రం కొంతమందికే! అక్కడికి వెళుతున్న మనోళ్లలో చాలామంది చివరికి తిండికి కూడా కరువై, దిగులుతో చావుకు దగ్గరైపోతున్నరు. ఆరు గల్ఫ్​దేశాల్లో ప్రతిరోజూ15 మంది ఇండియన్లు చనిపోతున్నారని కేంద్ర ప్రభుత్వ అధికారిక లెక్కలే చెబుతున్నాయి.

గల్ఫ్​ వెళుతున్న మనోళ్లలో చాలా మందిని ఏజెంట్లు మోసం చేస్తున్నారు. ఇక్కడ చెప్పేదొకటి.. అక్కడ ఇచ్చే పని మరొకటి. చెప్పే జీతానికి, ఇచ్చేదానికి పొంతన ఉండదు. చట్టపరంగా రక్షణ కూడా ఉండదు. ఇన్ని కష్టాల మధ్య ఎంతో మంది వలస పోయినోళ్లు అక్కడ ఉండలేక, ఇక్కడికి ఉట్టి చేతులతో రాలేక విలవిల్లాడుతున్నారు. దీంతో దిగులుతో ఆరోగ్యం దెబ్బతిని చావు అంచులకు చేరుతున్నరు. ఇలా 2014 నుంచి 2019 వరకు ఐదేండ్లలో కువైట్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతర్, ఒమన్, యూఏఈ దేశాల్లో మొత్తం 33,988 మంది ఇండియన్లు చనిపోయారట. ఈ ఏడాది ఇప్పటిదాకా 4,823 మంది మృతిచెందారట. టీపీసీసీ చీఫ్, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లోక్ సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ ఈ వివరాలను గురువారం వెల్లడించారు. గల్ఫ్​లో సౌదీ, యూఏఈల్లోనే ఎక్కువ మంది ఇండియన్లు చనిపోతున్నారని ఆయన తెలిపారు.

మనోళ్ల లెక్కలు సరిగ్గ లేవు..

ఐదేండ్లలో తెలంగాణకు చెందినోళ్లు1200 మం ది గల్ఫ్​ దేశాల్లో చనిపోయారని, గల్ఫ్​మరణాలు ఎక్కువగా జరుగుతున్న రాష్ట్రాల్లో మనది కూడా ఒకటని రాష్ట్ర ఎన్ఆర్ఐ వింగ్ అధికారి ఇ.చిట్టిబాబు తెలిపారు. గల్ఫ్​లో చనిపోయిన తెలంగాణ వాసుల మృతదేహాలను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వారి సొంత ఊళ్లకు తరలించేందుకు అంబులెన్స్ సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని, ఇప్పటివరకూ 850 కుటుంబాలు ఈ సౌకర్యం వినియోగించుకున్నాయని చెప్పారు. ఈ ఫ్రీ అంబులెన్స్ సౌకర్యం వాడుకున్న వాళ్ల వివరాలను మాత్రమే ఎన్ఆర్ఐ వింగ్ రికార్డ్ చేస్తోందని, మిగతా మరణాలు నమోదు కావడం లేదన్నారు.

గల్ఫ్​ఎన్ఆర్ఐల నుంచి15,051 కంప్లయింట్లు

పోయిన నెల నాటికి గల్ఫ్​ఎన్ఆర్ఐల నుంచి15,051 కంప్లయింట్లు వచ్చాయని కేంద్ర మంత్రి తన సమాధానంలో తెలిపారు. వీటిలో ఎక్కువ కంప్లయింట్లు ఉద్యోగం విషయంలో ఏజెంట్లు మోసం చేశారని వచ్చాయని పేర్కొన్నారు. జీతాలు ఇవ్వకుండా, చట్టప్రకారం హక్కులు, కనీస సౌకర్యాలు కల్పించకుండా, రెసిడెన్స్ పర్మిట్స్ రెన్యువల్ చేయకుండా, ఓటీలు ఇవ్వకుండా, ఎక్కువ గంటలు పని చేయించుకుంటూ, సెలవులు ఇవ్వకుండా వేధిస్తున్నారంటూ ఎక్కువ మంది ఇండియన్లు ఫిర్యాదు చేశారన్నారు. ఇండియాకు వచ్చి పోయేందుకు ఎగ్జిట్/రీ ఎంట్రీ పర్మిట్లు ఇస్తలేరని, కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చేందుకు ఫైనల్ ఎగ్జిట్ వీసాకు కూడా ఎంప్లాయర్లు అంగీకరించకుండా సతాయిస్తున్నట్లు కూడా కంప్లయింట్లు వచ్చాయని మంత్రి తెలిపారు. రోగమొస్తే హాస్పిటల్ కు వెళ్లే అవకాశం కూడా ఇవ్వడం లేదని, ఇన్సూరెన్స్ వంటివి అసలే ఉండవని, చివరికి డ్యూటీలో చనిపోయినా, ఎలాంటి పరిహారం అందడం లేదని పేర్కొన్నారు. ‘‘గల్ఫ్​వెళ్లాలనుకునే వాళ్లను వర్క్ వీసా పేరుతో ఫేక్ ఏజెంట్లు మోసం చేస్తున్నారు. అప్పులు, ఒత్తిడితో కుంగిపోవడం, కఠినమైన పరిస్థితుల్లో పని చేయాల్సి రావడం వంటి కారణాల వల్ల చాలా మంది ఆరోగ్యం దెబ్బతింటోంది” అని తెలంగాణ గల్ఫ్​ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి.బసంత్ రెడ్డి తెలిపారు.

 

Latest Updates