శత్రు దేశాలకు వణుకు పుట్టించే పవర్​ఫుల్ మిసైల్ రెడీ

మన ‘బాలిస్టిక్ మిసైల్ షీల్డ్’ రెడీ
శత్రు క్షిపణులు ఎలా వచ్చినా మధ్యలోనే పేల్చేస్తది
20 ఏండ్లు శ్రమించి సిద్ధం చేసిన ఎయిర్ ఫోర్స్, డీఆర్డీవో 
పీఎం ఓకే అంటే ఢిల్లీ చుట్టూ న్యూక్లియర్ మిసైళ్ల నుంచి రక్షణ

ఇండియాకు యుద్ధమంటూ వస్తే.. అది పాకిస్తాన్ లేదా చైనాతోనే అయి ఉంటుంది. రెండు దేశాల వద్దా బాలిస్టిక్ క్షిపణులు, అణ్వాయుధాలు ఉన్నాయి. చైనా అయితే బాలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ వెపన్స్ విషయంలో మన కంటే ఎంతో పవర్ ఫుల్ గా ఉంది. ఒకవేళ యుద్ధం వస్తే.. ఆ దేశాలు ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాలపైకి అణుబాంబులను ప్రయోగిస్తే.. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? అందుకే.. మన సిటీలపైకి దూసుకొచ్చే బాలిస్టిక్ మిసైల్స్ ను ఆకాశంలోనే పేల్చివేసే పవర్​ఫుల్ బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) సిస్టంను ఎయిర్ ఫోర్స్, డీఆర్డీవో రెడీ చేశాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు జరిగిన అనేక రీసెర్చ్ లు, టెస్టుల తర్వాత ఇప్పుడు మన బాలిస్టిక్ రక్షణ కవచం సిద్ధమైందని చెప్తున్నారు. అయితే ఈ సిస్టంను మోహరించడానికి ప్రధాన మంత్రి నుంచి అనుమతి రావాల్సి ఉందని, ఆ వెంటనే రాడార్లు, మిసైళ్ల మోహరింపు షురూ అవుతుందని అంటున్నారు.

రీసెర్చ్, టెస్టులకే 20 ఏండ్లు..

ఇండియా1974లోనే తొలి న్యూక్లియర్ టెస్ట్ చేసింది. ఆ తర్వాత 1998లో రెండోసారి పోఖ్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించింది. దీంతో పాకిస్తాన్ కూడా1999లో తన తొలి న్యూక్లియర్ టెస్ట్ ను నిర్వహించింది. మరోవైపు చైనా అప్పటికే న్యూక్లియర్ వెపన్స్ విషయంలో ఎంతో ముందంజలో ఉంది. ఈ నేపథ్యంలో ఇండియాకు న్యూక్లియర్ బాంబుల ముప్పు పొంచి ఉందని ఆలోచించిన మన దేశం 1999లోనే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాంను ప్రారంభించింది. ఈ ప్రోగ్రాం బాధ్యతలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్, డీఆర్డీవో సంయుక్తంగా చేపట్టాయి. మిసైల్ షీల్డ్ లో భాగంగా రాడార్లు, అగ్ని క్షిపణులను తయారు చేసి, అనేకసార్లు పరీక్షలు జరిపిన తర్వాత వాటిని ఓకే చేశాయి. అలాగే రష్యా నుంచి ‘ఎస్–400 ట్రయంఫ్’ మిసైల్ సిస్టంను కూడా ఇందులో చేర్చాయి. గత ఏడాది మార్చిలో యాంటీ శాటిలైట్ (ఏ–శాట్) మిసైల్ టెస్ట్ విజయవంతంగా పూర్తవడంతో బీఎండీ చివరి దశకు చేరినట్లయింది. చైనా వద్ద ఉన్న పవర్​ఫుల్ డాంగ్ ఫెంగ్ సిరీస్ తరహా బాలిస్టిక్ మిసైళ్లను ఏ–శాట్ సమర్థంగా అడ్డుకోగలదని ఈ టెస్టులో తేలింది. దీంతో మన బాలిస్టిక్ షీల్డ్ పూర్తిస్థాయిలో సిద్ధమైందని, ఇక క్షిపణులు, రాడార్లను మోహరించడమే మిగిలిందని రక్షణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

బాలిస్టిక్ షీల్డ్.. ఢిల్లీకి మాత్రమేనా?  

దేశ రాజధాని ఢిల్లీని శత్రు క్షిపణుల నుంచి రక్షించుకునేందుకు మాత్రమే బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ ప్రోగ్రాంను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిందని చెప్తున్నారు. దశలవారీగా ముంబై, హైదరాబాద్, చెన్నై, కోల్కతా వంటి నగరాలకూ దీనిని విస్తరిస్తారని అంటున్నా, అధికారికంగా దీనిపై ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. అయితే, ఢిల్లీకి బాలిస్టిక్ షీల్డ్ ను ఇన్ స్టాల్ చేసేందుకు ప్రధాని కార్యాలయం నుంచి అనుమతి వచ్చాక కనీసం మూడు నుంచి నాలుగేళ్ల సమయం పడుతుందని చెప్తున్నారు.

బీఎండీ ఎలా పనిచేస్తది?

బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టం రెండు లెవెల్స్ లో శత్రు క్షిపణులను ధ్వంసం చేస్తుంది. ఒకటోది ఎండో అట్మాస్పెరిక్ లెవల్ (భూమి వాతావరణం లోపల పని చేసేది), రెండోది ఎక్సో అట్మాస్పెరిక్ (భూమి వాతావరణం బయట పని చేసేది). అంటే.. బీఎండీ ఫేజ్ వన్​లోని మిసైళ్లు.. వాతావరణం లోపలే దూసుకువచ్చే శత్రు క్షిపణులను ఆకాశంలోనే పేల్చేస్తాయి. ఫేజ్ టూలోని మిసైళ్లు వాతావరణం బయట అంతరిక్షంలోంచి దూసుకొస్తున్న శత్రు మిసైళ్లను అక్కడే పీల్చేస్తాయి. ఇక ఈ సిస్టంలోని పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ 80 కిలోమీటర్ల లోపు ఎత్తులో వచ్చే క్షిపణులను అడ్డుకుంటుంది. అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ 15 నుంచి 25 కిలోమీటర్ల లోపు ఎత్తులో వచ్చే మిసైళ్లను అడ్డుకుంటుంది. రష్యా నుంచి కొనుగోలు చేసిన ఎస్–400 ట్రయంఫ్​సిస్టం కూడా బీఎండీలో భాగంగా ఉండి, ఢిల్లీ గగనతలానికి పూర్తిస్థాయిలో క్షిపణి రక్షణ కవచంగా పని చేస్తాయి.

Latest Updates