డిజిటల్‌‌ పేమెంట్స్‌‌లో వెనుకబాటే

  • పేమెంట్‌‌ యాప్స్‌‌ వాడకంలో దూసుకెళ్తున్న చైనా
  • మనదేశంలో పేమెంట్‌‌ యాప్స్‌‌ మధ్య పోటాపోటీ

న్యూఢిల్లీ: సాధారణ కరెన్సీని వాడటానికి బదులు అన్ని లావాదేవీలకూ ఆన్‌‌లైన్‌‌లోనే డబ్బు చెల్లించేలా ప్రజలను మోడీ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. నల్లధనాన్ని నియంత్రించడానికి ఆన్‌‌లైన్‌‌ పేమెంట్స్‌‌ ఉపయోగపడతాయని నమ్ముతోంది. ఇందుకోసమే 2016లో పెద్దనోట్లను రద్దు చేసింది. డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ విషయంలో చైనాను మించిపోవాలనే లక్ష్యంతో పనిచేస్తోంది. స్మార్ట్‌‌ఫోన్‌‌ వినియోగం పెరగడం, చౌకగా హైస్పీడ్‌‌ ఇంటర్నెట్‌‌ అందుబాటులోకి రావడంతో చాలా మంది డిజిటల్‌‌ పేమెంట్‌‌ యాప్స్‌‌ వాడుతున్నారు. అందుకే మనదేశంలో పేమెంట్‌‌ యాప్స్‌‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.

డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ వ్యాపారంలోని అపార అవకాశాలను ఉపయోగించుకోవడానికి వాట్సప్‌‌, గూగుల్‌‌, అమెజాన్‌‌ వంటి పెద్ద కంపెనీలు పేమెంట్‌‌ యాప్స్‌‌ ప్రారంభించాయి. ఇంతజరుగుతున్నా మనదేశంలో డిజిటల్‌‌ పేమెంట్స్‌‌ సేవల వాడకం తక్కువగానే ఉందని ఆర్‌‌బీఐ డేటా చెబుతోంది. ఇప్పటికీ మన జనాభాలో ఎనిమిది శాతం మందే ఆన్‌‌లైన్‌‌లో లావాదేవీలు చేస్తున్నారు. చైనా దాదాపు 70 శాతం లావాదేవీలు ఆన్‌‌లైన్‌‌లో జరుగుతున్నాయి. అక్కడ రెండు కంపెనీలే డిజిటల్‌‌ పేమెంట్స్ విభాగంలో దూసుకెళ్తుండగా, ఇక్కడ మాత్రం 87 పేమెంట్‌‌ యాప్స్‌‌ మార్కెట్‌‌ను సొమ్ము చేసుకోవడానికి విపరీతంగా శ్రమిస్తున్నాయి. దీంతో వీటి మధ్య తీవ్రమైన పోటీ ఉంది. యూజర్‌‌ తనకు నచ్చిన యాప్‌‌ను ఉపయోగించుకోవడానికి వీలుగా అతడికి ఎన్నో ప్రత్యామ్నాయాలు మనదేశంలో అందుబాటులో ఉన్నాయని నేషనల్‌‌ పేమెంట్స్ కార్పొరేషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (ఎన్‌‌పీసీఐ) సీఈఓ దిలీప్‌‌ అస్బే అన్నారు.

చైనాలా కాకుండా మనదేశంలో చిన్న, పెద్ద సంస్థలన్నింటికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. చైనాలో ఆంట్‌‌ ఫైనాన్షియల్‌‌కు చెందిన అలీపే, టెన్సెంట్‌‌ హోల్డింగ్స్‌‌ నిర్వహించే వీచాట్‌‌ పే యాప్స్‌‌నే అందరూ వాడుతున్నారు. ఈ రెండింటి వల్ల ఆ దేశంలో నగదు వాడకం బాగా తగ్గింది.  ఈ విషయంలో మనం త్వరలోనే చైనాను అధిగమిస్తామని దిలీప్‌‌ అన్నారు. ఎన్‌‌సీపీఐ అందించే యూపీఐ ఆధారిత చెల్లింపు విధానాన్ని ఏ పేమెంట్‌‌ యాప్‌‌ అయినా సులువుగా ఉపయోగించుకోవచ్చు. యూపీఐ ద్వారా ఏ యాప్‌‌లో అయినా బ్యాంకుఖాతాను లింక్‌‌ చేసుకొని, ఉచితంగా డబ్బు పంపించవచ్చు.

ఇప్పటికీ 72 శాతం మంది…

గూగుల్‌‌, పేటీఎం వంటి పెద్ద కంపెనీలతోపాటు ఎన్నో థర్డ్‌‌పార్టీలు యూపీఐ పేమెంట్స్‌‌ యాప్స్‌‌ ద్వారా సేవలు అందిస్తున్నా, మనదేశంలో ఇప్పటికీ 72 శాతం లావాదేవీలకు నగదునే వాడుతున్నారు. చైనాతో పోలిస్తే ఇది రెట్టింపని క్రెడిస్‌‌ స్విస్‌‌ తెలిపింది. నెట్‌‌వర్క్‌‌ సమస్యల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది పేమెంట్‌‌ యాప్స్‌‌ను అంగీకరించడం లేదు. తాను డబ్బు ఖర్చు చేయాల్సిన 80 శాతం ప్రదేశాల్లో డిజిటల్‌‌ పేమెంట్‌‌ను తీసుకోవడం లేదని, ఇక పేమెంట్‌‌ యాప్స్‌‌ను ఎలా నమ్ముకోవాలని హిటాచీ పేమెంట్‌‌ సర్వీసెస్‌‌ లిమిటెడ్‌‌ డిజిటల్‌‌ బిజినెస్‌‌ సీఈఓ నవ్‌‌తేజ్‌‌ సింగ్‌‌ ప్రశ్నించారు. అయితే 2015 నుంచి ఇప్పటి వరకు మనదేశంలో డిజిటల్‌‌ పేమెంట్స్ ఐదురెట్లు పెరిగాయి. అయినప్పటికీ మనం చైనాతో పోలిస్తే వెనుకబడే ఉన్నామని నివేదికలు చెబుతున్నాయి. అందుకే రాబోయే ఐదేళ్లలో యూపీఐ వినియోగాన్ని ఐదురెట్లు పెంచడానికి ఎన్‌‌పీసీఐ ప్లాన్లు వేసింది. పేమెంట్‌‌ యాప్స్‌‌ను వాడేలా ప్రజలకు అవగాహన కల్పిస్తామని, వసతులు పెంచుతామని వివరించారు.

Latest Updates