ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ జరుగుతుంది

క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో కెవిన్ రాబర్ట్స్
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఆగిపోయిన క్రీడా కార్యకలాపాలు మెళ్లిగా ఊపందుకుంటున్నాయి. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ స్టేడియాల్లో ప్రాక్టీస్ సెషన్స్ చేసుకోవచ్చని ప్రభుత్వం చెప్పడంతో ఆ దిశగా స్పోర్ట్స్ అసోసియేషన్స్ ముందడుగు వేస్తున్నాయి. దీనిపై స్టేట్ క్రికెట్ అసోసియేషన్స్ కు బీసీసీఐ కొన్ని సూచనలు చేసింది. అయితే మళ్లీ ప్రొఫెషనల్ క్రికెట్ ఎప్పుడు మొదలవుతుందనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ నేపథ్యంలో ఇండియా–ఆస్ట్రేలియా మధ్య కంగారూ గడ్డపై జరగాల్సిన 4 టెస్ట్ ల సిరీస్ గురించి క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కెవిన్ రాబర్ట్స్ స్పందించారు. ఇండియా–ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్ జరిగే అవకాశం ఉందని రాబర్ట్స్ చెప్పారు. పదికి తొమ్మిది శాతం ఈ సిరీస్ జరిగే అవకాశాలు ఉన్నాయని ఆయన నమ్మకంగా చెప్పారు.

‘నేటి ప్రపంచంలో నిశ్చయంగా ఇదే జరుగుతుందని చెప్పలేం. కానీ 10కి 9 శాతం ఇండియా–ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ జరగొచ్చు. ఒకవేళ ఈ టూర్ జరగకపోతే నేను ఆశ్చర్యానికి గురవుతా. స్టేడియాలకు ప్రేక్షకులు వస్తారా లేదనేది ఎవరు ఊహించగలరు?. ఇదెలా ఉంటుందనేది వేచి చూడాల్సిందే’ అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆస్ట్రేలియాలోనే జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చే ఏడాదికి టీ20 ప్రపంచకప్ షిఫ్ట్ అయ్యే చాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇండియా వేదికగా 2022లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే.

Latest Updates