61 శాతం దాటిన క‌రోనా రిక‌వ‌రీ రేటు

దేశంలో క‌రోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య‌ క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా రిక‌వ‌రీ రేటు 61.13 శాతానికి చేరింద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్ల‌డించింది. గ‌డిచిన 24 గంట‌ల్లో 15,,515 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యార‌ని తెలిపింది. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 7,19,665 మంది క‌రోనా బారిన‌ప‌డ‌గా.. దాదాపు 4 ల‌క్ష‌ల 40 వేల మంది ఈ మ‌హ‌మ్మారిని జ‌యించారని పేర్కొంది. ప‌స్తుతం దేశ వ్యాప్తంగా 2,59,557 మంది క‌రోనాతో బాధ‌ప‌డుతూ చికిత్స పొందుతున్నారని చెప్పింది. ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్న వారి క‌న్నా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,80,390 మంది అధికంగా ఉందని తెలిపింది.

ఆస్ప‌త్రులు, టెస్టింగ్ కెపాసిటీ పెంపు

దేశంలో క‌రోనా చికిత్స కోసం భారీగా వ‌సతులు పెంచిన‌ట్లు వెల్ల‌డించింది కేంద్రం. ఇప్ప‌టి వ‌ర‌కు 1201 కోవిడ్ హాస్పిట‌ల్స్, 2611 కోవిడ్ హెల్త్ కేర్ సెంట‌ర్లు, 9909 కోవిడ్ కేర్ సెంట‌ర్లను కేవ‌లం క‌రోనాతో బాధ‌ప‌డుతున్న వారికి చికిత్స అందించేందుకు అందుబాటులోకి తెచ్చిన‌ట్లు పేర్కొంది. మ‌రోవైపు వైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు టెస్టింగ్ సామ‌ర్థ్యాన్ని కూడా పెంచామ‌ని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ‌. గ‌డిచిన 24 గంట‌ల్లో 1,115 ల్యాబ్‌ల ద్వారా 2 ల‌క్ష‌ల 40 వేల మందికి పైగా టెస్టులు చేసిన‌ట్లు వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు దేశ వ్యాప్తంగా కోటి 2 ల‌క్ష‌ల‌కు పైగా శాంపిల్స్ ప‌రీక్షించిన‌ట్లు తెలిపింది.

Latest Updates