యూపీలో 3,800 ఏళ్ల నాటి శ్మశానం

ఒకటి కాదు, రెండు కాదు.. పెద్ద పెద్దవి126 సమాధులు. అన్నీ దాదాపుగా ఒకేలా ఉన్నాయి. ప్రతి సమాధిలోనూ నాలుగు కాళ్లతో చేసిన చెక్క శవపేటికలు. వాటిలో అస్థిపంజరాలు. ప్రతి శవపేటిక పక్కన కత్తి, డాలు, కుండలో బియ్యం, మట్టి గిన్నెలు, పాత్రలు, రాగి, రాతి వస్తువులు, వాటిపై బొమ్మలు. రథాలు కూడా ఉన్నాయి. అంత్యక్రియలు చేసిన తీరును చూస్తే వేదకాలం నాటి కల్చర్ స్పష్టంగా తెలిసిపోతోంది. ఇంతకూ ఈ సమాధులు ఎవరివి? ఏ కాలం నాటివి? 2005లో యూపీలోని సనౌలీలో బయటపడిన ఈ సమాధుల మిస్టరీ ఎట్టకేలకు వీడిపోయింది. దేశంలోనే అతిపెద్దదైన ఈ ప్రాచీన శ్మశానవాటిక 3,800 ఏళ్ల నాటిదని కార్బన్​ డేటింగ్​ ద్వారా రీసెర్చర్లు తేల్చేశారు.

దేశీ యుద్ధవీరుల సమాధులు..

దేశ రాజధాని ఢిల్లీకి జస్ట్ 68 కిలోమీటర్ల దూరంలోనే, యూపీలోని బాగ్పట్ జిల్లాలో ఉంది సనౌలీ. ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్​ ఇండియా (ఏఎస్ఐ) జాయింట్ డైరెక్టర్ ఎస్.కె. మంజుల్ ఆధ్వర్యంలో 2005లో తవ్వకాలు ప్రారంభించారు. ఫొటోగ్రామ్ మెట్రీ, గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సర్వే, డ్రోన్లు, మాగ్నెటోమీటర్లనూ తవ్వకాల సందర్భంగా ఉపయోగించారు. 2006 నాటికి 116 సమాధులు బయటపడ్డాయి. గత రెండేళ్లలో మరో 10 సమాధులు వెలుగు చూశాయి. అన్ని సమాధులనూ భూమిలో ప్రత్యేకంగా తవ్విన చాంబర్లలోనే ఏర్పాటు చేశారు. ఓ శవపేటికపై మాత్రం ఆ నాటి కల్చర్​ను సూచించే బొమ్మలు చాలానే ఉన్నాయి. అలాగే కత్తులు, డాళ్లు, ఇంకా ఎన్నో వస్తువులు ఇక్కడ దొరికాయి. ఓ చిన్న కాడి, దానికి ఒక పొడవాటి కట్టె, దానికి ఇరుసు, చక్రాలతో కూడిన మూడు రథాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. రథాలను రాగి, చెక్కను ఉపయోగించి తయారు చేశారు. అయితే, హిస్టరీలో ప్రత్యేకమైనవిగా కన్పిస్తున్న ఈ సమాధులు ఏ కాలం నాటివన్నది మాత్రం ఒకపట్టాన అంతుచిక్కలేదు. దీంతో కార్బన్ డేటింగ్ ద్వారా ఈ సమాధుల కాలాన్ని తేల్చే పనిని లక్నోలోని బీర్బల్ సాహ్నీ ఇనిస్టిట్యూట్ ఆఫ్​పేలియోసైన్సెస్ మొదలుపెట్టింది.

3,815 నుంచి 3,500 ఏళ్ల మధ్యనాటివి..

కార్బన్ డేటింగ్ ద్వారా సనౌలీ సమాధుల కాలాన్ని సాహ్నీ ఇనిస్టిట్యూట్ ఇటీవల కన్ఫమ్ చేసింది. ఈ మేరకు ఏఎస్ఐకి సమగ్ర నివేదికను అందించింది. ఇక్కడి సమాధులు3,815 నుంచి 3,500 ఏళ్ల మధ్యకాలం నాటివని తేల్చింది. 130 ఏళ్లు అటూ ఇటూగా ఇదేకాలం కన్ఫమ్ అని నివేదికలో స్పష్టం చేసింది. భారత ఉపఖండంలో గిరిజన యుద్ధవీరుల ఆనవాళ్లను తెలియజేసే అతిపురాతన సమాధులు ఇవేనని కూడా ఇనిస్టిట్యూట్ తెలిపింది. సమాధుల్లో దొరికిన అస్థిపంజరాలకు పుణేలోని డెక్కన్ కాలేజ్, హైదరాబాద్​లోని ల్యాబ్, సాహ్నీ ఇనిస్టిట్యూట్ డీఎన్ఏ టెస్టులు చేశాయి.

వేదిక్ కల్చర్ తో పోలికలు..

సమాధుల్లో బయటపడిన దుస్తులు, అలంకరణల ఆనవాళ్లు, శవాన్ని పూడ్చేటప్పుడు శుద్ధి చేసిన విధానాన్ని చూస్తే వేదకాలం నాటి అంత్యక్రియ పద్దతులను అనుసరించారని తెలుస్తోందని రీసెర్చర్లు తెలిపారు. ఇక్కడివారికి అప్పట్లో గంగా యమున, సింధులోయ నాగరికతల వారి పద్ధతులతో పరిచయం ఉన్నట్లుగా ఉందని ప్రముఖ హిస్టారియన్ బీఆర్ మణి పేర్కొంటున్నారు.

Latest Updates