జీడీపీ 5 శాతం మించదు..IHS మార్కిట్ స్టడీస్

న్యూఢిల్లీజీడీపీ గ్రోత్‌‌ రేటు పడిపోతూనే ఉంది. గత కొన్ని క్వార్టర్లుగా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ 2019–-20 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇండియా రియల్ జీడీపీ గ్రోత్ రేటు 5 శాతం కంటే కాస్త తక్కువగానే ఉండనుందని ఐహెచ్‌‌ఎస్ మార్కిట్ స్టడీ రిపోర్టు అంచనావేసింది. నెమ్మదిస్తున్న ఆర్థిక వ్యవస్థను కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుంది. ఈ ఉద్దీపన చర్యలు ఎకానమీపై ప్రభావం చూపేందుకు కాస్త టైమ్‌‌ పడుతుందని ఐహెచ్‌‌ఎస్ మార్కిట్ పేర్కొంది.  తాజాగా విడుదలైన జూలై–సెప్టెంబర్ క్వార్టర్‌‌ డేటా ప్రకారం, ఇండియన్ జీడీపీ గ్రోత్ రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయి 4.5 శాతంగా నమోదైంది. ఎకానమీకి అత్యంత ముఖ్యమైన మానుఫ్యాక్చరింగ్ ఔట్‌‌పుట్ పడిపోవడంతో గ్రోత్‌‌ నెమ్మదించింది. 2019–20 ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లోనూ జీడీపీ గ్రోత్ రేటు 4.8 శాతానికి పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఈ గ్రోత్ రేటు 7.5 శాతంగా ఉంది.  ఫైనాన్స్ సెక్టార్  బలహీనంగా ఉండటంతో ఇండియా ఎకనామిక్ గ్రోత్‌‌ కూడా అంతంతమాత్రంగానే ఉంది. కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్‌‌ల బ్యాలెన్స్ షీట్లలో మొండిబకాయిలు పెరిగిపోయాయని, ఇవి కొత్తగా అప్పులివ్వడానికి ఆటంకంగా మారినట్టు ఐహెచ్‌‌ఎస్ తన రిపోర్ట్‌‌లో వివరించింది.

పలుమార్లు ఆర్‌‌‌‌బీఐ వడ్డీరేట్లకు కోత…

ఆర్థిక వ్యవస్థ బలహీనమవుతుండటంతో, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాదిలో పలు సార్లు వడ్డీరేట్లను తగ్గించింది. ఫిబ్రవరి నుంచి పలుమార్లు వడ్డీరేట్లకు కోత పెట్టింది. ఇన్వెస్ట్‌‌మెంట్లను పెంచడానికి సెప్టెంబర్‌‌‌‌లో కార్పొరేట్ ట్యాక్స్ రేట్లను కూడా పెద్ద మొత్తంలో తగ్గించింది. ఆర్‌‌‌‌బీఐ కూడా ఈ నెల 5న విడుదల చేసిన మానిటరీ పాలసీ ప్రకటనలో జీడీపీ గ్రోత్ అంచనాలను 2019–20లో 6.1 శాతం నుంచి 5 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.  మానుఫ్యాక్చరింగ్ అవుట్‌‌పుట్‌‌ను పెంచడానికి, ఇన్వెస్ట్‌‌మెంట్ సైకిల్‌‌ దూసుకుపోయేలా చేయడానికి ప్రభుత్వం మరిన్ని ఆర్థిక చర్యలు ప్రకటించాలని కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. వాటిల్లో రోడ్లు, రైల్వేలు, పోర్ట్‌‌లు వంటి ఇన్‌‌ఫ్రా ప్రాజెక్ట్‌‌ల్లో ఇన్వెస్ట్‌‌మెంట్లు, అఫర్డబుల్ హౌసింగ్, హాస్పిటల్స్‌‌ వంటివి ఉన్నాయి. ఆటో మానుఫ్యాక్చరింగ్ సెక్టార్ చాలా కష్టంల్లో ఉందని, సెప్టెంబర్‌‌‌‌లో దీని అవుట్‌‌పుట్ 24.8 శాతం తగ్గినట్టు ఐహెచ్‌‌ఎస్ మార్కిట్ తెలిపింది. ఈ సెక్టార్‌‌‌‌లో నెలకొన్న సంక్షోభంతో, ప్రొడక్షన్ తగ్గిపోయి వేలాది ఉద్యోగాలు పోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.

Latest Updates