మరో అంబారీపై ముఖేష్ అంబానీ

ముంబై : ఇండియా సంపన్నుడు ముఖేష్ అంబానీ ఇప్పుడు ప్రపంచంలోనే ఏడో పెద్ద కుబేరుడిగా మారారు. అంతేకాదు, వారెన్‌‌ బఫెట్‌‌, గూగుల్‌‌ కో ఫౌండర్లు లారీ పేజ్‌‌, సెర్జీ బ్రిన్‌‌లను సంపదలో దాటేశారు. ప్రపంచంలోని టాప్‌‌ 10 సంపన్నుల జాబితాలో ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తిగా నిలిచారు 63 ఏళ్ల ముకేశ్‌‌ అంబానీ. ఫోర్బ్స్‌‌ రియల్‌‌ టైమ్‌‌ బిలియనీర్స్‌‌ లిస్ట్‌‌ ప్రకారం, ఈయన సంపద ప్రస్తుతం 69.9 బిలియన్‌‌ డాలర్లకు చేరింది. ఇండియాలోనే అత్యంత విలువైన కంపెనీగా పేరొందిన రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ (ఆర్‌‌ఐఎల్‌‌)ను ముఖేష్‌‌ అంబానీనే నడుపుతున్నారు. ప్రపంచమంతటా కరోనా వైరస్‌‌తో సతమతమవుతుంటే, అలవోకగా పెట్టుబడి డీల్స్‌‌ కుదుర్చుకుని జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లోకి పెద్ద పెద్ద ఇన్వెస్టర్లను తెచ్చారు. జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లోకి రూ. 1.17 లక్షల కోట్ల పెట్టుబడులను తేవడంతోపాటు, ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూడని విధంగా రూ. 53 వేల కోట్లను రైట్స్‌‌ ఇష్యూ ద్వారా ఆర్‌‌ఐఎల్‌‌లోకి తీసుకొచ్చారు. దీంతో మార్చి 2021 నాటికి అప్పుల్లేని కంపెనీగా రిలయన్స్‌‌ను మార్చాలని పెట్టుకున్న టార్గెట్‌‌ చాలా ముందుగానే నెరవేర్చినట్లైంది.

ఆయిల్‌‌ నుంచి టెలికం దాకా కార్యకలాపాలున్న రిలయన్స్‌‌ షేర్లు మార్చి నాటి కనిష్టం నుంచి రెట్టింపయ్యాయి. ఇదే టైములో, కరోనా వైరస్‌‌తో చాలా వ్యాపారాలు దెబ్బతినడమే కాకుండా, అనేక కంపెనీల షేర్లు నేలచూపులు చూశాయి. ఒకప్పుడు ప్రపంచ టాప్‌‌ కుబేరుడిగా నిలిచిన వారెన్ బఫెట్‌‌కు 2020 కేలండర్‌‌ ఇయర్‌‌ కలిసి రాలేదు. అమెరికా స్టాక్‌‌ మార్కెట్లు 40 శాతం ర్యాలీ చేసినా, బఫెట్‌‌ తన సంపదను భారీగా పోగొట్టుకోవడం విశేషం. బెర్క్‌‌షైర్‌‌ హ్యాథవే ఛైర్మన్‌‌ అయిన బఫెట్‌‌ ఈ ఏడాది తన సంపదలో 28.7 బిలియన్‌‌ డాలర్లు పోగొట్టుకున్నారు. దీంతో టాప్‌‌ కుబేరుల్లో 8 ప్లేస్‌‌కు దిగిపోయారు. 2000 నుంచి చూస్తే ఇంత తక్కువ ప్లేస్‌‌ను బఫెట్ పొందడం ఇదే మొదటిసారి. వారెన్‌‌ బఫెట్‌‌ కంపెనీ బెర్క్‌‌షైర్‌‌ హ్యాథవే ఈ ఏడాది తొలి క్వార్టర్లో దాదాపు 50 బిలియన్‌‌ డాలర్ల నష్టం పొందింది. బఫెట్‌‌ సంపద కరిగిపోవడానికి ఆయన దాతృత్వం కూడా ఒక కారణమే. బెర్క్‌‌షైర్‌‌ హ్యాథవేలో తనకున్న క్లాస్‌‌ బి షేర్లలో 2.9 బిలియన్‌‌ డాలర్ల విలువైన షేర్లను ఆయన ఈ వారంలో దానం చేసేశారు. దాంతో గత 14 ఏళ్లలో బఫెట్‌‌ దానం చేసిన మొత్తం 37 బిలియన్‌‌ డాలర్లకు చేరింది.

రిలయన్స్‌‌ @ 11.90 లక్షల కోట్లు

శుక్రవారం సెషన్లో రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ లిమిటెడ్‌‌ షేరు 3 శాతం ఎగియడంతో కంపెనీ మార్కెట్‌‌ క్యాపిటలైజేషన్‌‌ రూ. 34,195 కోట్లు పెరిగింది. బీఎస్‌‌ఈలో రిలయన్స్‌‌ షేరు 2.95 శాతం లాభపడటంతో రూ. 1,878.50 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో ఈ షేరు 3.27 శాతం పెరిగినప్పుడు, రికార్డు హై రూ. 1,884.40 ని తాకింది. ఎన్‌‌ఎస్‌‌ఈలోనూ 2.94 శాతం లాభంతో రూ. 1,878.05 వద్ద ముగిసింది. దీంతో మార్కెట్‌‌ వాల్యూ రూ. 34,195 కోట్లు పెరిగి రూ. 11,90,857 కోట్లకు చేరింది. వాల్యూమ్‌‌ పరంగా చూస్తే బీఎస్‌‌ఈలో 11.40 లక్షల షేర్లు, ఎన్‌‌ఎస్‌‌ఈలో 2 కోట్ల షేర్లు చేతులు మారాయి. బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌‌, ఎన్‌‌ఎస్‌‌ఈ నిఫ్టీలలో ఆర్‌‌ఐఎల్‌‌ షేరు భారీగా లాభపడింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం

Latest Updates