రాత్రంతా విమానంలోనే… నరకం చూపించిన ఎయిర్ లైన్స్

విమాన ప్రయాణాల్లో ఏదైనా సమస్య వస్తే ఎయిర్ లైన్స్ సంస్థలు ప్యాసింజర్లకు సమాచారం ఇచ్చి.. వాళ్లకు హోటళ్లలో బస ఏర్పాటు చేస్తాయి. విమానం రెడీ కాగానే గమ్యానికి చేరుస్తాయి. చౌకధరలకు విమాన సేవలు అందించే ఇండిగో ఎయిర్ లైన్స్ మాత్రం ప్యాసింజర్లకు నరకం చూపించింది. కనీసం భోజనం ఏర్పాట్లు కూడా చేయకుండా రాత్రంతా విమానంలోనే గడిపేలా చేసింది. ముంబయి ఎయిర్ పోర్టులో బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు డీజీసీఏ అధికారులు చెప్పారు. బుధవారం ముంబయిలో భారీ వర్షాల కారణంగా 20 విమానాలు రద్దు చేశారు. వీటిలో ఇండిగో ఎయిర్ లైన్స్ విమానాలే ఎక్కువగా ఉన్నాయి.

ముంబయి నుంచి జైపూర్ వెళ్లే  ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం ఎయిర్ పోర్టులోనే నిలిచిపోయింది. ప్యాసింజర్లు విమానంలోనే ఉండాలని ఇండిగో ఎయిర్ లైన్స్ సూచించింది. వారికి ఎలాంటి వసతులు కల్పించలేదు. “బుధవారం రాత్రి 7.55 గంటలకు  జైపూర్ వెళ్లేందుకు ఇండిగో ఫ్లైట్  టేకాఫ్ కావాల్సి ఉంది. గురువారం ఉదయం 6 గంటలకు టేకాఫ్ అయ్యింది. ఉదయం 8 గంటలకు జైపూర్ చేరుకున్నాం. రాత్రంతా విమానంలోనే గడపాల్సి వచ్చింది. డిన్నర్ కూడా పెట్టలేదు”  అని ప్యాసింజర్ ఒకరు మీడియాతో చెప్పారు.

Latest Updates