4వేల శాతం పెరిగిన ఇండిగో లాభం

ఇండిగో బ్రాండ్‌‌ పేరిట విమానాలను నడిపే ఇంటర్‌‌ గ్లోబ్ ఏవియేషన్‌‌ (ఐజీఏ) క్యూ1లో అంచనాలను అందుకుంది. వార్షికంగా లాభాన్ని 43 రెట్లు పెంచుకొని విశ్లేషకులను ఆశ్చర్యపర్చింది. ఈ ఏడాది జూన్‌‌తో ముగిసిన తొలి క్వార్టర్‌‌లో రూ.1,209 కోట్ల లాభం సాధించింది. గత క్యూ1లో ఇది రూ.27 కోట్ల లాభం ప్రకటించింది. ఐజీఏ లాభాలు రూ.700 కోట్లు మించకపోవచ్చన్న విశ్లేషకుల అంచనాలు తప్పాయి. ఇప్పటి వరకు కంపెనీ సాధించిన అత్యధిక లాభం ఇదేనని సీఈఓ రొణొజొయ్‌‌ దత్తా ప్రకటించారు. ‘‘ప్రయాణికులు, సరుకు రవాణా భారీగా పెరగడం వల్ల ఆదాయమూ బాగా వచ్చింది. ఈ ఫలితాలు మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి. మార్జిన్‌‌ సామర్థ్యాన్ని విస్తరించుకుంటూనే వేగంగా ఎదిగే సత్తా ఇండిగోకు ఉందని ఈ ఫలితాలు నిరూపించాయి’’ అని ఆయన అన్నారు.

ఎంసీఏకు వివరణ ఇస్తాం

కంపెనీలో కార్పొరేట్‌‌ గవర్నెన్స్‌‌పై కేంద్ర కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంసీఏ) వివరణ అడగడంపై స్పందిస్తూ నిర్దేశిత గడువులోపే దీనిపై ప్రభుత్వానికి వివరణ ఇస్తామని తెలిపారు. ఈ వివాదం కంపెనీ ఎదుగుదలకు అవరోధం కాదని స్పష్టం చేశారు.  ఇండిగోలో కార్పొరేట్‌‌ పాలన సరిగ్గా లేదంటూ, అంతా లోపాలమయంగా తయారయిందంటూ సంస్థ సహ–వ్యవస్థాపకుడు, ప్రమోటర్‌‌ రాకేశ్‌‌ గంగ్వాల్‌‌ చేసిన ఫిర్యాదుపై  జవాబు చెప్పాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు కార్పొరేట్‌‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ నుంచి సమాచారం అందిందని ఇండిగో స్టాక్‌‌ ఎక్సేంజీలకు వెల్లడించింది. రిజిస్ట్రార్‌‌ ఆఫ్‌‌ కంపెనీస్‌‌, నేషనల్‌‌ క్యాపిటల్‌‌ టెరిటరీ ఆఫ్‌‌ ఢిల్లీ అండ్‌‌ హర్యానా కూడా గంగ్వాల్ ఆరోపణలపై వివరణ కోరాయి. కేంద్ర విధించిన గడువులోపే గంగ్వాల్‌‌ ఆరోపణలపై వివరణ ఇస్తామని ఇండిగో తెలిపింది. కంపెనీల చట్టంలోని సెక్షన్‌‌ 206(4) ప్రకారం కేంద్రం ఇండిగోను వివరణ అడిగింది. ఇండిగోను నడిపే ఇంటర్‌‌గ్లోబ్‌‌ ఏవియేషన్‌‌లో కార్పొరేట్‌‌ పాలన సక్రమంగా లేదని, మరో ప్రమోటర్‌‌ రాహుల్‌‌ భాటియా ఆధ్వర్యంలో జరిగిన రిలేటెడ్‌‌ పార్టీ ట్రాన్సాక్షన్స్‌‌ (ఆర్‌‌పీటీ) మోసపూరితమని ఆరోపించారు.  ఇండిగోలో రాకేష్‌‌ గంగ్వాల్‌‌కు 37 శాతం వాటా ఉండగా, మరోవైపు భాటియా గ్రూప్‌‌కు 38 శాతం వాటా ఉంది. ఇండిగో కష్టకాలంలో ఉన్నప్పుడు భాటియానే చొరవ తీసుకున్నారని, మరో పక్క గంగ్వాల్‌‌ తన రిస్క్‌‌ను పరిమితం చేసుకునేందుకు ప్రయత్నించారని, ఒక దశలో అమ్మేద్దామని ప్రతిపాదించారని భాటియా గ్రూప్‌‌ వెల్లడించింది.

లాభాల్లాగే  విమానాలు పెరిగాయి

..ఆదాయం 44.6 శాతం పెరిగి రూ.9,420 కోట్లకు చేరింది.

..నిర్వహణ లాభం మూడు రెట్లు పెరిగి రూ.2,656 కోట్లుగా నమోదయింది

..ఆపరేటింగ్ మార్జిన్‌ 16 పర్సంటేజ్‌ పాయింట్లు పెరిగి 28.2 శాతానికి చేరింది.

..రెండో క్వార్టర్‌లో వార్షికంగా 28 శాతం వృద్ధి ఉండొచ్చని ఐజీఈ అంచనా వేస్తోంది.

..ప్రయాణికుడి నుంచి కిలోమీటరుకు వచ్చే సగటు ఆదాయం వార్షికంగా రూ.3.62 నుంచి రూ.4.08లకు పెరిగింది.

..ఇతర ఆదాయాలు 20 శాతం పెరిగి రూ.367 కోట్లకు చేరాయి.

..ఈ క్వార్టర్‌లో కొత్తగా 18 విమానాలను చేర్చడంతో మొత్తం విమానాల సంఖ్య 235కు పెరిగింది

..ఈ ఏడాది జూన్‌ 30 నాటికి కంపెనీ వద్ద రూ.17,337 కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. అప్పుల విలువ రూ.18,430 కోట్లకు చేరింది.

జెట్​, ఎయిరిండియా అందించిన కానుక ఇది

..ఆర్థిక సమస్యల వల్ల జెట్ ఎయిర్‌వేస్ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మూతబడింది. ఎయిర్‌ ఇండియా కూడా సంక్షోభంలో ఉంది.

..ఫలితంగా ఏర్పడ్డ లోటును ఇండిగో  భర్తీ చేసి టికెట్ల అమ్మకాలను భారీగా పెంచుకుంది.

..సీట్ల సంఖ్య తగ్గడంతో విమాన టికెట్ల ధరలు పెరగడంతో ఇండిగో ఆదాయాలు పెరిగాయి. ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 8 మోడల్‌ విమానాలపై నిషేధం విధించడం వల్ల కూడా సీట్ల సంఖ్య తగ్గింది.

..మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ చార్జీలు పెద్దగా పెరగలేదు.

..కొత్త రూట్లలో ఇండిగో పలు విమాన సర్వీసులను ప్రారంభించి  ఆదాయాన్ని ఇంకా పెంచుకుంది.

Latest Updates