ఇన్ఫోసిస్‌‌కు రూ.4,474కోట్ల లాభం

  • క్యూ3లో 23.5 శాతం పెరుగుదల  
  • రెవెన్యూ గైడెన్సులూ పెరిగాయ్‌‌
  • రెవెన్యూ రూ.23,092 కోట్లు

న్యూఢిల్లీ:

ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌‌ గత ఏడాది డిసెంబరుతో ముగిసిన మూడో క్వార్టర్‌‌కుగాను అంచనాలకు తగ్గ ఫలితాలను ప్రకటించింది. క్యూ3లో రూ.4,457 కోట్ల లాభం ఆర్జించింది. గత ఏడాది క్యూ3 లాభం రూ.3,609 కోట్లతో పోలిస్తే ఇది 23.49 శాతం ఎక్కువ. ఈసారి ఇన్ఫోసిస్‌‌కు రూ.4,204 కోట్ల లాభం వస్తుందని ఎనలిస్టుల అంచనాలకు మించి ఫలితాలను సాధించడం విశేషం. ఈ క్వార్టర్లో రెవెన్యూలు 7.9 శాతం పెరిగి రూ.21,400  కోట్ల నుంచి రూ.23,092  కోట్లకు చేరుకున్నాయి.

స్థిరమైన కరెన్సీ ధరల వద్ద 2020 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ గైడెన్స్‌‌లను 10–10.5 శాతానికి పెంచారు. గతంలో ఇవి 9–10 శాతం వరకు ఉండేవి. తాజా క్వార్టర్‌‌లో ఆపరేటింగ్‌‌ మార్జిన్‌‌ గత క్యూ3తో పోలిస్తే 60 బేసిస్‌‌ పాయింట్లు తగ్గి 21.0 శాతం రికార్డయింది. కంపెనీ అద్భుతంగా పనిచేస్తోందనడానికి తాజా ఫలితాలే ఉదాహరణ అని ఇన్ఫోసిస్‌‌ సీఈఓ, ఎండీ సలీల్‌‌పరేఖ్‌‌ అన్నారు.  గత ఏడాదితో పోలిస్తే కంపెనీ రెవెన్యూలు రెండు శాతం పెరిగి రూ.23,092 కోట్లు అయ్యాయి. గత క్యూ3లో వీటి విలువ రూ.22,629 కోట్లు.

భారీ ఆర్డర్లు

వివిధ కంపెనీల నుంచి 1.8 బిలియన్ డాలర్ల విలువైన (దాదాపు రూ.12,782 కోట్లు) భారీ ఆర్డర్లు సంపాదించామని ఇన్ఫోసిస్‌‌ ఎక్సేంజీలకు తెలిపింది. ఉద్యోగుల వలసలు బాగా తగ్గాయని చీఫ్‌‌ ఆపరేటింగ్‌‌ ఆఫీసర్‌‌ ప్రవీణ్‌‌ రావు ప్రకటించారు. ఈ క్వార్టర్‌‌లో ఫ్రీ క్యాష్‌‌ ఫ్లో విలువ 1.5 మిలియన్‌‌ డాలర్లు దాటిందని సీఎఫ్‌‌ఓ నీలాంజన్‌‌ రాయ్‌‌ చెప్పారు. రిటర్న్‌‌ ఆన్‌‌ ఈక్విటీ (ఆర్‌‌ఓఈ) క్యూ3లో 25.9 శాతం పెరిగింది. మార్జిన్లు  పెరగడమే ఇందుకు కారణం. ఫలితాల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌‌ షేర్లు 1.5 శాతం లాభంతో రూ.738.25 వద్ద ముగిశాయి.

విజిల్‌‌ బ్లోయర్‌‌ ఫిర్యాదులో నిజం లేదు

స్పష్టం చేసిన ఇన్ఫోసిస్‌‌ ఆడిట్‌‌ కమిటీ

ఇన్ఫోసిస్‌‌ యాజమాన్యం అక్రమాలకు పాల్పడిందంటూ విజిల్‌‌ బ్లోయర్‌‌ చేసిన ఆరోపణల్లో నిజం లేదని కంపెనీ ఆడిట్‌‌ కమిటీ స్పష్టం చేసింది. ఈ ఫిర్యాదుపై గత అక్టోబరు 21న విచారణ మొదలుపెట్టిన విచారణ ముగిసిన ఆడిట్‌‌ కమిటీ సభ్యులు ప్రకటించారు. కంపెనీ మరోసారి ఫైనాన్షియల్‌‌ స్టేట్‌‌మెంట్లుగానీ, సమాచారాన్ని గానీ అందించాల్సిన అవసరం లేదని ప్రకటించింది.

కమిటీ రిపోర్టులోని ముఖ్యాంశాలు

  • విజిల్ బ్లోయర్ ఆరోపణలకు ఆధారాలు లేవు. ట్రెజరీ పాలసీ విషయంలో కంపెనీ రూల్స్‌‌ ప్రకారమే నడుచుకుంది. సీఈఓ గానీ సీఎఫ్‌‌ఓ గానీ ఎలాంటి ఒత్తిడీ తేలేదు.
  • వీసా ఖర్చుల గురించి చేసిన ఆరోపణల్లోనూ నిజం లేదు. వీటికోసం పెట్టిన ఖర్చులను తప్పుగా రాయలేదు.
  • లార్జ్‌‌ డీల్స్‌‌ అప్రూవల్స్‌‌ విషయంలోనూ ఎలాంటి తప్పూ జరగలేదు. సంబంధిత విభాగాల అనుమతులు వచ్చాకే డీల్స్‌‌ కుదిరాయి. ఒక డీల్‌‌ విషయంలో మాత్రమే పోస్ట్‌‌–ఫ్యాక్టో అప్రూవల్‌‌ కోరారు.
  • అన్ని జాయింట్ వెంచర్లకు బోర్డు, ఆడిట్‌‌ కమిటీ గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చింది. డీల్స్‌‌ విషయంలో సీఈఓ అనవసరంగా జోక్యం చేసుకున్నట్టు ఆధారాలు లేవు.
  • మూడు పెద్ద డీల్స్‌‌/జేవీల రెవెన్యూ రికగ్నిషన్‌‌పై వచ్చిన ఆరోపణలూ అబద్ధాలే!

Infosys Q3 results: Net profit rises 23% to Rs 4,466 crore in December quarter

Latest Updates