న్యూజిలాండ్​తో ఎవరు?

వరల్డ్‌‌కప్‌‌  క్లైమాక్స్‌‌లో తొలి అంకం ముగిసింది. రెండు రోజుల పాటు సాగి.. ఉత్కంఠ రేపిన మొదటి సెమీస్‌‌లో ఫేవరెట్‌‌ ఇండియాను ఓడించిన న్యూజిలాండ్‌‌ వరుసగా రెండోసారి ఫైనల్‌‌కు చేరుకుంది. ఇప్పుడు తేలాల్సింది లార్డ్స్‌‌ లాస్ట్‌‌ ఫైట్‌‌లో ఆ జట్టుతో తలపడేది ఎవరనేదే.  తొలి కప్పు కోసం దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఇంగ్లండ్‌‌, ఆరో టైటిల్‌‌పై కన్నేసిన ఆస్ట్రేలియా మధ్య నేడే సెకండ్‌‌ సెమీఫైనల్‌‌.  సొంతగడ్డపై ఎలాగైనా ట్రోఫీని ముద్దాడాలని ఆశిస్తున్న ఇంగ్లిష్‌‌ టీమ్‌‌ ఆ దిశగా ముందడుగు వేస్తుందా?  ప్రపంచకప్‌‌ అంటేనే ఎక్కడాలేని ఉత్సాహంతో, కసితో చెలరేగిపోయే కంగారూలే  కివీస్‌‌తో మరోసారి టైటిల్‌‌ ఫైట్‌‌లో తలపడతారా?

బర్మింగ్‌‌హామ్‌‌:   వన్డేల్లో నంబర్‌‌ వన్‌‌ టీమ్‌‌ ఇంగ్లండ్‌‌, వరల్డ్‌‌కప్స్‌‌లో నంబర్‌‌ వన్‌‌ టీమ్‌‌ ఆస్ట్రేలియా హై వోల్టేజ్‌‌ మ్యాచ్‌‌కు తెరలేచింది. ఎప్పుడు ఎదురుపడ్డా కసిగా పోరాడే రెండు జట్లు గురువారం జరిగే  రెండో సెమీఫైనల్లో అమీతుమీకి రెడీ అయ్యాయి. ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇచ్చిన గత ఎడిషన్‌‌లో  గ్రూప్‌‌ దశలోనే అవమానకర రీతిలో నిష్క్రమించిన తర్వాత  తన ఆటను మార్చుకొని వన్డేల్లో  నంబర్‌‌ వన్‌‌ టీమ్‌‌గా ఎదిగి  సొంతగడ్డపై  వరల్డ్‌‌కప్‌‌ కలను సాకారం చేసుకోవాలని  ఇంగ్లండ్‌‌  కృత నిశ్చయంతో ఉంది. బ్యాటింగ్‌‌లో ఓపెనర్లు జానీ బెయిర్‌‌స్టో, జేసన్‌‌ రాయ్‌‌ ఫామ్‌‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌‌లోనూ ఇద్దరి నుంచి మెరుపు ఆరంభాన్ని జట్టు ఆశిస్తోంది. జో రూట్‌‌, ఇయాన్‌‌ మోర్గాన్‌‌, జోస్‌‌ బట్లర్‌‌ కూడా తలోచేయి వేస్తే జట్టుకు తిరుగుండదు. ఊపుమీదున్న ఆల్‌‌రౌండర్‌‌  బెన్‌‌ స్టోక్స్‌‌ హోమ్‌‌టీమ్‌‌కు అదనపు బలం. పేస్‌‌ త్రయం లియామ్‌‌ ప్లంకెట్‌‌, మార్క్‌‌ వుడ్‌‌, జోఫ్రా ఆర్చర్‌‌ కూడా మంచి జోష్‌‌లో కనిపిస్తున్నారు. మరోవైపు చిరకాల ప్రత్యర్థి, ఐదుసార్లు విశ్వవిజేత ఆస్ట్రేలియాను ఓడించడం అంత ఈజీ కాదు.  ప్రస్తుతం ఆసీస్​ సూపర్​ఫామ్​లో ఉంది. ఓడినప్పుడల్లా బలంగా   పుంజుకోవడం కంగారూలకు అలవాటు. ఇండియా చేతిలో ఓటమి తర్వాత ఒక్కసారిగా చెలరేగుతూ అందరికంటే ముందే సెమీస్‌‌ బెర్తు ఖాయం చేసుకున్నారు. పైగా, ప్రపంచకప్‌‌లో అత్యంత నిలకడగా ఆడే ఆసీస్‌‌..సెమీస్‌‌లో ఒక్కసారి కూడా ఓడింది లేదు. సరైన టైమ్‌‌లో అత్యుత్తమ ఆటను బయటకు తీసిన ఫించ్‌‌సేన ఎలాంటి ఆందోళన లేకుండా  ఆరో టైటిల్‌‌ రేసులో నిలిచింది. బ్యాటింగ్‌‌లో వార్నర్‌‌, ఫించ్‌‌ చెలరేగుతున్నారు.  స్మిత్‌‌ టాప్‌‌ గేర్‌‌లోకి రావాల్సి ఉంది. బౌలింగ్​లో స్టార్క్‌‌, కమిన్స్‌‌, బెరెన్‌‌డార్ఫ్ దుమ్మురేపుతున్నారు. కండరాల గాయంతో ఇబ్బంది పడ్డ మార్కస్‌‌ స్టొయినిస్‌‌ కోలుకోవడం ఊరటనిచ్చే అంశం.

జట్లు (అంచనా)

ఇంగ్లండ్‌‌‌‌: జేసన్‌‌‌‌ రాయ్‌‌‌‌, జానీ బెయిర్‌‌‌‌స్టో, జో రూట్‌‌‌‌, ఇయాన్‌‌‌‌ మోర్గాన్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), బెన్‌‌‌‌స్టోక్స్‌‌‌‌, జోస్‌‌‌‌ బట్లర్‌‌‌‌ (కీపర్), క్రిస్‌‌‌‌ వోక్స్‌‌‌‌, లియామ్‌‌‌‌ ప్లంకెట్‌‌‌‌, ఆదిల్‌‌‌‌ రషీద్‌‌‌‌, జోఫ్రా ఆర్చర్‌‌‌‌, మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌.

ఆస్ట్రేలియా: ఆరోన్‌‌‌‌ ఫించ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), డేవిడ్‌‌‌‌ వార్నర్‌‌‌‌, స్టీవ్‌‌‌‌ స్మిత్‌‌‌‌, పీటర్‌‌‌‌ హ్యాండ్స్‌‌‌‌కాంబ్‌‌‌‌, మార్కస్‌‌‌‌ స్టొయినిస్‌‌‌‌, గ్లెన్‌‌‌‌ మ్యాక్స్‌‌‌‌వెల్‌‌‌‌, అలెక్స్‌‌‌‌ కారీ (కీపర్), పాట్‌‌‌‌ కమిన్స్‌‌‌‌, మిచెల్‌‌‌‌ స్టార్క్‌‌‌‌, నేథన్‌‌‌‌ లైయన్‌‌‌‌, జేసన్‌‌‌‌ బెరెన్‌‌‌‌డార్ఫ్‌‌‌‌.

పిచ్‌‌‌‌/వాతావరణం

ఇండియా–ఇంగ్లండ్‌‌‌‌ లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు వాడిన వికెట్‌‌‌‌ను ఈ పోరుకు ఉపయోగించనున్నారు. పిచ్‌‌‌‌పై పచ్చికను కత్తిరించారు. షార్ట్‌‌‌‌ బౌండ్రీ నేపథ్యంలో మంచి స్కోర్లు నమోదవ్వొచ్చు. స్పిన్‌‌‌‌ పెద్దగా ప్రభావం చూపే అవకాశం లేకపోవచ్చు. ఈ మ్యాచ్‌‌‌‌కు కూడా వర్ష సూచన ఉంది.