విద్యార్థులు ఫెయిలవ్వడం సహజమే: బోర్డ్ సెక్రటరీ అశోక్

హైదరాబాద్  : తీవ్ర దుమారం రేపుతున్న ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ – 2019 ఫలితాల వివాదంపై ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ అశోక్ స్పందించారు. పెద్దఎత్తున విద్యార్థులు, తల్లిదండ్రులు నాంపల్లిలోని ఇంటర్ బోర్డ్ ఆఫీసుకు వచ్చి ధర్నా చేయడంతో ఆయన వివరణ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న స్టూడెంట్స్, పేరెంట్స్ ను సముదాయించే ప్రయత్నంచేశారు.

ఫలితాల విడుదలలో తాము ఏ తప్పూ చెయ్యలేదేని ఇంటర్ బోర్డ్ సెక్రటరీ అశోక్ చెప్పారు. పేపర్ల కరెక్షన్ పారదర్శకంగానే జరిగిందన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పేవి అన్నీ తప్పుడు వార్తలని ఆయన అన్నారు. సమస్య ఉంటే రీ -కౌంటింగ్, రీ వాల్యుయేషన్ చేస్తామనీ.. అప్లై చేసుకోవాలని ఆయన అన్నారు. “ఫెయిల్ అయ్యిన వాళ్ళు వంద మాట్లాడుతారు….అవి బోర్డ్ పట్టించుకోదు. స్టూడెంట్స్ ఫెయిల్ అవుతారు. అవన్నీ బోర్డ్ మీదనెట్టడం సమంజసం కాదు” అని అశోక్ చెప్పడంతో… అక్కడున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా సీరియస్ అయ్యారు.

“ఆన్సర్ షీట్ ఇస్తామని అంటున్నాం. ఇంతకంటే పారదర్శకంగా ఎవరైనా ఉంటారా. మ్యాక్స్ లో బాగున్నవారు.. ఇంగ్లీష్ లో వీక్ ఉండొచ్చు. ఎందుకు తక్కువొచ్చాయంటే ఎలా. ఉండొచ్చు కదా. మీకు ఆన్సర్ షీట్స్ ఇస్తా. రీ వెరిఫికేషన్  చేయడానికి సిద్ధం. 10 లక్షల మంది ఉన్నారు. విద్యార్థులు ఫెయిలవ్వడానికి చాలా కారణాలు ఉంటాయి. అవ అనుమానం ఉంటే వెరిఫికేషన్ పెట్టుకోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా… బోర్డు ఎటువంటి తప్పు చేయలేదు. వెబ్ సైట్ ఓపెన్ గానే ఉంది” అన్నారు.

అధికారి స్థాయిలో ఉండి కూడా అశోక్ ఎదురుదాడి చేసినట్టుగా మాట్లాడటంతో… విద్యార్థులు, తల్లిదండ్రులు బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్య పరిష్కారం అయ్యేదాకా ఆందోళన కొనసాగిస్తామని అన్నారు.

Latest Updates