దేశంల మొదటి బడ్జెట్ ఇట్లుండె..!

దేశంల మొదటి బడ్జెట్ ఇట్లుండె..!

పోయిన బడ్జెట్​లో సైజు 34 లక్షల కోట్లు. ఎన్ని సున్నాలు వేయాలన్నది యావరేజ్​ ఇండియన్​కి కొంచెం కష్టమే. మరి, మొదటి బడ్జెట్​ సైజెంతో తెలుసా? కేవలం 198 కోట్లు! రెవెన్యూ అంచనా 171 కోట్లు. ఫస్ట్​ బడ్జెట్​లో లోటు 26.24 కోట్ల రూపాయలు. దీనిలో సగానికి పైగా డిఫెన్స్​ మీదనే ఖర్చు పెట్టారు. స్వతంత్రం వచ్చాక ఈ 72 ఏళ్లలో దేశ రాబడి, ఖర్చు వందల కోట్ల నుంచి లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. బడ్జెట్​ అంటే దేశ అవసరాల గురించి చెప్పే ఓ చిట్టా పద్దు. ఇండిపెండెన్స్​ వచ్చిన 102 రోజులకు… 1947 నవంబర్​ 26న తొలి ఆర్థిక మంత్రి ఆర్​.కె.షణ్ముగం చెట్టి ఫస్ట్​  బడ్జెట్​ను ప్రతిపాదించారు.

తొ లి బడ్జెట్​ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి షణ్ముగం చెట్టి చేసిన ప్రసంగం…  ‘‘దేశ అవసరాలను తీర్చడం కోసం ఇతరులపై ఆధారపడకుండా ఉండే రోజును భారతీయులకు పరిచయం చేయడానికే ఈ బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నాం. ఆహార పంటల ఉత్పత్తి పెంచడం, దిగుమతుల్ని తగ్గించడం, పారిశ్రామిక అభివృద్ధి సాధించడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం. ఇందుకోసం మా ప్రభుత్వం ‘ఎక్కువ ఆహారాన్ని పండించండి’ అని ప్రచారం చేసింది. అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రజలకు రేషన్​ సరుకులు పూర్తి స్థాయిలో అందించలేకపోతున్నాం. ఇప్పటికే గోధుమల కోసం ఆస్ట్రేలియాకు ఓ బృందం వెళ్లింది. ఆ ప్రయత్నాలు ఫలిస్తే మన ఆహార అవసరాలు కొంతమేర తీరుతాయి. అయితే ఆహారం కోసం ఇలా విదేశాల మీద ఆధారపడడం మంచిది కాదు. మన అవసరాలకు సరిపడా ఆహారాన్ని మనమే పండించుకునే స్థాయికి చేరడమే ప్రస్తుతం మన ముందున్న ఎజెండా. దీనిపై సర్​ పురుషోత్తందాస్​ ఠాకూర్​దాస్​ కమిటీ ఇప్పటికే రిపోర్ట్​ ఇచ్చింది. అయితే రిపోర్ట్​ను ప్రభుత్వం ఇంకా పరిశీలించాల్సి ఉంది.

ఆహార ఉత్పత్తిని పెంచడం కోసం వ్యవసాయరంగానికి ప్రాధాన్యత ఇస్తున్నాం. అయినంత మాత్రాన పారిశ్రామికరంగాన్ని నిర్లక్ష్యం చేయడం కూడా సరికాదు. మత సంఘర్షణల కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గింది. దీనివల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. బ్రిటీష్​ కామన్వెల్త్​ దేశాల నుంచి సరుకు రవాణా కూడా తగ్గింది. ఆహార ధాన్యాల్లా పారిశ్రామిక ఉత్పత్తులను దిగుమతి చేసుకునే పరిస్థితి కూడా లేదు. అందుకు పారిశ్రామిక ఉత్పత్తులను పెంచుకునేందుకు సొంత వనరులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఇలా రోజువారీ అవసరాల కోసం ఇతర దేశాలపై ఎక్కువ రోజులు ఆధారపడకూడదు. విదేశీ మారక నిల్వలపై కూడా దీని ప్రభావం ఉంటుంది. దేశ వనరులను పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఇందుకోసం మన శక్తియుక్తులన్నింటినీ ధారపోయాలి. ఇదేమీ అసాధ్యమైన పనికాదు. చేయి చేయి కలిపితే సాధ్యమే.

ఇక, ఫారిన్​ కరెన్సీ నిల్వలను కూడా వాడుకోవాల్సి వస్తోంది. ఈ నిల్వల నుంచి డబ్బు తీసుకోకపోతే యుద్ధం సమయంలో ఆకలితో అలమటించాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితులు ఎదురైతే తప్ప.. వాటి జోలికి వెళ్లాలని మా ప్రభుత్వం అనుకోవడం లేదు. స్టెర్లింగ్​ పద్దు  నుంచి డబ్బు తీసుకోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు తప్పవు.

ప్రావిన్సులలో అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు ఖర్చు చేయడంలేదని సభికులు ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రావిన్సులు సొంత వనరులు పెంపొందించుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. దీనిని ప్రావిన్సులు కూడా అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాం.

చివరగా.. భారతదేశం ఇప్పుడే బానిసత్వం నుంచి బయటపడింది. ఆసియాలో లీడర్ కావాలన్న తన లక్ష్యాన్ని  ఇండియా చేరుకుంటే… స్వతంత్ర దేశాల్లో ముందు వరుసలో ఉంటుంది. ఇందుకోసం మనమంతా రాబోయే సంవత్సరాల్లో క్రమశిక్షణతో కూడిన చర్యలు చేపట్టాలి. శాంతి భద్రతల్ని కాపాడ్డానికి, ఉత్పత్తిని పెంచడానికి, అంతర్గత సంఘర్షణలు తగ్గించుకోవడానికి ఒకరికొకరం సహకరించుకోవాలి. అప్పుడే ‘ఆసియాలో లీడర్​’ కావాలన్న మన కల నెరవేరుతుంది.

రూ. 26 కోట్ల 24 లక్షలలోటు

దేశ విభజన జరిగిన తర్వాత ప్రవేశపెడుతున్న బడ్జెట్​ కావడంతో అంచనాల్లో హెచ్చుతగ్గులు ఉండొచ్చు.  ప్రస్తుతానికి 171 కోట్ల 15 లక్షల రూపాయల ఆదాయ అంచనాతో ఈ బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నాం. అన్నీ కొత్తగా సమకూర్చుకోవలసి ఉంది. కాబట్టి వ్యయం 197 కోట్ల 39 లక్షలు ఉంటుందని అనుకుంటున్నాం. అంటే.. లోటు 26 కోట్ల 24 లక్షల రూపాయల వరకు ఉండొచ్చు. ఈ లోటు మరింతగా పెరిగే అవకాశం కూడా ఉంది. శరణార్థులకు పునరావసం కల్పించడం, కొత్తగా ఏర్పడ్డ పశ్చిమ బెంగాల్, తూర్పు పంజాబ్‌లకు సాయం చేయడంలాంటి అదనపు ఖర్చులున్నాయి.  50 కోట్ల 5 లక్షల రూపాయలు కస్టమ్స్​ నుంచి, 29 కోట్ల5లక్షల రూపాయలు ఇన్​కమ్​ ట్యాక్స్​ నుంచి, 88కోట్ల 5 లక్షల రూపాయలు సాధారణ వసూళ్ల నుంచి వస్తాయని అనుకుంటున్నాం. రైల్వే నుంచి ఎటువంటి ఆదాయాన్ని ఆశించడం లేదు.

– సుధాకర్​ సాదుల

బడ్జెట్​లో సగానికిపైగా డిఫెన్స్​కే

ప్రతిపాదించిన ఖర్చులో 92కోట్ల74లక్షల రూపాయలు రక్షణరంగానికి, మిగతాది దేశ ప్రజల అవసరాలు తీర్చేందుకు ఖర్చు చేస్తాం. విభజన కారణంగా రక్షణ రంగానికి ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పొరుగుదేశంతో పోలిస్తే నౌక, వాయుసేనల్లో మన బలం సరిపడినంతగా లేదు. దీనిని పెంచుకునేందుకు ఈ ఖర్చు చేయక తప్పడంలేదు. 1949 నాటికి సైనికుల సంఖ్యను 2 లక్షల 60వేల మందికి పెంచుకోవాలి. ఎందుకంటే బ్రిటీష్​ ఆర్మీ దేశం నుంచి వెళ్లిపోతోంది. వాళ్లు పూర్తిగా వెళ్లిపోయేలోగా మనం బలపడాలి. అందుకే మొత్తం బడ్జెట్​లో సగానికిపైగా సైన్యానికే కేటాయిస్తున్నాం.

యుద్ధం తర్వాత నిలబడ్డది మనమే..

ఈ రోజు నన్ను ఎవరైనా దేశ ఆర్థిక పరిస్థితి గురించి అడిగితే ‘పటిష్టంగానే ఉంది’ అని నేను ఏమాత్రం సంకోచించకుండా చెబుతాను. ఎందుకంటే, చరిత్రలో యుద్ధం తర్వాత ఏ దేశమూ ఇప్పుడు మనం ఉన్న స్థితిలో లేదు. వాటితో పోల్చుకుంటే మనం మంచి స్థితిలోనే ఉన్నాం. రానున్న రోజుల్లో పరిస్థితి మనకు అనుకూలంగా మారుతుంది. రక్షణ ఖర్చు తగ్గుతుంది. అయితే వచ్చే ఏడాదికే మనం సాధారణ స్థితికి చేరుకుంటామని చెప్పడం గొప్పే అవుతుంది. 1949–50 నాటికి అన్నీ సర్దుకుంటాయని మాత్రం చెప్పగలను. దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఎలాంటి నిరాశ అక్కర్లేదు. విభజన జరగకపోయి ఉంటే అఖండ భారతదేశం చాలా మెరుగ్గా ఉండేది. కానీ దురదృష్టం… విడిపోయాం.  మళ్లీ ఒకప్పటి ఉన్నత స్థితికి వెళ్లడానికి మనమంతా కష్టపడాలి.