విద్యుత్​తో మార్కుల ప్రవాహం

ఇంటర్మీడియట్​ సెకండియర్​లో మంచి మార్కులు సాధించడంతో పాటు ఎంసెట్​లో మంచి ర్యాంకు సాధించి బెస్ట్ ఇంజినీరింగ్​, మెడికల్​ కాలేజీలో సీటు సంపాదించాలనేది ప్రతి విద్యార్థి లక్ష్యం. ఈ లక్ష్య సాధనలో ముందుండాలంటే ఇంటర్మీడియట్ మార్కులపై దృష్టి సారించాలి. ఎంసెట్​లో ఇంటర్​ మార్కులకు వెయిటేజీ ఉంటుంది కాబట్టి రెండో సంవత్సరంలో మంచి మార్కులు సాధించడం కీలకం. అవగాహన లేక ప్రథమ సంవత్సరంలో మార్కులు తగ్గినా ఇప్పుడు పెంచుకునే అద్భుత అవకాశం ఉంటుంది. కాబట్టి సరైన ప్రణాళికతో పర్సంటేజ్​ను పెంచుకోవటానికి ప్రయత్నించాలి. రెండో సంవత్సరం ఫిజిక్స్​లో కిందటి సంవత్సరం ప్రశ్నాపత్రాల ఆధారంగా వివిధ అధ్యాయాలకు గల ప్రాధాన్యతలను (వెయిటేజి) రూపొందించుకొని ఎలా సిద్ధమవ్వాలో పరిశీలిద్దాం.

ఫిజిక్స్​లో కనీస మార్కులు అనగా పాస్​ మార్కులు పొందాలంటే ఖచ్చితంగా దీర్ఘ సమాధాన ప్రశ్నలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. వీటితో తేలికగా 16 మార్కులు పొందవచ్చు. దీర్ఘ సమాధానాల ప్రశ్నల కోసం  తరంగాలు, ప్రవాహ విద్యుత్​, చలించే ఆవేశాలు మరియు అయస్కాంతత్వం, కేంద్రకాలపై అధికంగా దృష్టి పెట్టాలి. వీటిలో అవసరమైన చోట్ల పటాలు, గ్రాఫులు స్పష్టంగా సూచించాలి. దీర్ఘ సమాధాన ప్రశ్నల తర్వాత స్వల్ప సమాధాన ప్రశ్నలపై పట్టు సాధించాలి. వీటి కోసం తరంగాలు, కిరణ దృశా శాస్త్రం, ఏకాంతర విద్యుత్​ ప్రవాహం, పరమాణువులు, కేంద్రకాలు, అర్థవాహక పరికరాలు వంటి అధ్యాయాలను క్షుణ్నంగా నేర్చుకోవాలి. అతి స్వల్ప సమాధాన ప్రశ్నల కోసం కిరణ దృశా శాస్త్రం, విద్యుత్​ ఆవేశాలు, క్షేత్రాలు, ప్రవాహ విద్యుత్​, విద్యుదయస్కాంత తరంగాలు, అర్థవాహక పరికరాలు వంటి అధ్యాయాలను నేర్చుకోవాలి. ఖచ్చితమైన ప్రణాళికతో పై అధ్యాయాలను వాటి ప్రాధాన్యతల పరంగా అభ్యసిస్తే కనీసం 30 మార్కులకు పైగా పొందటం కష్టతరమేమీ కాదు.

మరిన్ని ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇంపార్టెంట్ చాప్టర్స్​

2 మార్కులు

కిరణ దృశా శాస్ర్తం

విద్యుత్‍ ఆవేశాలు, క్షేత్రాలు

ప్రవాహ విద్యుత్తు

చలించే ఆవేశాలు,  అయస్కాంతత్వం

విద్యుదయాస్కాంత ప్రేరణ

విద్యుదయాస్కాంత తరంగాలు

కేంద్రకాలు

అర్ధవాహక ఎలక్ట్రానిక్​ పదార్థాలు, పరికరాలు

సంవర్గ వ్యవస్థలు

ఉదాహరణ: 0.12 kg ద్రవ్యరాశి గల ఒక బంతి 20m/s వేగంతో చలిస్తూ ఉంటే, దాని డీబ్రోగీ తరంగ దైర్ఘ్యమెంత?

జవాబు:  m = 0.12 kg ;                V = 20 m/s

h = 6.63×10–34 J–sec

l = h/mv = 6.63 ×10–34/0.12×20  =  2.762 × 10‌–34 m

4 మార్కులు

తరంగాలు

తరంగ దృశాశాస్ర్తం

స్థిరవిద్యుత్‍ పొటెన్షియల్‍ – కెపాసిటన్స్

చలించే ఆవేశాలు, అయస్కాంతత్వము

అయస్కాంతత్వము–ద్రవ్యం

పరమాణువులు

కేంద్రకాలు

అర్ధవాహక ఎలక్ట్రానిక్​ పదార్థాలు, పరికరాలు

 1. ఒక విద్యుత్ వలయంలోని విద్యుత్​ ప్రవాహం 0.1 సెకన్లో 5.0A నుండి 0Aలకు పడిపోయినది. సగటు ప్రేరణ విద్యుచ్ఛాలక బలం 200V అయితే, వలయ స్వయం ప్రేరణ విలువ ఎంత?

జవాబు: స్వయం ప్రేరిత విద్యుచ్ఛాలక బలం

e = – L di/dt               200 = L(5/0.1)

L=20/5 = 4H

 1. స్థిర విద్యుత్‍ శాస్ర్తంలోని గాస్‍ నియమాన్ని తెలిపి, దాని ప్రాముఖ్యతను వివరించండి.

జవాబు: గాస్‍ నియమం: ఒక మూసిన తలం నుంచి వెలువడే మొత్తం విద్యుత్‍ అభివాహం, ఆ తలం చేత ఆవరింపబడిన మొత్తం ఆవేశానికి1/-eo రెట్లు ఉంటుంది. దీనిని గాస్‍ నియమం అంటారు.

ప్రాముఖ్యత:

 1. గాస్‍ నియమం సంవృత తలం, ఆకారం, పరిమాణంలపై ఆధారపడదు.
 2. గాసియన్‍ తలం వెలుపల గల ఆవేశాలు గాసియన్‍ తలం నుంచి వెలువడే మొత్తం అభివాహాన్ని ప్రభావితం చేయలేవు.

 

మోడల్ పేపర్

సెక్షన్–ఎ

కింది అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయండి.  10×2=20M

 1. మాడ్యులేషన్‌‌ ప్రాథమిక పద్ధతులను పేర్కొనండి.
 2. 10 cm నాభ్యాంతర కలిగిన ఒక పుటాకార దర్పణాన్ని ఒక గోడ నుంచి 35 cm దూరంలో ఉంచారు. గోడమీద ఒక నిజ ప్రతిబింబం ఏర్పడటానికి వస్తువును గోడ నుంచి ఎంత దూరంలో ఉంచాలి?
 3. సమశక్మ ఉపరితలాలంటే అర్థం ఏమిటి?
 4. విద్యుత్‌‌ ప్రవహిస్తున్న వృత్తాకార తీగచుట్ట అక్షం పై ఏదైనా బిందువు వద్ద అయస్కాంత ప్రేరణకు సమాసం రాయండి. దీని నుంచి, దాని కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణను పొందండి.
 5. అయస్కాంత ప్రవణత లేదా అవపాత కోణం నిర్వచించండి.
 6. ‘స్వయం ప్రేరకత్వం’ అంటే మీరు ఏమి అర్థం చేసుకొన్నారు?
 7. విద్యుత్‌‌ ప్రవాహం యొక్క వాట్‌‌లెస్‌‌ అంశ అంటే అర్థం ఏమిటి?
 8. రాడార్‌‌లలో సూక్ష్మ తరంగాలను ఉపయోగించడానికి కారణం ఏమిటి?
 9. డీ–బ్రాగ్లీ సంబంధాన్ని రాసి, అందులోని పదాలను వివరించండి.
 10. సంధి డయోడ్‌‌ కు 1) పురోశక్మం, 2) తిరోశక్మంలలో బ్యాటరీని ఏవిధంగా కలుపుతారు?

సెక్షన్–బి

కింది వాటిలో ఏవైనా ఆరు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.              6×4=24M

 1. కనిష్ఠ విచలన కోణ స్థానంలో అమర్చిన A పట్టణ కోణం కలిగిన ఒక పట్టకం నుంచి కాంతి ప్రసారమవుతున్నది. ఎ) పతన కోణానికి సమాసాన్ని పట్టక కోణం మరియు కనిష్ఠ విచలన కోణం పదాలలో రాబట్టండి. బి) వక్రీభవన కోణానికి–వక్రీభవన గుణకం పదాలలో సమాసాన్ని రాబట్టండి.
 2. కాంతి వ్యతికరణం సంభవించే బిందువు వద్ద కాంతి తీవ్రతకు సమాసాన్ని ఉత్పాదించండి. గరిష్ఠ, శూన్య తీవ్రతల నిబంధనలను రాబట్టండి.
 3. స్థిర విద్యుత్‌‌ శాస్త్రంలోని గాస్‌‌ నియమాన్ని తెలిపి, ప్రాముఖ్యతను వివరించండి.
 4. కెపాసిటర్‌‌ల శ్రేణి, సమాంతర సంయోగాలను వివరించండి. ప్రతి సంయోగంలోను తుల్య కెపాసిటెన్స్‌‌కు ఫార్మాలను రాబట్టండి.
 5. బయోట్‌‌–సవర్ట్‌‌ నియమాన్ని, తెలిపి, వివరించండి.
 6. గమన తలానికి లంబంగా ఉన్న ఏకరీతి అయస్కాంత క్షేత్రంలో విద్యుత్‌‌ వాహకం చలించినప్పుడు వాహకం కొనల మధ్య ప్రేరితమమ్యే విద్యుచ్చాలక బలానికి సమాసాన్ని పొందండి.
 7. 0.12 kg ల ద్రవ్యరాశి కలిగి వడి 20 ms–1 తో చలిస్తున్న బంతి డీ–బ్రాగ్లీ తరంగదైర్ఘ్యం ఎంత? ఈ ఫలితం నుంచి మనర చేయగలిగే అనుమితి ఏమిటి?
 8. బోర్‌‌ పరమాణు నమూనా ప్రకారం హైడ్రోజన్‌‌ పరమాణువులోని ఏదైనా క్షక్యలో ఉన్న ఎలక్ట్రాన్‌‌ స్థితిజ, గతిజ శక్తులకు సమాసాన్ని ఉత్పాదించండి. n పెరిగే కొద్దీ స్థితిజశక్తి ఏవిధంగా మారుతుంది?

సెక్షన్–సి

కింది వాటిలో ఏవైనా రెండు ప్రశ్నలకు సమాధానాలు రాయండి.             2×8=16M

 1. సాగదీసిన తంత్రుల్లో స్థిర తరంగాలు ఏర్పడటాన్ని వివరించండి. దాని నుంచి సాగదీసిన తంత్రుల్లో తిర్యక్‌‌ తరంగాల నియమాలను ఉత్పాదించండి.

3 cm వ్యాసం గల ఒక ఉక్కు కేబుల్‌‌ను  10 kN తన్యతను లోబడి ఉంచారు. ఉక్కు సాంద్రత 7.8 g/cm3 . ఆ కేబుల్‌‌ వెంట ఎంత వడితో తిర్యక్‌‌ తరంగాలు ప్రయాణిస్తాయి?

 1. పొటెన్షియోమీటర్‌‌ పనిచేసే సూత్రాన్ని తెలపండి. పొటెన్షియోమీటర్‌‌ ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల emf లను ఎలా పోలుస్తారో వలయం రేఖా చిత్రం సహయంతో వివరించండి.
 2. ద్రవ్యరాశి లోపం, బంధన శక్తులను నిర్వచించండి. ఒక్కో న్యూక్లియాన్‌‌కు గల బంధన శక్తి, ద్రవ్యరాశి సంఖ్యతో ఎలా మారుతుంది?

వందశాతం మార్కులకు

సెకండియర్‍లో అత్యధిక మార్కులు పొందాలంటే దీర్ఘ సమాధాన ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. అవసరమైన చోట పటాలు ఖచ్చితంగా గీయాలి. ముఖ్యంగా కిరణ దృశా శాస్త్రం, తరంగ దృశా శాస్త్రంలలోని పటాలపై కాంతి కిరణమార్గాలు మరియు విద్యుత్‍కు సంబంధించిన పటాలలో విద్యుత్‍ ప్రవాహ దిశలను స్పష్టంగా, ఖచ్చితంగా సూచించాలి. అవసరమైన చోట్ల భౌతిక రాశుల ప్రమాణాలను SI పద్ధతిలో సూచించాలి. అతిస్వల్ప సమాధాన ప్రశ్నల జవాబులను జవాబు పత్రంలో ఒకేచోట వరుసగా రాయాలి. అవసరమైన చోట్ల నమూనా గ్రాఫ్​లను స్పష్టంగా సూచించాలి. పరీక్ష సమయంలో చివరి 15 నిమిషాల్లో అప్పటి వరకు రాసిన అంశాలను సరిచూసుకోవాలి. ముఖ్య వాక్యాలను అండర్​లైన్​ చేయాలి.