కుత్బుల్లాపూర్ టీఆర్ఎస్ లో కిరికిరి

కుత్బల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీలో ఆధిపత్య పోరు నెలకొంది. ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ ల మధ్య ఉన్న అంతర్గతపోరు మేడ్చల్ జిల్లా పార్టీ ఆఫీసు భూమిపూజ సందర్బంగా బయటపడింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ రాకుండానే మంత్రి మల్లారెడ్డి భూమి పూజ చేయడంతో కార్యకర్తలు ఆశ్చర్యానికి గురయ్యారు. కార్మిక మంత్రి మల్లారెడ్డి సాక్షిగా పార్టీ జిల్లా ఆఫీసుకు రెండు సార్లు భూమిపూజ జరగడం ద్వారా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల మధ్య నివురు గప్పి న నిప్పులా ఉన్న అంతర్గత రాజకీయ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి.

రెండోసారి గెలవడమే…

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యేగా కేపీ వివేకానందగౌడ్ రెండోసారి గెలుపొందిన నాటినుంచే ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు కంటగింపుగా మారిందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతున్నది. వివేకానందకు మంత్రి పదవి రాకుండా చేమకూర మల్లారెడ్డికి రావడం వెనుక ఎమ్మెల్సీ ప్రయత్నాలు ఉన్నాయనే అప్పట్లోనే టీఆర్ఎస్ వర్గాలు చర్చించుకున్నాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు అనుచరుడిగా గుర్తింపును కలిగి ఉండడం ఆవాదనలకు బలాన్ ని చేకూర్చాయి. మంత్రి వర్గం ఏర్పాటు నాటి నుంచి వివేకానందగౌడ్, శంభీపూర్ రాజుల మధ్య విభేదాలు చొటుచేసుకుని ఇటీవల కాలంలో తారాస్థాయికి చేరుకున్నాయని పార్టీ నాయకులు బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు.

క్యాడర్ లో గందరగోళం..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం టీఆర్ఎస్ క్యాడర్ లో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల ఆధిపత్యపోరు ‘ఒకే వరలో రెండు కత్తులు’ మాదిరిగా ఉండడంతో వారంతా ఎటువైపో ఉండాలనే సందిగ్ధతను ఎదుర్కొంటున్నారు. ‘కరవమంటే కప్పకు కోపం… విడవమంటే పాముకు కోపం’ లాగా కార్యకర్తలు, నాయకుల పరిస్థి తి తయారైంది. ఎవరి అనుచరులుగా ముద్రపడితే తమ భవిష్యత్తు ఏమవుతుం దోన్న ఆందోళనలో నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ ఏడాదిలోనే మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో మున్ముందు ఎలాంటి పరిస్థి తులను చూడాల్సి వస్తుందోనన్న భీతితో పార్టీ శ్రేణులు ఉన్నాయి.

అసెంబ్లీ ఎన్నికల నుంచే..

గత డిసెంబర్ లో జరిగి న అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచే వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయని పార్టీ నాయకులు చెబుతున్నారు. కుత్బుల్లాపూర్ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసేందుకు శంభీపూర్ రాజు టిక్కెట్టు ఆశించారని, అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీటు కేటాయించడంతో వివేకానందగౌడ్ రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందరు. ఎన్నికల సమయంలోనే వివేకానందగౌడ్ ను ఓడించే ప్రయత్నాలు జరిగాయనే ప్రచారం కూడా లేకపోలేదు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన పనులు, వ్యక్తి గతంగా కలుపుగోలుతనం వివేకానందగౌడ్ కు కలిసివచ్చి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారని పార్టీ వర్గాలు చెబుతాయి.

మున్సిపాలిటీలపై పట్టు కోసం..

ఈ ఏడాదిలో జరిగే మున్సిపల్ ఎన్నికల కోసం ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు వ్యక్తి గత ప్రతిష్టతలకు పోతున్నట్లుగా కనబడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కొత్తగా మూడు మున్సిపాలిటీలు ఏర్పాటు అయ్యాయి. వాటిలో నిజాంపేట, దుండిగల్, కొంపల్లి ఉన్నాయి. ఈ మూడు మున్సిపాలిటీల్లో తన మనుషులు మున్సిపల్ చైర్మెన్లు కావాలనే పట్టుదల ఇద్దరికీ ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే ఆ మూడు మున్సిపాలిటీల్లో చైర్మన్ అభ్యర్ధులను కూడా అటు ఎమ్మెల్సీ, ఇటు ఎమ్మెల్యేలు ఎంపికచేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే వివేకానందగౌడ్ నియోజక వర్గంలోని విశ్వాసపాత్రులైన పార్టీ నాయకులను ఇటీవల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పరిచయం చేశారని, దానిని ఎమ్మెల్సీ శంభీపూర్రాజు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా పార్టీ నాయకులు భావిస్తున్నారు.

Latest Updates