TRS ముఖ్య నేతల మధ్య అంతర్గత కలహాలు

TRS ముఖ్య నేతల మధ్య అంతర్గత కలహాలు

నిజామాబాద్ జిల్లాలో TRS నేతల మధ్య అంతర్గత కలహాలు మొదలైనట్టు తెలుస్తోంది. కొన్ని రోజులుగా పార్టీ నేతల మధ్య దూరం పెరుగుతున్నట్టు చెబుతున్నారు. జిల్లాలో ఉన్నఇద్దరు కీలక నేతలు... ఇటీవల ఒక్క కార్యక్రమానికి కూడా కలిసి హాజరుకాకపోవడంతో అనుమానాలను పెంచింది. నేతలిద్దరూ వేర్వేరుగా కార్యక్రమాలకు అటెండ్ అవుతుండటంతో ఏమైందో కార్యకర్తలకు అర్థం కావడం లేదు. 

ఈమద్య మూడు రోజుల పాటు జిల్లాకు చెందిన మంత్రి ప్రశాంత్ రెడ్డీ, MLC కల్వకుంట్ల కవిత ఇద్దరు జిల్లాలో పర్యటించారు. చాలా రోజుల తర్వాత MLC కవిత జిల్లాలో చాలా సమయం గడిపారు. ఇదే సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డీ కూడా జిల్లాలోనే ఉన్నారు. వీరిద్దరూ ఏ కార్యక్రమానికీ ఇద్దరూ కలిసి వెళ్ళలేదు. ఆయా కార్యక్రమాలకు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళారు. ఇదే ఇప్పుడు TRS వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి ప్రశాంత్ రెడ్డీ, ఎమ్మెల్సీ కవిత గత కొన్ని రోజులుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. తాజా పర్యటనతో ఇద్దరి మద్య గ్యాప్ ఉందన్నది క్లియర్ గా అర్థం అయిందంటున్నారు పార్టీ కార్యకర్తలు.

ఈనెల 11న ఎమ్మెల్సీ  కవిత నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలోని మెంట్రాజ్ పల్లిలో కాళేశ్వరం 21 ప్యాకేజి పనులను సందర్శించారు. అధికారులతో మాట్లాడి ప్యాకేజి వివరాలు తెలుసుకున్నారు. ఈ సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి తన నియోజక వర్గం బాల్కోండలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గోన్నారు. ఈనెల 12 ఉదయం... కవిత నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్ఎల్ఏ బిగాల గణేష్ గుప్తా చేపట్టిన అన్నదాన కార్యక్రమాన్ని పరిశీలించటానికి వెళ్ళారు. ఈ సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డీ బాల్కొండలో వివిధ కార్యక్రమాల్లో పాల్గోన్నారు. మద్యాహ్నం ఒంటి గంటకు కవిత నిజామాబాద్ లో కొత్తగా నిర్మిస్తున్నపార్టీ ఆఫీసును సందర్శించారు. ఈ సమయంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి కలెక్టరేట్ లో వ్యవసాయ శాఖపై రివ్యూలో పాల్గొన్నారు.  తర్వాత మద్యాహ్నం రెండింటికి ప్రశాంత్ రెడ్డీ... పార్టీ ఆఫీసును సందర్శించారు. మంత్రి ప్రశాంత్ రెడ్డీ రివ్యూ అయ్యాక ఎమ్ఎల్సి కవిత కూడా జిల్లా కలెక్టర్ ని కలిసి జిల్లాలో పనులపై చాలా సేపు మాట్లాడారు. 

గత శుక్ర, శనివారాల్లో మంత్రి ప్రశాంత్ రెడ్డీ, ఎమ్ఎల్సి కవిత జిల్లాలోనే ఉన్నప్పటికీ...వివిధ కార్యక్రమాలకు విడివిడిగా హాజరయ్యారు. ఇదే అంశం జిల్లా పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. కవితకు మంత్రి పదవి ఇస్తారన్నచర్చ నడుస్తుండగా... ఇప్పుడు వీళ్ళిద్దరూ విడివిడిగా కార్యక్రమాలకు హాజరవడంతో...ఈ ఇద్దరి మద్య గ్యాప్ ఉందన్నది బయటపడింది. కవితతో తన మంత్రి పదవికి గండం పొంచి ఉందని ప్రశాంత్ రెడ్డీ భావిస్తున్నారని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. కవిత యాక్టివ్ రోల్ ప్లే చేయడం మంత్రి ప్రశాంత్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని TRSలో ఓ వర్గం నేతలంటూన్నారు. వారం క్రితమే పార్టీ ఆఫీసును చూసెళ్ళిన ప్రశాంత్ రెడ్డి, కవిత వెళ్ళగానే మళ్ళీ ఎందుకు ఆఫీసుకు వెళ్ళారని ప్రశ్నిస్తున్నారు. 

ఎమ్మెల్సీ కవితకి మంత్రి పదవి అంశం నిజామాబాద్ జిల్లా పార్టీలో కలకలం రేపుతోందనీ... గందర గోళం తలెత్తుతోందని అంటున్నారు. ప్రశాంత్ రెడ్డీకి మంత్రి పదవి ఇవ్వటం మొదటి నుంచీ ఇష్టంలేని MLAలు, ఆయనకు సహకరించని MLAలు... ఇప్పుడు కవితకి ఆ పదవి వస్తోందని బహిరంగంగానే తమ అనుచరులతో చెప్పుకుంటూన్నారు.